వ్యవసాయ వర్సిటీపై పట్టింపేదీ? పూర్తిగా గాలికొదిలేసిందంటూ..!

ABN , First Publish Date - 2023-05-29T11:57:47+05:30 IST

వ్యవసాయ విశ్వవిద్యాలయం గతంలో జాతీయ స్థాయిలో ఆరో స్థానంతో వెలుగువెలిగిపోయింది. ఇప్పుడది 31వ స్థానానికి పడిపోయింది. గాడితప్పిన పాలనే

వ్యవసాయ వర్సిటీపై పట్టింపేదీ? పూర్తిగా గాలికొదిలేసిందంటూ..!
Jayashankar University

10 నెలలుగా కొనసాగుతున్న ఇన్‌చార్జి వీసీ పరిపాలన

ఆరు నుంచి 31కి పడిపోయిన వర్సిటీ జాతీయ ర్యాంకు

యూనివర్సిటీ అధికారుల నియామకాలూ పెండింగ్‌

జయశంకర్‌ యూనివర్సిటీని గాలికొదిలేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌, మే 28 (ఆంధ్రజ్యోతి): ఆచార్య జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. నెలలు గడుస్తున్నా ఈ యూనివర్సిటీకి ఉపకులపతి (వీసీ)ని నియమించకుండా నెట్టుకొస్తున్నారు. యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌గా పనిచేసిన వి.ప్రవీణ్‌రావు గతేడాది జూలైలో పదవీ విరమణ చేయగా.. ఆయన స్థానంలో కొత్త వీసీని నియమించకుండా రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్న రఘునందన్‌రావుకు ఇన్‌చార్జి బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. అప్పటికే రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీతోపాటు వ్యవసాయ, అనుబంధ శాఖలకు చెందిన పలు కీలక పదవుల్లో రఘునందన్‌రావు తలమునకలై ఉన్నారు. అయినా అదనంగా వ్యవసాయ వర్సిటీ ఇన్‌చార్జి వీసీ పదవినీ కట్టబెట్టారు. దీంతో ఆయన యూనివర్సిటీకి సమయం కేటాయించలేక నెలలో రెండు, మూడుసార్లు యూనివర్సిటీని సందర్శిస్తున్న పరిస్థితి. దీంతో యూనివర్సిటీ పరిపాలన, నిర్వహణ పూర్తిగా గాడితప్పింది. పూర్తిస్థాయి వీసీ లేకపోవటం, వ్యవసాయరంగం నేపథ్యం ఉన్న అధికారికాకపోవటంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విస్తరణ కార్యక్రమాలతోపాటు పరిశోధన స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, డాట్‌ సెంటర్ల నిర్వహణ గాడి తప్పుతోంది. వర్సిటీ పరిధిలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 500మంది ఉండగా వీరిలో 150పైచిలుకు మంది పరిశోధనల్లోనే ఉన్నారు. వీరిపై వీసీ పర్యవేక్షణ లేకపోవడంతో పరిశోధనలపై సమీక్ష జరగడం లేదు. వాస్తవానికి వర్సిటీ నిబంధనల ప్రకారం ప్రొఫెసర్‌గా 10 ఏళ్ల అనుభవం, 25 ఏళ్ల సర్వీసుతోపాటు వ్యవసాయ విద్యలో డిగ్రీలు కలిగి ఉంటే వీసీ పోస్టుకు అర్హత ఉంటుంది. ఇక వీసీ నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ‘సెర్చ్‌ కమిటీ’ వేయలేదు. వీసీ నియామకానికి ఎలాంటి ప్రక్రియ ప్రారంభించలేదు. జయశంకర్‌ యూనివర్సిటీలో అనుభవం, అర్హతలు ఉన్న ప్రొఫెసర్లు డాక్టర్‌ ఎస్‌జే రహమాన్‌, డాక్టర్‌ ఎంవీ రమణ, డాక్టర్‌ జెల్లా సత్యనారాయణ, డాక్టర్‌ ఎం.గోవర్దన్‌, డాక్టర్‌ సుహాసిని తదితరులు వీసీ ఆశావహుల జాబితాలో ఉన్నారు. పదవీ విరమణ చేసిన ప్రొఫెసర్లలో తాజా మాజీ పరిశోధన విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ రుమాండ్ల జగదీశ్వర్‌, డాక్టర్‌ డి.రాజిరెడ్డిలు వీసీ పదవిని ఆశిస్తున్నారు.

31వ స్థానానికి పడిపోయిన ర్యాంకు..

వ్యవసాయ విశ్వవిద్యాలయం గతంలో జాతీయ స్థాయిలో ఆరో స్థానంతో వెలుగువెలిగిపోయింది. ఇప్పుడది 31వ స్థానానికి పడిపోయింది. గాడితప్పిన పాలనే ఇందుకు కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎంబీబీఎస్‌ కోర్సు తర్వాత వ్యవసాయ కోర్సులకు నానాటికీ డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో జయశంకర్‌ యూనివర్సిటీ ర్యాంకు పడిపోవటం విద్యార్థులు, పరిశోధకులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఒకప్పుడు అన్నిరంగాల్లో ముందున్న వర్సిటీ ఇప్పుడు అన్నింట్లో వెనకబడిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అటకెక్కిన యూనివర్సిటీ అధికారుల నియామకం

జయశంకర్‌ యూనివర్సిటీలో కీలకమైన అధికారుల నియామక ప్రక్రియ అటకెక్కింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి ఈ ప్రక్రియ పెండింగ్‌లో ఉంది. 2011 జూన్‌ నుంచి యూనివర్సిటీలో డీన్‌, డీఆర్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ఎక్స్‌టెన్షన్‌, డీన్‌ ఆఫ్‌ స్టూడెంట్‌ అఫైర్స్‌, డీన్‌ ఆఫ్‌ పోస్టు గ్రాడ్యుయేషన్‌ పోస్టుల నియామకం కూడా చేపట్టలేదు. పూర్తిస్థాయిలో ‘మేనేజ్‌మెంట్‌ బోర్డు’ నియామకమూ చేపట్టలేదు. కానీ కేసీఆర్‌ ప్రభుత్వం రిజిస్ట్రార్‌ పోస్టులో మాత్రం పదవీ విరమణ చేసిన ప్రొఫెసర్‌ను కూర్చోబెట్టింది. మూడేళ్లపాటు రెగ్యులర్‌ పోస్టు అపాయింట్‌మెంట్‌తోపాటు పూర్తి వేతనం(నెలకు సుమారు రూ.4 లక్షలు) ఇస్తూ కొనసాగిస్తుండటంపై యూనివర్సిటీ వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ విశ్రాంత అధికారి కూడా వీసీ రేసులో ఉన్నట్టు తెలుస్తోంది.

Updated Date - 2023-05-29T11:57:47+05:30 IST