పేదల పొట్టకొడుతున్న మోదీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2023-02-07T02:25:56+05:30 IST

దేశంలోని కోట్లాది ప్రజలకు ఉపాధి కల్పించడమే కాక గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పట్ల నరేంద్ర మోదీ ప్రభుత్వం...

పేదల పొట్టకొడుతున్న మోదీ ప్రభుత్వం

దేశంలోని కోట్లాది ప్రజలకు ఉపాధి కల్పించడమే కాక గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పట్ల నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తూ పేద ప్రజల పొట్టకొట్టడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం వస్తుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్న క్రమంలో బహుళజాతి సంస్థలైన అమెజాన్, గూగుల్ వంటి సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్న పరిస్థితిని మనం ఈ రోజు చూస్తున్నాం. ఇటువంటి క్లిష్టమైన సమయాల్లో దేశ ఆర్థిక వ్యవస్థని బలంగా ఉంచేది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మాత్రమే. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే ఉపాధి హామీ పథకాన్ని విస్మరిస్తే అది దేశానికే ప్రమాదమన్న విషయాన్ని కేంద్రం గమనంలో ఉంచుకోవడం మంచిది.

ఉపాధి హామీ పథకం అమలైన రెండేళ్లకే 2008లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం వచ్చి అనేక అగ్రదేశాలు అల్లోకల్లోలమయ్యాయి. ఆ సమయంలో భారతదేశంపై ఆ సంక్షోభ ప్రభావం పడకుండా ఉపాధి హామీ పథకం కాపాడిందని అంతర్జాతీయ కార్మిక సంస్థ తెలిపింది. ఈ పథకం వల్ల గ్రామీణ భారతంలో నగదు చలామణిలో ఉన్నందున ప్రపంచ ఆర్థిక మాంద్యం మన దేశంపై ప్రభావం చూపలేదు. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి ఆర్థిక మాంద్యాన్ని తానే స్వయంగా ఆహ్వానిస్తున్నట్లు ఉన్నది! గ్రామీణ భారతాన్నే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసే ప్రయత్నాన్ని కేంద్రం మానుకోవాలి.

ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడమంటే బడుగుల బతుకులను నిర్వీర్యం చేసినట్లే. ఆకలిచావులు, పేదరికాన్ని ప్రోత్సహించినట్లవుతుంది. దేశంలోని పేద ప్రజలకు 100 రోజుల పాటు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో 2006లో ఉపాధి హామీ పథకం అమలైంది. మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఈ లక్ష్యాలకు మోదీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. ఏటేటా ఈ పథకానికి బడ్జెట్‌ కేటాయింపుల్లో కోతలు విధిస్తూ, పని దినాలు, పనుల్లో అనేక ఆంక్షలు విధిస్తూ నిర్వీర్యం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. పథకానికి డిమాండ్ పెరుగుతున్నా కేంద్రం నిధులు పెంచకపోవడమే కాకుండా కోత విధిస్తోంది. కేటాయించిన ఆ అరకొర నిధులను సైతం సక్రమంగా విడుదల చేయడం లేదు.

2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద ఉపాధి పొందినవారికైనా 2023–24 ఆర్థిక సంవత్సరంలో 100 రోజుల పనిదినాలు కల్పించడానికి కనీసం రూ.2.72 లక్షల కోట్లు అవసరమని అంచనా. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం కేవలం రూ.60 వేల కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది. గత ఏడాది కూడా 25 శాతం నిధుల కోత విధించి, ఈ కేటాయించిన అరకొర నిధుల్లోనూ గత ఐదేళ్ల నుంచి 21 శాతం నిధులు బకాయిల చెల్లింపునకే వెళ్తుండడం ఆందోళనకరం. ఈ ఏడాది చెల్లించాల్సిన పెండింగ్ నిధులు ఇప్పటికే రూ.16,070 కోట్లకు చేరాయి. పనిదినాల్లోనూ కోత విధిస్తూ పేదల పొట్టకొడుతోంది. జనవరి 21 నాటికి సగటున కేవలం 42 రోజుల పనిదినాల్లో మాత్రమే ఉపాధి కల్పించింది. నిధులు, పనిదినాలను మాత్రమే తగ్గించడం కాకుండా చట్టాన్ని కూడా ధిక్కరిస్తున్నట్లు మనం అర్థం చేసుకోవాలి. ఉపాధి హామీ చట్టం ప్రకారం డిమాండ్‌కు అనుగుణంగా పేదలకు పని కల్పించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం కుట్రపూరితంగా పనిదినాలను ఉద్దేశపూర్వకంగా తగ్గిస్తూ వస్తోంది.

డిమాండ్‌కు తగినట్లు ఉపాధి కల్పించడం లేదని కేంద్ర ప్రభుత్వ గణాంకాలే తెలియజేస్తున్నాయి. 2019–20లో 6.16 కోట్ల కుటుంబాలు ఈ పథకం కింద పని కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఆ తర్వాత ఏడాది కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన కారణంగా మరింత మంది దరఖాస్తు చేసుకున్నారు. 2020–21లో 8.55 కోట్ల కుటుంబాలు ఈ పథకం కింద పనిచేయడానికి ముందుకొచ్చాయి. 2021–22లో 8.05 కుటుంబాలు ఆసక్తి ప్రదర్శించాయి. కరోనా పరిస్థితులు సద్దుమణిగాక డిమాండ్ తగ్గినప్పటికీ, కరోనా ముందు ఉన్న డిమాండ్ కంటే ఎక్కువ డిమాండ్ 2022–23లో లభించింది. ఈ ఏడాది జనవరి 24 నాటికి 6.39 కోట్ల కుటుంబాలు పని కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ తగ్గుతోందని మొండివాదనకు దిగడం విడ్డూరంగా ఉంది.

ఉపాధి హామీ పథకాన్ని సమర్థంగా అమలు చేయడంలోనూ కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోంది. కార్మికుల వేతనాలు, సామగ్రి వ్యయాన్ని రాష్ట్రాలకు సకాలంలో విడుదల చేయకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తోంది. పథకాన్ని సమర్థంగా అమలు చేస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాలపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ నిందారోపణలు చేయడం కేంద్రానికి పరిపాటిగా మారింది. ప్రభుత్వ ఆస్తులను సృష్టించడానికి ఈ పథకాన్ని ఉపయోగించుకోవడం నేరంగా భావించి లేనిపోని ఆరోపణలు చేసి ఉపాధి హామీ కూలీల్లో అయోమయాన్ని సృష్టిస్తున్నది. 2022 డిసెంబరు 14 నాటికి 18 రాష్ట్రాలకు కలిపి కూలీల వేతనాలు రూ.4,700 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. 19 రాష్ట్రాలకు మొత్తంగా సామాగ్రి వ్యయం రూ.5,450 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి రెండు నెలల సమయమే మిగిలి ఉంది. మరి ఈ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో ప్రజలకు కేంద్రం సమాధానం చెప్పాలి. నిధుల విడుదలకు సుప్రీంకోర్టు సైతం జోక్యం చేసుకోవాల్సి వచ్చిన విషయాన్ని మరిచిపోరాదు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టినా కూడా 1.06 కోట్ల మందికి పనిచేసే అవకాశాన్ని కల్పించిన తెలంగాణ ప్రభుత్వం రూ. 16,40,224 కోట్ల ఆస్తులను సృష్టించగలిగింది.

ఈ రకంగా కోట్లాది పేదల పొట్ట నింపిన ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. అయితే ఈ పథకాన్ని పాతర పెట్టడానికి కుట్ర ఇప్పుడు మొదలైంది కాదు. 2014లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే దీనిపై నిర్లక్ష్యపు ధోరణిని ప్రదర్శిస్తున్నారు. ఉపాధి హామీ పథకాన్ని విఫల పథకంగా ప్రధానమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఆయన అభివర్ణించారు. ఆ తదనంతర కాలంలో పథకాన్ని కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితం చేస్తామని కేంద్ర మంత్రులు వ్యాఖ్యలు చేశారు. ఏకంగా ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయాలని అప్పటి రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ప్రధానికి లేఖ రాశారు. ఈ పరిణామాలను గమనించి ఆందోళనకు గురైన పలువురు ప్రఖ్యాత ఆర్థికవేత్తలు ఈ పథకాన్ని నిర్వీర్యం చేయవద్దని, మరింత బలోపేతం చేయాలంటూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే ప్రధాని మోదీకి లేఖ రాశారు. అయినా కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది.

ఈ విపరీత ధోరణి వల్ల నష్టపోయింది దేశంలోని పేద ప్రజలే. మరీ ముఖ్యంగా ఉపాధి హామీ పథకంపై ఆధారపడి ఉన్న బడుగులు, ఎస్టీ–ఎస్టీ–బీసీ వర్గాల్లోని పేదలకు తీరని నష్టం జరుగుతోంది. అంతేకాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోగమనానికి తీవ్ర ప్రతికూలతలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరిచి కోట్లాది పేదలకు పట్టెడు అన్నంపెట్టే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి బడ్జెట్‌ను పెంచాలి.

ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. వ్యవసాయానికి అనుసంధానం చేయడమే కాకుండా ఆ పథకం కింద కల్లాలను కూడా అభివృద్ధి చేయడానికి అనుమతించాలని మరోసారి డిమాండ్ చేస్తున్నాను. దీనివల్ల రైతులకు మేలు జరగడమే కాకుండా వ్యవసాయ కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయి. రూ.10 లక్షల కోట్లతో దేశంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపడుతామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగం ద్వారా ప్రకటించారు. ఆ ప్రాజెక్టుల నిర్మాణంలో ఉపాధి హామీ కార్మికులను భాగస్వాములను చేయాలని, ఆ మొత్తంలో నుంచి కనీసం రూ.2.5 లక్షల కోట్లను ఉపాధి హామీ పనులకు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.

కల్వకుంట్ల కవిత

Updated Date - 2023-02-07T02:25:57+05:30 IST