రాజ్యాంగ విరుద్ధం

ABN , First Publish Date - 2023-01-12T00:30:39+05:30 IST

విపక్షపార్టీలు అధికారంలో ఉన్న ఆయా రాష్ట్రాల్లో గవర్నర్లు ప్రవరిస్తున్న తీరు చూస్తూనే ఉన్నాం కనుక, తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి వ్యవహారం పెద్దగా ఆశ్చర్యపరచదు.

రాజ్యాంగ విరుద్ధం

విపక్షపార్టీలు అధికారంలో ఉన్న ఆయా రాష్ట్రాల్లో గవర్నర్లు ప్రవరిస్తున్న తీరు చూస్తూనే ఉన్నాం కనుక, తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి వ్యవహారం పెద్దగా ఆశ్చర్యపరచదు. ఆయనలాగే చాలా రాష్ట్రాల్లో గవర్నర్లు అక్కడి ప్రభుత్వాలతో పోరాడుతున్నారు, అవి కూడా డీఎంకె మాదిరిగానే ఎదురుతిరుగుతున్నాయి. పశ్చిమబెంగాల్‌లో మమతాబెనర్జీని ముప్పుతిప్పలు పెట్టి, ఏకంగా ఒక విపక్షనాయకుడి తరహాలో వ్యవహరించిన గవర్నర్‌ను కేంద్ర ప్రభుత్వం ఉపరాష్ట్రపతి పదవితో సత్కరించిన తరువాత, చాలామంది గవర్నర్లు ఆయనను ఆదర్శంగా స్వీకరించినట్టు కనిపిస్తోంది.

రవికి తమిళనాడు గురించి తెలుసు, ఆ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా అక్కడి పాలకులు ఏయే విషయాల్లో పట్టుదలగా ఉంటారో, దేనికి నొచ్చుకుంటారో, వారిని ఎలా గిల్లవచ్చునో తెలుసు. ఇటీవలే ఆయనకు తమిళనాడు అన్నమాట నచ్చక, దానిని తమిళగం అన్నారు. ‘నాడు’ అన్నశబ్దంలో దేశంనుంచి వేరుపడచూసే, లేదా వేరుకుంపటి పెట్టుకున్న ఓ సర్వస్వతంత్ర సర్వసత్తాక రాజ్యభావనను ఆయన దర్శించారు. తమ రాష్ట్రం పేరు ఇలా పలికితే తమిళులకు ఎంత ఆగ్రహం కలుగుతుందో రవికి తెలియనిదేమీ కాదు. పైగా, రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన రాష్ట్రప్రభుత్వం లోగోకూడా వాడలేదు. రాజ్యాంగం ఆమోదించిన ఆ రాష్ట్రం పేరుకన్నా తాను వాడుతున్నమాట ఎంత ఔచిత్యమైనదో చెప్పే ప్రయత్నం చేసినా, ఆ ఘట్టం నిప్పురాజేసింది. ఇప్పుడు ఆయన ఏకంగా అసెంబ్లీ సమావేశాల ఆరంభం సందర్భంలో మంత్రివర్గం ఆమోదించిన ప్రసంగపాఠాన్ని కూడా చిత్తం వచ్చినట్టు మార్చేసుకున్నారు. తమిళనాడు ప్రజలపైన ద్రవిడోద్యమం ప్రభావం, మరీముఖ్యంగా అధికారపార్టీకి ప్రత్యక్షంగా దానితో ఉన్న అనుబంధం తెలిసినందునే కాబోలు ఆయన ఆ ఊసున్న పదాలకు కత్తెరవేశారు. పెరియార్‌, అన్నాదురై, కరుణానిధి ఇత్యాది ద్రవిడోద్యమ నాయకుల పేర్లను ప్రస్తావించకుండా, అంబేడ్కర్‌ ఊసులేకుండా, తనది ద్రవిడ మోడల్‌ పాలన అని స్టాలిన్‌ను చెప్పుకోనివ్వకుండా చేశారు. ప్రభుత్వం సాధించిన విజయాల్లో కొన్నింటిని ప్రస్తావించకుండా వదిలేశారు. ఆయన ప్రసంగిస్తున్నప్పుడు ప్రసంగపాఠం కాపీలు చూస్తున్న సభ్యులు, ఎక్కడెక్కడ ఆయన వాక్యాలు, పేరాలు వదిలిపెట్టారో, ఏయే చోట్ల సొంతమాటలు చేర్చారో గమనించి వేడెక్కిపోయారు. ‘తమిళగం’ వేడి తోడై అధికారపక్ష సభ్యులు ప్రసంగానికి అడ్డుతగలడంతో, ముఖ్యమంత్రి అభ్యంతరం చెప్పడంతో గవర్నర్‌కు ఆగ్రహం కలిగింది. సగంలోనే స్వస్తిచెప్పి, జాతీయగీతాలాపన జరగకముందే సభనుంచి వాకౌట్‌ చేశారు. ఒక గవర్నర్‌ ఈ స్థాయిలో వ్యవహరించడం బహుశా ఇదే ప్రథమం కావచ్చు.

ఏడాదిగా రవి, స్టాలిన్‌ మధ్య యుద్ధం నడుస్తోంది. సుమారు ఇరవైబిల్లులు గవర్నర్‌ సంతకం కోసం ఎదురుచూస్తున్నాయట. అధికారపక్షాన్ని ఇలా ఇరుకునబెట్టడంతో పాటు మరోపక్క వేదాలు, సనాతనధర్మం, తిరుక్కురళ్‌ అనువాదం వంటి అంశాలమీద వ్యాఖ్యలు చేస్తూ అడపాదడపా రెచ్చగొడుతున్నారు. రాజ్‌భవన్‌ కాదు, ఆర్‌ఎస్‌ఎస్‌ భవన్‌ అంటూ డీఎంకె నాయకులు కూడా ఉద్యమం నడుపుతున్నారు. రాజకీయ వివాదాలను అటుంచితే, మంత్రివర్గం ఆమోదించిన ప్రసంగపాఠాన్ని రాష్ట్రపతి కానీ, గవర్నర్లు కానీ తుచ తప్పకుండా చదవాలన్నది రాజ్యాంగం నిర్దేశించిన సంప్రదాయమనీ, అభ్యంతరాలుంటే ముందే పరిష్కరించుకోవాలని రవికి తెలియకపోదు. అందుకు భిన్నంగా, ప్రసంగాన్ని ఖండఖండాలు చేయడం, తనకు నచ్చినమాటలు, వాక్యాలు చేర్చడం దుస్సాహసమే కాక, నియమనిబంధనలకు వ్యతిరేకం కూడా. జాతీయగీతాలాపనకు ముందే వాకౌట్‌ చేయడం ద్వారా ఆయన ఎవరిమీద పైచేయి సాధించానని అనుకున్నారో అర్థంకాదు. ఇటువంటి చర్యల ద్వారా ఏ శాసనవ్యవస్థనైతే అవమానించారో అందులో ఆయనా అంతర్భాగమే. గవర్నర్లు రాజకీయ నాయకుల్లాగా వ్యవహరిస్తూ, అధికారపక్షాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ రాజ్‌భవన్‌ను ఒక పార్టీ కార్యాలయంగా మార్చేస్తున్నకొద్దీ నిప్పురాజుకుంటూనే ఉంటుంది. విపక్షపాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరు, అందుకు ప్రతిగా అక్కడి ప్రభుత్వాలు గవర్నర్ల అధికారాలకు కత్తెరవేయాలన్న ప్రయత్నాలు చూసినప్పుడు ఒక అత్యున్నత పదవి నేలబారు రాజకీయాల్లో పడి తన విలువ కోల్పోతున్నందుకు బాధకలుగుతుంది. గవర్నర్‌ వ్యవస్థ ఉనికినే ప్రశ్నార్థకం చేసే ఇటువంటి ధోరణులకు స్వస్తిచెప్పడం ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం.

Updated Date - 2023-01-12T00:30:39+05:30 IST