ముఖ్యమంత్రి తీరు హాస్యాస్పదం!

ABN , First Publish Date - 2023-02-07T02:05:19+05:30 IST

ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిగా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని, అప్పటి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన...

ముఖ్యమంత్రి తీరు హాస్యాస్పదం!

ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిగా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని, అప్పటి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు పలుకుతూ మాట్లాడారు. అలాగే ఎన్నికల సందర్భంలో అమరావతే రాజధానిగా ఉంటుందని, తాము అధికారంలోకి వస్తే అమరావతిని మరింత అభివృద్ధి చేస్తామని నమ్మబలికారు. తీరా అధికారంలోకి వచ్చాక, అసలు రాజ్యాంగంలో రాజధానే లేదన్నారు. మళ్లీ అందుకు విరుద్ధంగా అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ మూడు రాజధానుల తీర్మానంతో బిల్లు పాస్ చేశారు. న్యాయస్థానం వివరణ అడగడంతో న్యాయపరమైన చిక్కులు వస్తాయన్న భయంతో ఆ తీర్మానానికి నీళ్లొదిలి ఒకే రాజధానిగా అమరావతే ఉంటుంది, మూడు రాజధానుల తీర్మానాన్ని ఉపసంహరించుకున్నామని అఫిడవిట్‌ను కోర్టుకు సమర్పించారు. న్యాయస్థానం కూడా అమరావతి ఒక్కటే రాష్ట్ర రాజధాని అని, అది అందరి ఆమోదంతో జరిగిన నిర్ణయం అని, అందుకు విరుద్ధంగా ప్రభుత్వ కార్యాలయాలు తరలించకుండా అమరావతిలో నిర్మాణాలను ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను ప్రభుత్వం బేఖాతరు చేస్తూ కాలయాపన చేసి, ఏడు నెలల తర్వాత, అసలు రాష్ట్ర హైకోర్టుకు ఆవిధంగా ఆదేశాలు ఇచ్చే హక్కు లేదని, అది శాసన వ్యవస్థలో జోక్యం చేసుకోవడమేనని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అక్కడ విచారణ ప్రక్రియ ముగియకుండానే, తీర్పు రాకుండానే విశాఖకు రాజధానిని తరలిస్తున్నామని ముఖ్యమంత్రి ఢిల్లీలో ప్రకటించడం అనైతిక, అసంబద్ధ చర్య. అసలు రాష్ట్ర హైకోర్టుకు అధికారం లేదు అని చెప్పిన ప్రభుత్వం ఆ హైకోర్టులో అఫిడవిట్ ఎందుకు దాఖలు చేసింది? అఫిడవిట్ దాఖలు చేశారంటే అధికారాన్ని అంగీకరించడమే కదా? ఒకసారి అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత అందుకు విరుద్ధమైన నిర్ణయం చేయడం కోర్టు ధిక్కరణ అవుతుంది కదా? ముఖ్యమంత్రి తన అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నారు. అధిక వడ్డీలకు అపరిమితమైన రుణాలు తీసుకువచ్చి ప్రజలపై రుణభారం పెంచారు. అభివృద్ధి శూన్యం. మరోవైపు ఉద్యోగులకు చెల్లించవలసిన బకాయిలు పెరిగిపోతున్నాయి. గుత్తేదారులకు, వివిధ శాఖలకు సరఫరా, సేవలు అందించిన వారికి ప్రభుత్వం చెల్లించవలసిన బిల్లుల విలువ లక్ష కోట్ల రూపాయల పైమాటే. ఈ పరిస్థితుల్లో రాజధాని తరలింపు సాధ్యమేనా? ఇప్పటికే ప్రభుత్వ పాలన అంతా న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నది. నాలుగు వేల పైచిలుకు కోర్టు ధిక్కార వ్యాజ్యాలతో అధికారులు సతమతమవుతున్నారు! రాష్ట్ర గవర్నర్, కేంద్ర ప్రభుత్వం ఈ వికృతకేళిని చూస్తూ ఉపేక్షించడం వారి రాజ్యాంగ విధులను నిర్వర్తించడంలో వైఫల్యం చెందారని భావించాలి.

గరిమెళ్ల రామకృష్ణ, ఏలూరు

Updated Date - 2023-02-07T02:05:21+05:30 IST