ఆవాస న్యాయం

ABN , First Publish Date - 2023-01-07T01:44:39+05:30 IST

ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ కూల్చివేతల వ్యవహారంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు అభినందనీయమైనది.

ఆవాస న్యాయం

ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ కూల్చివేతల వ్యవహారంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు అభినందనీయమైనది. రైల్వేశాఖకు చెందిన భూమిలో నివాసం ఉంటున్నవారిని వెంటనే ఖాళీచేయించి, అక్రమకట్టడాలను కూల్చివేయాలంటూ ఉత్తరాఖండ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును తాత్కాలికంగా నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు సముచితమైనవి. అక్రమనిర్మాణాలు, దురాక్రమణదారులని అంటున్నప్పటికీ, ఇలాంటి సందర్భాల్లో కాస్తంత మానవత్వంతో వ్యవహరించడం అవసరమనీ, దశాబ్దాలుగా అక్కడ ఉంటున్నవారిని ఉన్నపళంగా పొమ్మనడం సరికాదని న్యాయస్థానం స్పష్టంచేసింది. ఓ యాభైవేలమందిని రాత్రికిరాత్రే ఖాళీచేయించడం కాక, అర్హత ఉన్నా లేకున్నా వారికి పునరావాసం చూపిన తరువాతే ఆ పనిజరగాలని చెప్పడం సరైనది.

ఈ దేశంలో ఆక్రమణదారుల సామాజికార్థిక రాజకీయ పలుకుబడి ఆధారంగా సమస్తవ్యవస్థలు పనిచేస్తాయి. శక్తిసంపన్నుల అక్రమాలజోలికి ఎవరూపోరు. ఒకవేళ సుదీర్ఘకాలం కేసులు నడిచి, న్యాయస్థానాలు వారికి వ్యతిరేక తీర్పులు ఇచ్చినా అవి ఆచరణకు నోచుకోవు. హల్ద్వానీ వ్యవహారంలో ఆక్రమణదారులుగా భావిస్తున్నవారు నిరుపేదలు, ప్రధానంగా ముస్లింలు. రాష్ట్ర ప్రభుత్వం పునరావాసం, ప్రత్యామ్నాయం వంటి ఆలోచనలు చేయకపోవడానికి ఇది కూడా ఓ కారణం కావచ్చు. రైల్వేశాఖ తన భూమికోసం న్యాయపోరాటం చేయడంలో తప్పేమీ లేదు. అది తనదని చెప్పుకోవడానికి అవసరమైన ఆధారాలు దానిదగ్గర ఉండవచ్చు. దానితోపాటే, దశాబ్దాలుగా అక్కడ నివాసం ఉంటున్న నాలుగువేల కుటుంబాల దగ్గర కూడా చాలా పత్రాలున్నాయి. అప్పుడెప్పుడో వేలంలో చిన్నచిన్న ముక్కలు కొనుక్కొని, అన్ని ప్రభుత్వశాఖలనుంచి అనుమతులు పొంది ఇళ్ళుకట్టుకున్నారు. అక్రమం అంటున్నప్పుడు దానిని సక్రమం చేసిన అధికారులు, నాయకులు కూడా ఈ పాపంలో భాగస్వాములే. ఈ దేశంలో వందలాది రిసార్టులు, ఎత్తయిన కొండల్లో, చల్లని ప్రాంతాల్లో, మెట్రోనగరాల్లో వెలిసిన ధనికుల విల్లాలు నిబంధనలకు వ్యతిరేకంగా పుట్టుకొచ్చినా ఎవరూవాటి జోలికిపోరు. ఆక్రమణదారులు నిరుపేదలు కాబట్టే ఈ కరుకుదనం.

రైల్వేశాఖ తనదని అంటున్న బన్‌భూల్‌పురాలోని 29ఎకరాల్లో నాలుగువేల ఇళ్ళు, ప్రార్థనా మందిరాలు, వ్యాపార సముదాయాలు ఉన్నాయి. ప్రభుత్వమే కట్టిన స్కూళ్ళు, ఆస్పత్రులున్నాయి. ఎనభైయేళ్ళక్రితం అక్కడే పుట్టి, అక్కడి స్కూలులో చదువుకున్నవారున్నారు. విచిత్రమేమంటే, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం ద్వారా అన్ని అనుమతులతో ఇళ్ళు కట్టుకున్నవారూ ఉన్నారు. ఇది రైల్వేభూమి కాదు, ప్రభుత్వ భూమి అని వాదించడానికి స్థానికులు 90ఏళ్ళ క్రితం తమ పూర్వీకులకు బ్రిటిష్‌ ప్రభుత్వం ఇచ్చిన లీజు పత్రాలు చూపుతున్నారు. 1907లో జారీ అయిన ఒక కీలకమైన పత్రాన్ని ఉత్తరాఖండ్‌ హైకోర్టు అర్హమైనదిగా భావించకపోవడంతో కూల్చివేతల ఆదేశాలు జారీ అయ్యాయి. ముస్లిం జనాభా అధికంగా ఉండే ఈ ప్రాంతం రైల్వేశాఖదంటూ ఒక ప్రజాప్రయోజనవ్యాజ్యం దాఖలుకావడం వెనుక ఏ కారణాలున్నాయో తెలియదుకానీ, అనేక సంవత్సరాలుగా వివిధ స్థాయిల్లో సాగుతున్న న్యాయపోరాటమిది. ఈ భూమి రైల్వేశాఖది కాదని ఆరేళ్ళక్రితం రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం న్యాయస్థానాల్లో వాదిస్తే, ఇప్పటి బీజేపీ ప్రభుత్వం అందుకు భిన్నమైన వైఖరి తీసుకున్నదనీ, రైల్వేట్రాక్‌ను ఆనుకొని ఒకవైపు ఉన్న తమ ప్రాంతం విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ, మరోవైపు పుట్టుకొచ్చిన చాలా నివాసప్రాంతాల జోలికి ఎవరూ పోవడం లేదన్నది స్థానికుల ఆరోపణ.

సుప్రీంకోర్టు జోక్యంతో కూల్చివేతలు ఆగినా కథ ఇంకా మిగిలేవుంది. రైల్వేభూమి, ప్రభుత్వభూమి, లీజుల చిక్కుముళ్ళు అనేకం విప్పవలసి ఉంది. ఇంకా చెప్పాలంటే, ఓ నూటయాభైయేళ్ళ చరిత్రను తవ్వాల్సి ఉంటుంది. చివరకు ఏమి తేలినా, హైకోర్టు ఆదేశించినట్టుగా ఓ వారంరోజుల సమయంతో కూల్చివేతలకు పాల్పడటం మాత్రం అన్యాయం. సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్టుగా పునరావాసం కల్పించిన తరువాతే స్థానికుల తరలింపు జరగాలి. భూమిపై వారికి ఎలాంటి హక్కూలేదని తేలినా కూడా, దశాబ్దాలుగా ఉంటున్న ప్రాంతాన్ని ఖాళీచేయాల్సివస్తున్నవారి పక్షానే సమస్త వ్యవస్థలూ నిలిచి తరలింపు ప్రక్రియ అమలుజరగాలి.

Updated Date - 2023-01-07T01:44:39+05:30 IST

Read more