న్యాయాధికారుల నియామకాల్లో ఇష్టారాజ్యం!

ABN , First Publish Date - 2023-01-26T00:34:27+05:30 IST

న్యాయమూర్తుల నియామకాల విషయమై దేశవ్యాప్తంగా చాలా విస్తృత చర్చ జరుగుతోంది. కాని న్యాయవిచారణ ప్రక్రియలో ఎంతో ప్రాధాన్యం గల...

న్యాయాధికారుల  నియామకాల్లో ఇష్టారాజ్యం!

న్యాయమూర్తుల నియామకాల విషయమై దేశవ్యాప్తంగా చాలా విస్తృత చర్చ జరుగుతోంది. కాని న్యాయవిచారణ ప్రక్రియలో ఎంతో ప్రాధాన్యం గల న్యాయాధికారుల నియామకాల విషయం ఎవరూ ప్రస్తావించటం లేదు. పట్టించుకోవటం లేదు. కిందిస్థాయి మేజిస్ట్రేట్‌ కోర్టుల్లో అసిస్టెంటు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు (ఎపిపిలు) ఉంటారు. వీరి సర్వీసు సీనియారిటి ప్రాతిపదికన గ్రేడ్‌–1।, గ్రేడు–2లుగా పిలువబడుతుంటారు. ఇటీవల కాలంలో వీరికి పదోన్నతి కల్పించి అసిస్టెంటు సెషన్స్‌ కోర్టుల్లో, జిల్లాస్థాయి సెషన్స్‌ కోర్టుల్లో కూడా నియమిస్తున్నారు. ఇంటర్వ్యూ తతంగం ఉన్నా ప్రభుత్వమే వీరిని నియమించేది. ఇటీవలే ఈ నియామకాలకు రాత పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఇక జిల్లా సెషన్స్‌ కోర్టుల్లో, అసిస్టెంట్‌ సెషన్స్‌ కోర్టుల్లో నియమితులయ్యే పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లని, అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లని జిల్లా ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించి, జిల్లా కలెక్టర్లు పంపే ప్యానల్‌ ఆధారంగా ప్రభుత్వమే నియమిస్తుంది. ఇక సివిల్‌ కోర్టుల్లో ప్రభుత్వం తరపున వాదించటానికి జిల్లా కోర్టు స్థాయిలో ఒక ప్రభుత్వ న్యాయవాదిని, జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టుల స్థాయిలో సహాయ ప్రభుత్వ న్యాయవాదుల్ని పై తరహాలోనే ప్రభుత్వం నియమిస్తుంది. దీనికి సంబంధించిన నియామకాల విషయం నేర విచారణ చట్టం (సిఆర్‌పిసి)లోని 24, 25 సెక్షన్లలో పొందుపరిచారు. కాంగ్రెసు ప్రభుత్వ కాలంలో (1990ల వరకు) జిల్లా కోర్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌కి రోజుకు వంద రూపాయలు మించని జీతం ఉండేది. సెలవులు పోను నెలకు వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వరకు మాత్రమే జీతంగా లభించేది. అయినా నిష్ణాతులైన న్యాయవాదులు, నిజాయితీపరులు చాలా ఎక్కువగా ఉండేవారు. ఆయా కోర్టుల్లో ఒకటి రెండు స్థానాల్లో ఉన్న ప్రముఖ న్యాయవాదులే ఎక్కువగా ఈ పదవుల్లో నియమితులయ్యేవారు. కొంతకాలం తర్వాత కొందరు అవినీతిపరులు వచ్చినా, వారు కూడా న్యాయశాస్త్ర పరిజ్ఞానపరంగా కొంచెం ఉన్నతంగానే ఉండేవారు. ఎనభైల చివర వరకు ఈ పరిస్థితి ఉండేది. ఆ తర్వాత కాలంలో ఏ మాత్రం న్యాయ పరిజ్ఞానం లేని అవినీతిపరుల నియామకాలు ఎక్కువయ్యాయి.

పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అంటే ఒక పక్షానికి చెందినవాడు కాదు. కాని ఈ అవగాహనతో వ్యవహరించేవారు చాలా అరుదు. పోలీసులు పెట్టిన కేసులు ఎలాటివైనా అడ్డంగా వాదించే ప్రాసిక్యూటర్ల సంఖ్య ఎక్కువైంది. నియామకాల్లో న్యాయ పరిజ్ఞానానికి కాక పాలక పార్టీ విధేయతకి పెద్దపీట వేస్తున్న క్రమంలో ఇంతకంటే ఎక్కువ ఆశించటం కూడా తప్పే.

ప్రభుత్వ సలహాదారుల పేరిట లక్షల్లో జీతాలు, ఇతర సౌకర్యాలు కల్పించి ప్రభుత్వ సొమ్ము విచ్చలవిడిగా దోచుకుంటున్నారని మాత్రమే పాఠకులకు తెలుసు. దశాబ్దాల తరబడి ఒక కోర్టుకి ఒక్కడే పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా సాగిన స్థితి నుంచి ఒక్కో చట్టానికి ఒక్కో ప్రాసిక్యూటర్‌ని నియమిస్తూ వారికి 50 వేల నుంచి లక్షా పాతికవేల రూపాయల దాకా చెల్లిస్తూ తమ పార్టీ విధేయ న్యాయవాదుల్ని స్పెషల్‌ ప్రాసిక్యూటర్లగా నియమిస్తున్న విచ్చలవిడితనాన్ని ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే చూడగలం. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్‌లో 54 మంది స్పెషల్‌ ప్రాసిక్యూటర్లని నియమించారు. మొన్న డిసెంబర్‌లో సిబిసిఐడి వారు మరో 13 మంది న్యాయవాదుల్ని స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లుగా నియమించుకున్నారు. భవిష్యత్తులో ఒక్కో కేసుకి ఒక్కో స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ని నియమించినా ఆశ్చర్యపోనక్కరలేదు. వాళ్లకున్న డజనుకు మించని కేసులు కోర్టులో వాదించటానికి ఒక ప్రాసిక్యూటర్‌, సలహాలివ్వటానికి మరో ప్రాసిక్యూటర్‌ని నియమించుకుంటూ విచ్చలవిడిగా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు. ఇందులో ఒకే కులం వారు మూడొంతులు ఉంటారనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అక్కడక్కడా ఒక ఎస్సీని, ఒక బీసీని నియమించారు.

హైకోర్టులో అడ్వకేట్‌ జనరల్‌(ఎజి)ని ముఖ్యమంత్రి నియమిస్తే, ఆ ఏజీ ఇష్టానుసారం జిపిలు, ఎజిపిలు నియమించబడతారు. కాంగ్రెసు కాలంలో సుబ్బారెడ్డి రామచంద్రారెడ్డి, భీమరాజులు లాంటి ఉద్దండులు ఏజీలుగా ఉండేవారు. ఎన్టీఆర్‌ కాలంలో ఇ.మనోహర్‌ ఉండేవారు. ఆ తర్వాత కాలంలో తాము నియమించిన వారి దోపిడి చూసి అవాక్కయిన రాజశేఖర్‌రెడ్డి ఏజీని మార్చుకున్నారు. ఇక జగన్‌ కాలంలో హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదులు కొందరు చుక్కలు చూపిస్తున్నారు. ఏజీని పక్కనపెట్టి తన వ్యక్తిగత కేసుల్లో న్యాయవాదిగా వ్యవహరించే వ్యక్తుల్ని సుప్రీంకోర్టులో నియమించుకోవటంతో వారు సీనియర్లని నియమిస్తున్నామనే పేరిట కోట్లాది రూపాయల్ని కొల్లగొడుతున్నారు. ఈ విషయం అందరికీ తెలిసినా ఎంపీ రఘురామకృష్ణంరాజు తప్ప ఎవరూ స్పందించలేదు. ఎన్నికల సమయంలో స్పందిద్దామనుకుంటున్న అమాయకులకు ఒక్కమాట, మీరు స్పందించేనాటికి ఏమైనా మిగలాలి కదా!

చెరుకూరి సత్యనారాయణ

Updated Date - 2023-01-26T00:34:27+05:30 IST