రాజ్యాంగ ‘పీఠిక’ను రద్దు చేసే పాలన!

ABN , First Publish Date - 2023-01-26T00:43:40+05:30 IST

భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడాని...

రాజ్యాంగ ‘పీఠిక’ను రద్దు చేసే పాలన!

భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి, పౌరులందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం చేకూర్చడానికి, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుకోవడానికి... రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం అని రాజ్యాంగ పీఠిక ప్రకటిస్తుంది. రాజ్యాంగం 74వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో పీఠికలోని అంశాలను విడివిడిగా విశ్లేషించుకుంటే పాలకపార్టీకి రాజ్యాంగం పట్ల ఎంత గౌరవం ఉందో అర్థమవుతుంది.

సార్వభౌమత్వం: పరాయి పాలనలో ఉన్న భారతదేశాన్ని బానిస సంకెళ్ళ నుంచి విముక్తి చేసి, స్వయం పాలన, స్వయం సమృద్ధి సాధించాలని అనేక మంది స్వాతంత్ర్య సమరయోధులు పోరాటాలు, ఆత్మబలిదానాలు చేశారు. కాని ఏడు దశాబ్దాల తరువాత పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. విదేశీ, కార్పొరేట్‌, బహుళజాతి సంస్థలపై ఆధారపడే విధంగా కేంద్ర ప్రభుత్వం చట్టాలను మారుస్తోంది, కొత్త చట్టాలను తీసుకువస్తోంది. దీంతో పరోక్షంగా సార్వభౌత్వాన్ని కోల్పోతున్నాం. క్రమంగా పరాధీన దేశంగా మారిపోయే పరిస్థితుల్లోకి నెట్టబడుతున్నాం. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలో కేవలం ఐదు ప్రభుత్వ రంగ సంస్థలు ఉండేవి. ఆ స్థితి నుంచి 400 ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మించుకొని స్వావలంబన దిశగా అడుగులు వేశాం. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చే నాటికే ప్రపంచంలోని ఐదు పెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా భారత దేశం ఉన్నది. కానీ, నేడు మోదీ బహుళజాతి కంపెనీలు, ఆదాని, అంబాని లాంటి అతికొద్ది కార్పొరేట్‌ సంస్థల ప్రయోజనాలు కాపాడే విధంగా, ప్రభుత్వ రంగాన్ని విచ్ఛిన్నం చేసే దిశగా పార్లమెంటులో చట్టాలు చేశారు. కేవలం నాలుగు రంగాల్లో– అనగా అణు ఇంధనం, అంతరిక్షం, రక్షణ, రవాణా, టెలీ కమ్యూనికేషన్ల రంగాల్లో– అతి స్వల్ప భాగస్వామ్యం ఉండేలా, మిగిలిన అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను దశలవారీగా అమ్మే విధంగా కేంద్రం పార్లమెంటులో చట్టాలను చేసింది.

సామ్యవాదం, లౌకికం: ప్రభుత్వ, ప్రైవేటు రంగాలతో కూడిన ప్రణాళికా విధానం ద్వారా మిశ్రమ ఆర్థిక విధానాన్ని అనుసరించి దేశాన్ని పురోగమనం వైపు నడపడానికి నెహ్రూ కాలంలో ప్రయత్నం జరిగింది. ఈ దశలో ప్రజలకు ప్రభుత్వ ఫలాలు మరింతగా అందేవిధంగా, లౌకిక విధానంతో మత సామరస్యతతో కూడిన ఉజ్వల భవిష్యత్‌ వైపు దేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళే విధంగా 1976లో శ్రీమతి ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ సవరణ ద్వారా రాజ్యాంగ పీఠికలో లౌకిక (సెక్యులర్‌), సామ్యవాదం (సోషలిస్టు) పదాలను పొందుపరిచారు. ముందుగా పేర్కొన్న విధంగా ప్రభుత్వ రంగాన్ని అమ్మి వేయడం ద్వారా సామ్యవాద భావనకు తిలోదకాలు ఇస్తూ లౌకికత్వానికి తూట్లు పొడిచే విధంగా కేంద్రంలోని పాలకులు అనునిత్యం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేశ ప్రధాని రాజ్యాంగానికి పదేపదే ప్రణమిళ్ళుతారు. అదే సమయంలో మనుధర్మాన్ని రాజ్యాంగంగా మార్చడానికి ఉవ్విళ్లూరుతారు. అంబేడ్కర్‌ను, రాజ్యాంగాన్ని మాటల్లో ప్రశంసిస్తారు. అదే సమయంలో మనువు ప్రవచించిన, హెగ్డేవార్, గోల్‌వాల్కర్లు పలవరించిన చాతుర్వర్ణ వ్యవస్థను సంపూర్ణంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తారు. మత విద్వేషాలకు అతీతంగా మనిషి, మానవ విలువలను ప్రపంచానికి ఘనంగా చాటిన మహోన్నత మానవతావాది వివేకనందుడిని కూడా ఓట్ల రాజకీయాల కొరకు ఉపయోగించుకుంటారు. ఆనాడే తన సైన్యాధిపతిగా ముస్లింను, తన సైన్యంలో మూడోవంతుగా ముస్లింలను నియామకం చేసుకొని లౌకికతత్వాన్ని ఘనంగా చాటుకున్న మరాఠయోధుడు ఛత్రపతి శివాజీని కూడా తమ హిందుత్వ ఉన్మాద కౌగిలిలో బంధిస్తున్నారు. దేశానికి, రాజ్యాంగానికి రక్షణ కర్తగా ఉండవల్సిన రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, రాజ్యాంగం పీఠిక నుంచి సామ్యవాద, సెక్యులర్‌ పదాలను తొలగించాలని బహిరంగంగా ప్రకటన చేశారంటే రాజ్యాంగం పట్ల మోదీ ప్రభుత్వానికి ఎంత గౌరవం ఉన్నదో అర్థమవుతున్నది.

ప్రజాస్వామ్యం: మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజాస్వామ్యమనే పదానికి అర్థమే మార్చేశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలదోసి, ప్రజాతీర్పునకు భిన్నంగా ఎనిమిది రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను ఈడీ, ఐటీ, సీబీఐ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా, ప్రలోభాల ద్వారా లొంగదీసుకొని నిస్సిగ్గుగా బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. దారిలోకి రాని చోట నామినేటెడ్‌ గవర్నర్లను అడ్డుపెట్టుకొని ప్రజాప్రభుత్వాలను ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్‌ తదితర రాష్ట్రాల్లో బీజేపీయేతర పార్టీల నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలకు గవర్నర్లూ, లెఫ్టినెంట్‌ గవర్నర్లూ ఏ విధంగా అడ్డంకులు సృష్టిస్తున్నారో మనకు తెలిసిందే.

గణతంత్రం: రాచరిక, నియంతృత్వ వ్యవస్థల్లాగా అధికారం ఏ ఒక్కరి చేతుల్లోనే కేంద్రీకృతం కాకుండా ఉండడం గణతంత్ర లక్షణం. అందుకే అధికారాలు కేంద్రీకృతం కాకుండా రాజ్యాంగం స్పష్టంగా కేంద్ర అధికారాల జాబితా, రాష్ట్ర అధికారాల జాబితా, ఉమ్మడి అధికార జాబితా అంటూ మూడు జాబితాలుగా విభజించింది. కాని మోదీ ప్రభుత్వం ఈ ఫెడరల్‌ స్ఫూర్తిని కాలరాస్తూ రాష్ట్ర జాబితాలో ఉన్న అధికారాలను సైతం తమ చేతుల్లోకి లాగేసుకుంటున్నది. వ్యవసాయం, విద్యుత్‌, విద్య, జీఎస్టీ పన్ను విధింపు లాంటి చట్టాలే ఇందుకు ఉదాహరణ.

న్యాయం: సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం మోదీ పాలనలో మచ్చుకైనా లేవు. ప్రైవేటీకరణకు పెద్ద పీట వేస్తూ, రిజర్వేషన్లు లేని దిశగా సాగుతూ, రాజ్యాంగం ప్రవచించిన సామాజిక న్యాయాన్ని కనుమరుగయ్యేలా చేస్తున్నారు. బ్రిటీష్‌ కాలంలోనే సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేస్తూ, యజమానులకు అనుకూలంగా నాలుగు కార్మిక కోడ్‌లను తీసుకువచ్చారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల స్కాలర్‌‍షిప్‌లు నిలిపివేయడం, ఉపాధి హామీ నిధుల కోత విధించడం వంటి చర్యల ద్వారా ఆర్థిక న్యాయం జరగకుండా ఆటంకాలు సృష్టిస్తున్నారు. ‘సబ్‌ కా సాత్‌ – సబ్‌ కా వికాస్‌’ అని ఘనంగా చెప్పుకునే బీజేపీ ప్రభుత్వంలో భారతదేశ చరిత్రలోనే మొదటిసారిగా కేంద్ర మంత్రి వర్గంలో ముస్లిం వర్గానికి చెందిన ఒక్కరికి కూడా ప్రాతినిధ్యం లేకుండా చేసి 15 శాతం జనాభాకు రాజకీయ న్యాయాన్ని విస్మరిస్తున్నారు.

స్వేచ్ఛ: బీజేపీ పాలనలో ప్రశ్నించే గొంతులను నులిమేస్తున్నారు. భావప్రకటనా స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడులు చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలను నిలదీసినందుకు ప్రొఫెసర్‌ సాయిబాబా, వరవరరావు, జర్నలిస్టు కప్పన్‌, కన్హయ్య కుమార్‌, ‘ది వైర్‌’ సంపాదకులు సిద్ధార్థ వరదరాజన్‌ తదితరులపై కేసులు పెట్టారు. అంతేగాక, వారికి బెయిల్‌ రాకుండా నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఎజెన్సీ ద్వారా కేసులపై కేసులు పెడుతున్నారు. సమాజంలో హేతువాత దృక్పథాన్ని పెంపొందిస్తూ, మతోన్మాదాన్ని ఎండగడుతూ రచనలు చేసిన దబోల్కర్‌, గోవింద్‌ పన్సారే, ప్రొఫెసర్‌ కల్బుర్గి, గౌరీ లంకేశ్‌లను దారుణంగా హతమార్చారు. ఏమి తినాలో, ఏమి ధరించాలో, ఏ ధర్మాన్ని ఆచరించాలో, ఏ ధర్మాన్ని ఆచరించవద్దో, ఏ భాష మాట్లాడాలో వారే చెబుతున్నారు. స్వేచ్ఛ ఎక్కడ ఉన్నది?

సమానత్వం: బీజేపీ ప్రభుత్వ విధానాల ఫలితంగా ఏడు దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా భారతదేశంలో ధనిక, పేదల మధ్య అంతరాలు పెరిగిపోయాయి. ఇటీవల ఆక్స్‌ఫామ్‌ నివేదికలో దేశంలోని ఒక్క శాతం ప్రజల చేతిలో 40శాతం జాతి సంపద కేంద్రీకృతమై ఉన్నదని, అలాగే సగం జనాభా చేతిలో కేవలం 3శాతం సంపదే ఉన్నదని తేటతెల్లమైంది. కార్పొరేట్‌ సంస్థలకు బెయిల్‌ అవుట్ల పేరుతో, ఆర్థిక ప్యాకేజీల పేరుతో ఈ ఎనిమిదేళ్ల కాలంలో లక్షల కోట్లు ధారాదత్తం చేస్తున్న ఈ ప్రభుత్వం తిరిగి ఇటీవల కాలంలో 10 లక్షల కోట్లను పారుబకాయి పేరుతో రద్దు చేసింది. పేదవాడికి ఇచ్చే సబ్సిడీలను మాత్రం సాక్షాత్తు ప్రధానమంత్రే ‘రేవడి కల్చర్‌’ పేరుతో అవహేళన చేస్తూ రద్దు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

సౌభ్రాతృత్వం: అన్నదమ్ముల్లా కలిసి ఉండే మతాల మధ్య విద్వేష చిచ్చును రగిలిస్తూ సౌభ్రాతృత్వానికి బదులు శత్రుత్వానికి బీజాలు వేస్తున్నారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు, వారికి వెన్నుదన్నుగా ఉండే సిద్ధాంతకర్తలు ఆరెస్సెస్, బీజేపీ నాయకులు... ప్రతి సందర్భంలోనూ, ప్రత్యేకించి ఎన్నికల కాలంలో, సామాజిక మాధ్యమాల ద్వారా మత, కుల విద్వేషాలను రెచ్చగొడుతున్నారు.

రాజ్యాంగ పీఠికలోని అంశాలన్నిటినీ మోదీ ప్రభుత్వం బలిపీఠం ఎక్కిస్తున్నది. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వారే రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమంటే దేశద్రోహమే. ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగాన్ని పరిరక్షించే మహోన్నత బాధ్యతను ప్రతి పౌరుడు కర్తవ్యంగా తీసుకోవాలి. దేశాన్ని మతోన్మాద, ఫాసిస్టు శక్తుల నుండి కాపాడాలి.

కూనంనేని సాంబశివరావు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ

Updated Date - 2023-01-26T00:43:42+05:30 IST