ఖైదీల క్షమాభిక్షకు రాజకీయ వైషమ్యాలే అడ్డు

ABN , First Publish Date - 2023-01-26T00:37:31+05:30 IST

గణతంత్ర దినం సందర్భంగా ఖైదీలు పెట్టుకున్న ఆశలు నెరవేరేలా లేవు. తెలంగాణ రాష్ట్రం చివరిసారిగా అక్టోబరు 2020లో ఖైదీలకు..

ఖైదీల క్షమాభిక్షకు రాజకీయ వైషమ్యాలే అడ్డు

గణతంత్ర దినం సందర్భంగా ఖైదీలు పెట్టుకున్న ఆశలు నెరవేరేలా లేవు. తెలంగాణ రాష్ట్రం చివరిసారిగా అక్టోబరు 2020లో ఖైదీలకు క్షమాభిక్ష ఇచ్చి విడుదల చేసింది. తర్వాత గత రెండున్నరేళ్లుగా ఖైదీల విడుదల ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. రాబోయే రాష్ట్ర, జాతీయ ఎన్నికలు వారి విడుదలను మరో రెండేళ్లు ఆలస్యం చేస్తాయనే తీవ్రమైన ఆందోళనలో ఖైదీలు, వారి కుటుంబాలు ఉన్నాయి. ప్రభుత్వానికి, రాష్ట్ర గవర్నరుకు మధ్య ఉన్న ఘర్షణ ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా ఈ వ్యవహారాలను దగ్గరగా చూస్తున్నవారు అంటున్నారు. ఈ పరిస్థితిపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం, పౌర సమాజం చోద్యం చూస్తూ ఉండిపోవటం అన్యాయం.

ఛత్తీస్‍గడ్ రాష్ట్రానికి చెందిన సోనాదర్ అనే ఒక జీవిత ఖైదీ 2020 చివర్లో దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఒక కేసు వేశాడు. అప్పటికి దశాబ్దానికి పైగా జైలు శిక్ష అనుభవిస్తున్న తనను విడుదల చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, కోవిడ్ కాలంలోనే మరణించే అవకాశం ఉందని, తన విడుదలకు ఆదేశించాలని న్యాయస్థానానికి విన్నవించుకున్నాడు. అప్పటికే మూడు వందల పైచిలుకు ఆలాంటి కేసులు కోర్టు ముందు విచారణకు ఎదురు చూస్తున్నాయి. సుప్రీంకోర్టు జాతీయ న్యాయ సహాయ సేవా సంస్థ సహాయంతో, కోర్టు సహాయకుల సహకారంతో అన్ని రాష్ట్రాల నుంచి జీవిత ఖైదీల, నిర్దిష్ట కాలాలకు శిక్ష అనుభవిస్తున్న ఖైదీల సమాచారాన్ని సేకరించి, చట్ట పరిధిలో వారి విడుదలకు ప్రభుత్వాలు ఏం చేయాలనే విషయమై చాలా కసరత్తు చేసింది. ఖైదీలకు చెందిన సమాచారాన్ని ఇవ్వడానికి ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రమైతే చాలా నెలలు తీసుకుంది. చివరకు సుప్రీంకోర్టు ఆగస్టు 2021లో వివరణాత్మకమైన, కాల నిర్దిష్టమైన ఆదేశాలను జారీ చేసింది.

విడుదలకు అర్హులైన ఖైదీలను సకాలంలో గుర్తించాలని, క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ఖైదీలకు న్యాయ సహాయ సేవా సంస్థ సహకరించాలని ముందుగా చెప్పిన న్యాయస్థానం, తర్వాత ఆ అర్హతల ప్రకారం అలాంటి ఖైదీలను సకాలంలో గుర్తించడం, నిర్ణయం తీసుకోవడం ప్రభుత్వాల బాధ్యత అని చెప్పింది. ప్రతి ఏడాది జనవరి, మే, సెప్టెంబర్ నెలల్లో జైలు అధికారులు అర్హులైన ఖైదీల జాబితాను తయారు చేయాలి. వారి విడుదలకు కావలసిన అన్ని అనుమతి పత్రాలు జిల్లా కలెక్టర్, పోలీస్, ప్రొబెషనరీ అధికారి నుంచి ముందుగానే సేకరించాలి. ఈ అధికారులు నిర్లక్ష్యం వహించినా జైలు అధికారులు జాబితాను ఖైదీల విడుదల సలహా సంఘం ముందుంచాలి. రాష్ట్ర ఉన్నతాధికారులే వాటిని సేకరించాలి. అవసరమైతే న్యాయ సహాయ సేవా సంస్థ వాటిని సేకరించడానికి సహకరించాలి. 2022లో జనవరి మొదలు అక్టోబర్ 2 వరకు నిర్దిష్టమైన తారీఖులు కూడా సూచించి మరీ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఖైదీల విషయంలో ప్రభుత్వాల నిర్లక్ష్యం పూర్తిగా అర్థమైనందువల్లే ఇంత నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేయాల్సి వచ్చిందనే విషయాన్ని మనం గ్రహించాలి.

ఇది ఇలా ఉండగా స్వాతంత్ర్య అమృతోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఖైదీల విడుదలకు మార్గదర్శకాలు విడుదల చేసింది. అవి అయిదేళ్లు, పదేళ్లు పైగా శిక్షలు పడిన ఖైదీలకు వర్తిస్తాయి. తీవ్రమైన నేరాలలో పాల్గొనని వారికీ, సగం నుంచి మూడు వంతులు శిక్ష అనుభవించిన వారికీ వర్తిస్తాయి. వాటి కింద చాలామందే విడుదలకు అర్హులు. కానీ ఆచరణలో అధికార పార్టీల స్వప్రయోజనం లేని జాతి ప్రయోజనం కానీ, రాష్ట్ర ప్రయోజనం కానీ లేదు కాబట్టి, బిల్కిస్ బానో కుటుంబంపై అత్యాచారం చేసిన వారిని గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో దేశ వ్యాప్తంగా ఖైదీల విడుదల మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తీవ్ర నేరాలకు పాల్పడిన వారు జైళ్లలో మరణించాల్సిందే అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటించారంటే వ్యతిరేకత ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు. చాలా రాష్ట్రాలు ఖైదీల విడుదల ప్రక్రియను ఆపేశాయి. కానీ రాజకీయ అండ దండలు, ఆర్థికంగా, సామాజికంగా చితికిపోయిన వర్గాల, కులాల నుంచి వచ్చిన ఖైదీల పరిస్థితులు ఎంత దయనీయంగా ఉంటాయో రోజూ చూసే జైలు అధికారులు మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రికి ఓపికగా నెలల తరబడి వివరించారు. ఏళ్ల తరబడి ఈ రంగంలో కృషి చేస్తున్న మాలాంటి వారి సహాయం తీసుకున్నారు. ఫలితంగా పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం, తీవ్రమైన నేరాలకు పాల్పడని 600 మందికి పైగా ఖైదీలను 2022లో విడుదల చేసింది.

కేంద్ర విడుదల చేసిన మార్గదర్శకాలను చాలా కుదించి అమలు చేయడానికి ప్రయత్నించిన తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాన్ని గవర్నర్ అడ్డుకున్నారని తెలుస్తుంది. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వమే తయారు చేసిన మార్గదర్శకాల ప్రకారం విడుదల కావాల్సిన జాబితాలో సుమారు 200 వరకు జీవిత ఖైదీలు ఉన్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వంతో ఘర్షణ పడుతున్న గవర్నర్ ఈ జాబితాను తొక్కిపెట్టారని తెలుస్తుంది. ఇందులో 14 ఏళ్ల నుంచి 20 ఏళ్ల జైలు జీవితాన్ని పూర్తి చేసిన వారు 30 మంది వరకు ఉన్నారు. ఈ జాబితాలో కొన్ని నెలల్లో క్యాన్సర్ లాంటి వ్యాధులతో మరణించేవారు 15 మంది ఉన్నారు. వారి బాగోగులు చూడలేక, ఆసుపత్రుల చుట్టూ తిప్పలేక జైలు అధికారులు అవస్థలు పడుతున్నారు. వచ్చే ఎన్నికల దృష్టితో వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి ఈ సమస్యలు కనిపించడం లేదు, వినిపించడం లేదు. సర్వోన్నత న్యాయస్థానం నెలల కసరత్తు తర్వాత ఇచ్చిన ఆదేశాలకు ఇసుమంత గౌరవం కూడా ఇవ్వడం లేదు.

జైళ్లలో మగ్గుతున్న వారి దయనీయ పరిస్థితుల గురించి రాష్ట్రపతి ఆ మధ్య ప్రస్తావిస్తే ప్రజలు అవునా అనుకున్నారు. ఆమె రాష్ట్రానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం, అధికార పార్టీలు చేసిన హంగామా చూసి ఔరా అనుకున్నారు. రాష్ట్రపతి ప్రాతినిధ్యం వహించే ఆదివాసీల పట్ల, ఆమె ప్రస్తావించిన ఖైదీల పట్ల ఆచరణలో ఇసుమంతైనా నిబద్ధత ఉంటే గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం తమ మధ్య వైషమ్యాలను పక్కన పెట్టి తక్షణమే స్పందించాలి. అధికార పార్టీల మధ్య ఉన్న వివాదాలే అంతిమంగా ఖైదీల విడుదలకు ప్రమాణం కావడానికి వీలులేదు. కనీసం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఐచ్ఛికంగా ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే మరో రెండేళ్లు వందలాది మందికి విముక్తి లేదు. ఇంత నిర్లక్ష్యం సమాజాన్ని మరింత అమానవీయంగా మార్చేస్తుంది.

మురళి కర్ణం

నల్సార్‌ యూనివర్సిటీ

Updated Date - 2023-01-26T00:40:52+05:30 IST