ప్రజాస్వామ్యంపై దాడి

ABN , First Publish Date - 2023-01-10T02:36:54+05:30 IST

బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు జైర్‌ బోల్సనారో మద్దతుదారులు వేలాదిమంది ఆదివారం ఆ దేశ రాజధానిలో వీరంగం వేసిన దృశ్యం గతంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా జరిగిన ఇదే తరహా ఉదంతాన్ని గుర్తుచేస్తున్నది.

ప్రజాస్వామ్యంపై దాడి

బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు జైర్‌ బోల్సనారో మద్దతుదారులు వేలాదిమంది ఆదివారం ఆ దేశ రాజధానిలో వీరంగం వేసిన దృశ్యం గతంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా జరిగిన ఇదే తరహా ఉదంతాన్ని గుర్తుచేస్తున్నది. గతవారం బ్రెజిల్‌ దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన లూలా డ సిల్వా పదవినుంచి తప్పుకోవాలనీ, ఆయన స్థానంలో బోల్సనారోను ప్రతిష్ఠించాలంటూ వీరంతా రాజధాని బ్రసీలియాలోని అధ్యక్షభవనాన్ని, పార్లమెంటును, సుప్రీంకోర్టును చుట్టుముట్టారు. ఆయా భవనాలపైకి ఎక్కి జెండాలు ఊపుతూ, లోపల కలయదిరుగుతూ, కనిపించిన విలువైన వస్తుసామగ్రిని ధ్వంసంచేస్తూ తీవ్రవిధ్వంసానికి పాల్పడ్డారు. వెంటనే సైన్యం జోక్యం చేసుకొని లూలాను దింపేసి, బోల్సనారోను అధికారపీఠంమీద కూచోబెట్టాలన్నది వారి డిమాండ్‌.

రోడ్లదిగ్బంధం, వాహనాలకు నిప్పుపెట్టడం, పోలీసులపై దాడులు చేయడంవంటి అకృత్యాలకు కూడా బోల్సనారో మనుషులు పాల్పడినవార్తలు వస్తున్నాయి. బోల్సనారో అమెరికాలో ఉండగా ఈ ఘాతుకం చోటుచేసుకోవడం విచిత్రం. ఆయన అక్కడవుంటూ సామాజిక మాధ్యమాల ద్వారా తన అనుచరగణాన్ని రెచ్చగొడుతున్నారన్నది లూలా ఆరోపణ. భారతప్రధాని మోదీ సహా చాలాదేశాల నాయకులు ఈ దాడిని ఖండిస్తూ, ప్రజాస్వామ్యసంప్రదాయాలను, విలువలను ప్రతీ ఒక్కరూ గౌరవించాలని పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ తన స్వీయ అనుభవం రీత్యా మరోనాలుగుమాటలు ఎక్కువే చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా జరిగే అధికారమార్పిడిని అడ్డుకోజూసే ఇటువంటి దాడులు సరికాదనీ, లూలాతో కలసి పనిచేయడంమీద తాను ప్రత్యేకదృష్టి పెడుతున్నానని బైడెన్‌ అన్నారు.

ఎన్నికల ఫలితాల్లో లూలాకు 50.9శాతం, ఓడిన బోల్సనారోకు 49.1శాతం ఓట్లువచ్చాయి. న్యాయస్థానాలు, ఎన్నికల సంఘం తనను కక్షకట్టిమరీ ఓడించాయని ఆయన వాదన. అప్పట్లోనే నిరసనలు వెల్లువెత్తితే సుప్రీంకోర్టు కఠినమైన ఆదేశాలు ఇచ్చింది. తమ అభిమాన నాయకుడు ఓడిన బాధతోనే బోల్సనారో భక్తులు ఈ దాడికి పాల్పడ్డారని అనుకోలేం. బోల్సనారో అధికారంలో ఉండగా అన్ని స్వతంత్రవ్యవస్థలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా పార్లమెంటును మూసివేయాలనుకున్నాడు. సుప్రీంకోర్టులో తనకు లొంగిరాని న్యాయమూర్తులు ఉన్నందుకు వారిపై ఏవో ఒక ఆరోపణలుచేస్తూ ప్రజల్లో విశ్వాసాన్ని చంపేసే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఆయన మితవాదభక్తులంతా ఎంపికచేసుకొని మరీ వీటిపైనే దాడులు చేయడం ఆయన పుణ్యమే. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటినుంచీ దేశవ్యాప్తంగా నిరసనప్రదర్శనలు జరుగుతూండటం, అవి క్రమంగా బలపడుతూండటం వెనుక లూలా రాకకు భయపడుతున్న బలమైన భూస్వాములు, బడాపారిశ్రామికవేత్తల చేయూత ఉన్నదని కూడా అంటున్నారు. బోల్సనారో తీవ్రమితవాదాన్ని ప్రేమించే సైన్యం కూడా ఈ లూలావ్యతిరేక ఉద్యమాన్ని సమర్థిస్తున్నది. బోల్సనారోకు మద్దతుగా ఇప్పటికే సైన్యం ప్రకటనలు చేయడం, ఆర్మీ క్యాంపులకు దగ్గరగా వీరంతా గూడారాలు వేసుకొని మరీ ఉద్యమాలు చేయడం, మిలటరీ పోలీసురక్షణలో ఉన్న సుప్రీంకోర్టు, పార్లమెంటు వంటి కీలకమైన భవనాల్లోకి ఈ మూకలు సులువుగా చొరబడటం ఈ అనుమానాన్ని మరింత పెంచుతున్నది. తాను అధికారంలో ఉండగా, సైన్యంలోని మితవాద అధికారులకు మంత్రిపదవులతో సహా ప్రభుత్వంలోకీలకస్థానాలు కట్టబెట్టడం, వేలాదిమందికి సైనికేతరబాధ్యతలు అప్పగించడం వంటి చర్యల ద్వారా, గతకాలపు సైనికపాలనలో కెప్టెన్‌గా పనిచేసిన బోల్సనారో సైన్యానికి మరింత ప్రీతిపాత్రుడయ్యాడు. కరోనా కష్టకాలంలో బోల్సోనారో అపసవ్య విధానాల వల్ల సుమారు ఏడులక్షలమంది కన్నుమూశారు. ఆయన ఏలుబడిలో దేశం ఆర్థికంగా మెరుగుపడకపోగా, అన్ని రంగాల్లోనూ పతనమవుతున్న స్థితిలో తమను గతంలో ఏలిన వర్కర్స్ పార్టీ పాలనే ఉత్తమమని ప్రజలు నిర్ణయించుకున్నారు. లూలాను అవినీతికేసుల్లో ముంచెత్తి తిరిగి అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకోవాలన్న ప్రయత్నాలు అంతిమంగా న్యాయస్థానాల్లో నిలవకపోవడంతో పాటు, బోల్సనారో కూడా ప్రజల మనసులు గెలుచుకోలేక ఓటమిపాలైనారు. బ్రెజిల్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగిన తరువాత, అధికారంలో ఉన్న అధ్యక్షుడు ఒక పదవీకాలంలోనే ఓటమి పాలు కావడం మూడుదశాబ్దాల్లో ఇదే మొదటిసారి. అయినా, బోల్సనారో తన కుట్రలను ఇంకా కొనసాగిస్తున్న నేపథ్యంలో, యావత్‌ ప్రపంచమూ లూలా ఒంటరికాదని స్పష్టంచేస్తూ అండగా ఉండాల్సిన అవసరం ఉంది.

Updated Date - 2023-01-10T02:36:54+05:30 IST