‘అప్పర్ భద్ర’ బీజేపీ భద్రతకే!

ABN , First Publish Date - 2023-02-07T02:18:35+05:30 IST

వడ్డించేవాడు మనవాడు అయితే బంతిలో ఎక్కడ కూర్చున్నా ఒకటే.. అని పెద్దల మాట. ఇది ఇప్పుడు రాష్ట్రాల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు సరిగ్గా సరిపోతుంది...

‘అప్పర్ భద్ర’ బీజేపీ భద్రతకే!

వడ్డించేవాడు మనవాడు అయితే బంతిలో ఎక్కడ కూర్చున్నా ఒకటే.. అని పెద్దల మాట. ఇది ఇప్పుడు రాష్ట్రాల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు సరిగ్గా సరిపోతుంది. ముఖ్యంగా మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం సహజ నైతిక, న్యాయసూత్రాల కట్టుబాట్లు అన్నీ తెంచేసుకొని, రాష్ట్రాలకు కొత్త ప్రాజెక్టులు కేటాయించే విషయంలో గానీ, వాటికి నిధులు కేటాయించే విషయంలో గానీ, కేవలం తమ పార్టీ ప్రయోజనాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తోంది. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల భవిష్యత్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఉదారంగా నిధులు ఇస్తూ, ఇతర రాష్ట్రాల పట్ల సవతి తల్లి ప్రేమను చూపుతోంది. మొన్నటి కేంద్ర బడ్జెట్‌లో కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు ఏకంగా రూ.5300 కోట్లు కేటాయించడం పక్షపాత రాజకీయాలకు ఒక ఉదాహరణ. ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించకుండానే, ఈ స్థాయిలో నిధులు కేటాయించడం కేంద్ర ప్రభుత్వ అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ఠ.

2014లో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడిన పోలవరానికి అరకొర నిధులు కేటాయిస్తూ వస్తున్నది. పోలవరానికి మొదటి మూడు సంవత్సరాలు బడ్జెట్‌లో కేవలం నామమాత్ర నిధులు (రూ.250, రూ.500, రూ.100 కోట్లు) కేటాయించిన కేంద్రం, తరువాత పోలవరాన్ని నాబార్డ్‌కు అప్పచెప్పి, రాష్ట్రం ఖర్చుపెట్టి నాబార్డ్ నుంచి రీయింబర్స్ చేసుకోమని చెప్పింది. ఇప్పటికే పోలవరంపై ఖర్చు పెట్టిన నిధులు వెనక్కి రాక, సంక్షేమ కార్యక్రమాల మోజులో ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులు కేటాయించలేక నానా ఇబ్బందులు పడుతున్నా కేంద్రానికి చీమకుట్టినట్లు లేదు. విభజన చట్టం ప్రకారం పూర్తిగా కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న కేంద్రం, ఈ అప్పర్‌ భద్ర విషయంలో మాత్రం పూర్తి ఆసక్తి చూపుతోంది.

కర్ణాటక తలపెట్టిన ఈ ప్రాజెక్టు వివాదాస్పదమైనది. నిజానికి 2008లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు వివి‍ధ కారణాలతో ముందుకు సాగలేదు. 2010లో ఈ ప్రాజెక్ట్‌కు వచ్చిన అనుమతుల ప్రకారం, తుంగ నది నుంచి 15 టి‌ఎం‌సిల నీటిని భద్ర రిజర్వాయర్‌కు తరలించి, ఆ రిజర్వాయర్ నుంచి మొత్తం 21.5 టి‌ఎం‌సిల నీటిని ఎత్తిపోసి, చిక్‌మంగళూర్, చిత్రదుర్గ జిల్లాలలో 1.07 లక్షల హెక్టార్లకు సాగునీటిని ఇవ్వడంతో పాటు ఆ జిల్లాలలో తాగునీటి కోసం 37 మైనర్ ఇరిగేషన్ టాంక్‌లకు నీటిని సరఫరా చేయాలని ప్రతిపాదించారు. ఆ తరువాత పోలవరానికి కేంద్రం అనుమతి ఇచ్చిన కారణంగా, బచావత్ ట్రిబ్యునల్ ఆదేశం ప్రకారం కృష్ణ జలాలలో కర్ణాటకకు 21 టి‌ఎం‌సిల అదనపు జలాలు ఉపయోగించుకొనే అవకాశం ఉందని ఈ ప్రాజెక్టు స్కోప్ పెంచుతూ, అప్పర్ భద్ర స్టేజ్–2 పనులు 2015లో తెరమీదకు తెచ్చారు. దీంతో తుంగ నది నుండి 17.40 టి‌ఎం‌సిలు లిఫ్ట్ చేసి భద్ర రిజర్వాయర్‌కు తరలించి, అక్కడ నుంచి 29.90 టి‌ఎం‌సిల నీటిని అజ్జంపూర టన్నెల్‌కు, అక్కడ నుంచి చిత్రదుర్గ, తుముకూరు బ్రాంచ్ కెనాల్స్‌కు తరలించి, దానిలో 19.04 టి‌ఎం‌సిలతో 2.26 లక్షల హెక్టార్లకు సాగునీరు, 10.86 టి‌ఎం‌సిల నీటితో 367 మైనర్ ఇరిగేషన్ టాంక్‌లు నింపాలని ప్రతిపాదించారు.

అమలులో ఉన్న జాతీయ సంబంధిత ప్రాజెక్టు నిబంధనల ప్రకారం ఒక అంతర్రాష్ట్ర ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా పరిగణించాలంటే, రాష్ట్రానికి కేటాయించిన జలాలలో ఆ ప్రాజెక్టుకు నీటి లభ్యతతో పాటు, ఇరిగేషన్ సామర్థ్యం రెండు లక్షల హెక్టార్ల కంటే ఎక్కువ ఉండాలి. కాబట్టి స్టేజ్–2 పేరుతో ఈ ప్రాజెక్టు స్కోప్ పెంచి దీన్ని జాతీయ ప్రాజెక్టుగా చేయాలని ప్రతిపాదించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు అనుమతులకు సంబంధించిన విషయంలో పారదర్శకంగా వ్యవహరించలేదు. 2020 సెప్టెంబర్‌ 14న రాజ్యసభలో ఒక లిఖిత ప్రశ్నకు సమాధానమిస్తూ, అప్పర్ భద్రను జాతీయ ప్రాజెక్టుగా చేయమంటూ రాష్ట్రం నుంచి నిర్ణీత ప్రొఫార్మాలో ఏ ప్రతిపాదన కూడా కేంద్ర హై పవర్డ్ స్టీరింగ్ కమిటీ ముందుకు రాలేదని కేంద్రం స్పష్టంగా చెప్పింది. కానీ తరువాత 16 నెలల్లో జాతీయ ప్రాజెక్టుగా పరిగణించడానికి సిఫార్సు చేయబడిందంటే, సాధారణంగా సంవత్సరాలు పట్టే పని.. ఎంత వేగంగా జరిగిందో గమనించవచ్చు.

లోక్‌సభలో 2022 జూలై 28న ఒక లిఖిత ప్రశ్నకు కేంద్రం సమాధానమిస్తూ ఈ ప్రాజెక్టు డి‌పి‌ఆర్ 2019 డిసెంబర్‌లో కేంద్ర జల సంఘానికి చేరిందని, దీనిని సాంకేతిక–ఆర్థిక అంశాల పరంగా అంతర్ రాష్ట్ర అంశాలు, ఇరిగేషన్, డిజైన్, నీటి లభ్యత–వినియోగం పరంగా పరిశీలించి, ఆమోదించి, కేంద్ర జలసంఘం జలవనరుల శాఖకు సంబంధించిన సాంకేతిక కమిటీ పరిశీలనకు పంపిందని తెలిపారు. సాధారణంగా ఒక ప్రాజెక్టు డి‌పి‌ఆర్‌ను కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలోని 17 డైరక్టెరేట్లు పరిశీలించి ఆమోదించాలి. దీనికి సంవత్సరాలు సమయం పట్టడం ఆనవాయితీ. కానీ అప్పర్‌ భద్ర విషయంలో ఇది యుద్ధప్రాతిపాదికన జరిగింది. ఇక ఆ సాంకేతిక కమిటీ కూడా ఈ ప్రతిపాదనలను 2020 ఆగస్టు 24న జరిగిన సమావేశంలో చర్చించి ఆమోదించింది. ఇక మార్చ్ 2021లో ఈ ప్రాజెక్టుకు పెట్టుబడి అనుమతి లభించింది. గత ఏడాది ఫిబ్రవరిలో హై పవర్డ్ స్టీరింగ్ కమిటీ, దీనిని జాతీయ ప్రాజెక్టును చేయమంటూ కేంద్రానికి సిఫార్సు చేసింది. ఆ కమిటీ ముందు ప్రతిపాదించిన ప్రకారం ఈ ప్రాజెక్టు ఖర్చు 2018–19 రేట్ల ప్రకారం రూ.16,125 కోట్లు. కానీ విచిత్రంగా అదే 2018–19 రేట్ల ప్రకారమే ఈ ప్రాజెక్టు ఖర్చును రూ.21,474 కోట్లుగా పేర్కొంటూ, ‘రీ–రివైజెడ్ డి‌పి‌ఆర్’ను ఆమోదిస్తూ కర్ణాటక ప్రభుత్వం 2020 డిసెంబర్‌ 16న ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ప్రాజెక్టు ఖర్చును 5349 కోట్లు పెంచేసింది. అయినా కేంద్రం ఈ ప్రాజెక్టుకు ఈ సంవత్సరం బడ్జెట్‌లో రూ.5300 కోట్లు కేటాయించింది. ప్రాజెక్టు అంచనాలను కర్ణాటక రాష్ట్రం ఏ మేరకు పెంచిందో, అంతే మొత్తాన్ని కేంద్రం బడ్జెట్‌లో కేటాయించడం కాకతాళీయమో– ‘కావల్సిన ఎన్నికల కార్యాలకోసమో’ ఆ పెరుమాళ్లకే ఎరుక.

ఈ ప్రాజెక్టుపై అప్పటికే 4,830 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, 30 శాతం పనులు పూర్తి చేసి, ఇప్పుడు కమిటీ వద్దకు ఎందుకు వచ్చారని; ఈ ప్రాజెక్టు కాస్ట్–బెనిఫిట్ రేషియో (1:1.024) ఆమోదయోగ్యం కాదని; కొత్తగా ఆయకట్టు ప్రతిపాదించడం వల్ల ఇప్పటికే తుంగ–భద్ర నదుల మీద నడుస్తున్న నిర్మాణంలో ఉన్న జల విద్యుత్, ఆయకట్టులపై ప్రతికూల ప్రభావం పడుతుందని; ఈ ప్రాజెక్టు ఎస్టాబ్లిష్‌మెంట్ ఖర్చులు కూడా ప్రాజెక్టు ఖర్చులో కలిపి చూపారని; ప్రాజెక్టు నిర్మాణం తరువాత వచ్చే పంట దిగుబడి.. సగటు కంటే చాలా ఎక్కువగా చూపారని... జలవనరుల శాఖ సాంకేతిక కమిటీ పలు అభ్యంతరాలు వ్యక్తం చేసి కూడా.. రాజకీయ ఒత్తిడితో ఆమోదించినట్లు కనబడుతుంది.

ప్రాజెక్టు వల్ల తుంగ నదిలో అదనంగా నీటిని వినియోగించడం వల్ల కింద ఉన్న రాయలసీమలో తుంగభద్రపై ఆధారపడ్డ ప్రాంతాలకు నీటి సరఫరా తగ్గుతుంది. కాబట్టి ఈ అదనపు నీటి వినియోగంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అభ్యంతరాలున్నాయి. గతంలో తుంగభద్ర లోయర్ లెవల్ కెనాల్ రైతులు నీటి విడుదల కోసం కోర్టులను ఆశ్రయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా పైనే, కర్ణాటకలో ఈ నదుల నుంచి నీళ్ళను తోడేస్తే, తుంగ–భద్రలలో నీటి ప్రవాహం తక్కువగా ఉండే సంవత్సరాలలో క్రిందకు నీరు వచ్చే అవకాశం ఉండదు. ముందుగా మేల్కొన్న తెలంగాణ ప్రభుత్వం 2021 మార్చిలో కేంద్రానికి ఈ ప్రాజెక్టు అనుమతులు సమీక్షించాలంటూ లేఖ రాసింది. దానికి కేంద్ర జలసంఘం జూన్‌లో సమాధానం ఇచ్చినా సంతృప్తి చెందక, ఈ ప్రాజెక్టు అనుమతులపై తన అభ్యంతరాలను మళ్ళీ జూలైలో లేఖ ద్వారా కేంద్రానికి తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2021 డిసెంబర్‌లో స్పందిస్తూ ఈ ప్రాజెక్టు అనుమతులు కృష్ణ ట్రిబ్యూనల్–2 తీర్పు పబ్లిష్ చేసేవరకు నిలపాలని కోరినప్పటికీ కేంద్రం అంగీకరించకుండా, గత ఏడాది జనవరిలో రాష్ట్రానికి వివరణ లేఖ పంపింది. దానిమీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించినట్లు లేదు. కానీ ఈ అభ్యంతరాలు ఏవీ పట్టించుకోకుండా కేంద్రం మాత్రం ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించింది.

అప్పర్‌ భద్రకు జాతీయ హోదా ఇవ్వడం ఇక ఫార్మాలిటీనే కాబట్టి, జాతీయ ప్రాజెక్టుల నిబంధనల ప్రకారం ఈ ప్రాజెక్టు మిగిలిన ఖర్చులో కేంద్రం 60 శాతం నిధులు ఇవ్వవలసి ఉంటుంది. ఇప్పటికే కేంద్రం ఆమోదించిన ఈ ప్రాజెక్టు అంచనా విలువ రూ.16,125 కోట్లలో రాష్ట్రం పెట్టిన రూ.4,830 కోట్లు పోనూ, మిగిలిన రూ.11,295 కోట్లలో 60శాతం అంటే రూ.6,777 కోట్లు కేంద్ర బాధ్యత. ఇక కర్ణాటక ప్రభుత్వ కొత్త రీ–రివైజెడ్ అంచనాల ప్రకారం అయితే.. మరో రూ.3,209 కోట్లు అదనంగా అంటే రూ.9,986 కోట్లు కేంద్రం బాధ్యత అన్నమాట. ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇది కేంద్రం ఎంతో ఇష్టంగా తలకెత్తుకున్న బాధ్యత.

ఇక పోలవరంతో సహా మొత్తం 16 ఇరిగేషన్ ప్రాజెక్టులు జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించబడినా అప్పర్ భద్ర పట్ల చూపిన ఔదార్యం, మిగిలిన వాటి పట్ల చూపడం లేదు. దాంతో అవి నత్తనడకన నడుస్తున్నాయి. ముఖ్యంగా పోలవరం పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నది. ఇక తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూ.లక్ష కోట్లతో దాదాపు 7.39 లక్షల హెక్టార్లకు సాగునీటిని ఇవ్వడంతో పాటు మరో 7.62 లక్షల హెక్టార్ల మేర ఇప్పటికే ఉన్న ఆయకట్టును స్థిరీకరించడానికి తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాకు కావల్సిన అన్నీ అర్హతలు ఉన్నా, కేంద్రం ప్రకటించడం లేదు.

సమాఖ్య రాజ్యంలో రాష్ట్రాల ప్రయోజనాలను మరిచి, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం ఈ వైఖరిని విడనాడాలి. లేదంటే దేశ ప్రజల మధ్య భేదభావాలు సృష్టించిన అపఖ్యాతిని మూటకట్టుకోవలసి రావడం ఖాయం.

శ్రీ వెంకటసూర్యఫణి తేజ దినవహి

Updated Date - 2023-02-07T02:18:38+05:30 IST