తొలి ప్రమాద హెచ్చరిక

ABN , First Publish Date - 2023-01-11T00:43:02+05:30 IST

ఉత్తరాఖండ్‌ జోషీమఠ్‌లో పగుళ్ళుబారిన, పాక్షికంగా కూలిన నిర్మాణాల కూల్చివేత ఆరంభమైంది.

తొలి ప్రమాద హెచ్చరిక

ఉత్తరాఖండ్‌ జోషీమఠ్‌లో పగుళ్ళుబారిన, పాక్షికంగా కూలిన నిర్మాణాల కూల్చివేత ఆరంభమైంది. దాదాపు ఏడువందల భవనాలు దెబ్బతిన్న స్థితిలో నివాసానికి ఇక ఎంతమాత్రం యోగ్యంకాని వాటిని ముందుగా కూల్చివేయాలని అధికారులు నిర్ణయించుకున్నారు. మూడోవంతు భాగం ఇప్పటికే కుంగిపోయిన జోషీమఠ్‌ పట్టణాన్ని ప్రభుత్వం ప్రమాదకరప్రాంతంగా గుర్తించింది. దాదాపు ఆరువందల ఇళ్ళు ఖాళీచేయించి, వందలాదిమందిని సురక్షితప్రాంతాలకు తరలించడం, ప్రధానమంత్రి స్వయంగా పరిస్థితిని సమీక్షించి, రాష్ట్రానికి తన సంపూర్ణసహకారాలను హామీ ఇవ్వడం తెలిసినవే.

జోషీమఠ్‌కు ఉన్న చారిత్రక, పౌరాణిక, పర్యాటక, రక్షణపరమైన ప్రాధాన్యతలను ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. శీతాకాలంలో బద్రీనాథుడి విగ్రహాన్ని ప్రధాన ఆలయంనుంచి తెచ్చి ఇక్కడి వాసుదేవాలయంలో ఉంచడం ఒక ఉత్సవం. సిక్కులు హేమకుండ్‌ సాహెబ్‌ను సందర్శించుకోవడానికి కూడా ఇదేమార్గం. సమీపంలోనే చైనా సరిహద్దువున్నది కనుక, అటుగా పోయేదారికూడా రక్షణపరంగా ఎంతో కీలకమైనది. నిత్యం వందలాది భక్తులు, అంతర్జాతీయ పర్యాటకులు వచ్చే జోషీమఠ్‌ ఉన్న చమోలీ జిల్లాలోనే ఇంకా అనేక ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలున్నాయి. అవి తక్షణ ప్రమాదంలో లేకున్నా, అంచునైతే ఉన్నాయి. జోషీమఠ్‌ పట్టణం ఉన్న ప్రాంతం భౌగోళికంగా బలహీనమైనది. కిందవున్న పురాతనశిలలు, వాటిపైన పొరలుకట్టివున్న పదార్థాలు నిలకడైనవికావు. భూ కంపాల తీవ్రత అధికంగా ఉండే ప్రాంతం ఇది. డ్రైనేజ్‌ వ్యవస్థ లేకపోవడం, క్రమపద్ధతిలో జరగని పట్టణీకరణ కలసికట్టుగా సమస్యను మరింత పెంచాయి. మురికి నీరు తనకుతానుగా దారులు వెతుక్కొనే క్రమంలో నేల మరింత బలహీనపడింది.

కాళ్ళకిందకు నీళ్ళు వచ్చేశాయి కనుక ఇప్పుడు అందరూ తప్పు మాదికాదనే అంటారు. తాను కడుతున్న విద్యుత్‌ ప్రాజెక్టులకు, పట్టణం కుంగిపోవడానికీ ఏ సంబంధంలేదని ఎన్టీపీసీ వెంటనే ప్రకటించింది. ఈ వాదనకు ఆధారాలేమిటో తెలియదు. కానీ, ఈ ప్రాంతం ఎంత సున్నితమైనదో యాభై సంవత్సరాలనాటి ఎంసీ మిశ్రా కమిషన్‌ నుంచి నిన్నమొన్నటివరకూ ప్రతీ అధ్యయనం హెచ్చరిస్తూనే వచ్చాయి. భారీ భవనాలే వద్దని 1976నాటి మిశ్రా కమిషన్‌ చెబితే, ఇప్పుడు అక్కడ ఏకంగా కొండలను దొలిచేస్తూ చార్‌ధామ్‌ రహదారులు, భారీవిద్యుత్‌ ప్రాజెక్టులు నిర్మితమవుతున్నాయి. చార్‌ధామ్‌ ప్రాజెక్టుమీద పర్యావరణవేత్తలు కోర్టుకు వెడితే, సుప్రీంకోర్టు ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఆ తరువాత కూడా ప్రభుత్వం రెండు భారీ విద్యుత్‌ ప్రాజెక్టులను ఆమోదించింది. ఆ ప్రాంతం గురించీ, అభివృద్ధిపేరిట తాను చేపడుతున్న నిర్మాణాలవల్ల ఒనగూరే నష్టం గురించీ తెలిసికూడా ప్రభుత్వం దూకుడుగా పోవడం విశేషం. అడుగున విద్యుత్‌ ప్రాజెక్టులకోసం తవ్వుతున్న భారీసొరంగాలవల్లే జోషీమఠ్‌ కుంగిపోయిందని నిపుణుల వాదన. భక్తికాదు, దేశభద్రతే ప్రధానం అంటూ చార్‌ధామ్‌ రోడ్లవిస్తరణను ప్రభుత్వం న్యాయస్థానంలో సమర్థించుకున్నా, బద్రీనాథ్‌ ప్రయాణదూరాన్ని ముప్పైకిలోమీటర్ల మేరకు తగ్గించడానికి ఉద్దేశించిన హెలాంగ్‌ బైపాస్‌ నిర్మాణం దెబ్బకు కొండచరియలు విరిగిపడుతున్న దృశ్యాలు చూస్తూనే ఉన్నాం. భారీవరదలు, హిమనీనదాలు బద్దలవడం, ఒక్కరోజులోనే 190మి.మీ.వర్షపాతం వంటి ఉత్పాతాలు గత దశాబ్దకాలంలోనే పలుమార్లు సంభవించి ఈ ప్రాంతాన్ని మరింత బలహీనపరిచాయని నిపుణులు అంటున్నారు.

అభివృద్ధిపేరిట అడవులను నాశనం చేస్తూ, వనరులను భక్షిస్తున్న నేతలకు వ్యతిరేకంగా, తమకంటూ ఒక రాష్ట్రం ఏర్పడితే కానీ పరిస్థితులు మారవని నమ్మి ఉత్తరాఖండ్‌ వాసులు సుదీర్ఘ పోరాటంతో రాష్ట్రాన్ని సాధించుకున్నారు. పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే పలు ఉద్యమాలు పుట్టిన ఈ నేలమీద పాలకులు మారారు తప్ప విధానాలు మారలేదు. కార్పొరేట్‌ సంస్థలతో కలసికట్టుగా సాగిస్తున్న విధ్వంసం మరింత తీవ్రమై చివరకు ప్రజల మనుగడకే ముప్పు ఏర్పడే పరిస్థితి వచ్చింది. ఉత్తరాఖండ్‌లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబుల్‌ ఇంజన్‌ వేగంతో ప్రకృతిని రెచ్చగొట్టే స్థాయిలో చేపడుతున్న నిర్మాణాలవల్ల జనావాసాల విధ్వంసం జోషీమఠ్‌కు మాత్రమే పరిమితం కాబోదు.

Updated Date - 2023-01-11T00:43:02+05:30 IST