న్యాయ పోరాటాల మహాయోధుడు

ABN , First Publish Date - 2023-02-07T02:21:08+05:30 IST

ఐదుదశాబ్దాల క్రితం భారతీయ ప్రజాస్వామ్యం ‘చీకటి రోజుల’ను చవిచూసింది. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1975 జూన్ 25న ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి)ని విధించారు...

న్యాయ పోరాటాల మహాయోధుడు

ఐదుదశాబ్దాల క్రితం భారతీయ ప్రజాస్వామ్యం ‘చీకటి రోజుల’ను చవిచూసింది. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1975 జూన్ 25న ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి)ని విధించారు. ఇందిర నిర్ణయం భారత ప్రజాస్వామ్య సంస్థలకు ముఖ్యంగా న్యాయవ్యవస్థకు ఒక పరీక్షగా పరిణమించింది. ఇందిర తప్పనిసరిగా ఇటువంటి విషమ నిర్ణయం తీసుకోవడానికి నిర్ణయాత్మక కారకుడు ప్రముఖ న్యాయవాది శాంతిభూషణ్. కత్తివాదర లాంటి తన వాదనలతో దేశ పాలనాధికారంపై ఆమె పట్టు సడలిపోయేలా చేసిన న్యాయ పోరాట యోధుడు ఆయన. అధికారాన్ని కాపాడుకునేందుకు గత్యంతరం లేని పరిస్థితులలో ఇందిర అత్యవసర పరిస్థితిని విధించారు.

1971 సార్వత్రక ఎన్నికలలో రాయ్‌బరేలి నియోజక వర్గంలో ఇందిర అక్రమాలకు పాల్పడడం ద్వారా విజయాన్ని సాధించారని ఆరోపిస్తూ ఆమె ప్రత్యర్థి రాజ్ నారాయణ్ అలహాబాద్ హైకోర్టులో కేసు దాఖలు చేశారు. ఆయన తరపున శాంతిభూషణ్ వాదించారు. రాజ్ నారాయణ్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఎన్నికల్లో ఇందిర అక్రమ, అవినీతికరమైన పద్ధతులకు పాల్పడ్డారని ఆ ఉన్నత న్యాయస్థానం నిర్ధారించింది. లోక్‌సభలో ఆమె సభ్యత్వాన్ని రద్దు చేసింది. అంతేకాక, ఆ తరువాత ఆరు సంవత్సరాల పాటు ఎన్నికలలో పోటీ చేయకూడదని ఆమెపై ఆంక్షలు విధించింది.

అలహాబాద్ న్యాయస్థానంలో ఓటమి అంతిమంగా అత్యవసర పరిస్థితి విధింపునకు దారితీసింది. ఇంకా పలు తీవ్ర పర్యవసానాలకు కారణమయింది. ముఖ్యంగా న్యాయవ్యవస్థలో రాజ్యాంగ విరుద్ధమైన పరిణామాలను పురిగొల్పింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి దక్కవలసిన న్యాయమూర్తికి ఆ గౌరవాన్ని నిరాకరించి, తనకు అనుకూలంగా వ్యవహరించే మరొక న్యాయమూర్తిని ఆ అత్యున్నత రాజ్యాంగ పదవికి ఇందిరాగాంధీ ఎంపిక చేశారు. ఈ సంఘటనలన్నీ 1977 సార్వత్రక ఎన్నికలలో ఆమె ప్రభుత్వ పరాజయానికి విశేషంగా దోహదం చేశాయి.

కొద్ది రోజుల క్రితం 97 ఏళ్ల పండు వయసులో తుది శ్వాస విడిచిన శాంతి భూషణ్ 1977–79 సంవత్సరాల మధ్య మొరార్జీ దేశాయి ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు. మొరార్జీ ప్రభుత్వం పతనం అనంతరం 1980లో ఏర్పాటైన భారతీయ జనతా పార్టీ సంస్థాపక సభ్యులలో ఆయన కూడా ఒకరు. 1986 వరకు ఆయన ఆ పార్టీ కోశాధికారిగా ఉన్నారు. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన సార్వత్రక ఎన్నికలలో రాజీవ్ గాంధీ ‘మతతత్వ ఎజెండా’తో కాంగ్రెస్‌కు విజయం సాధించారని శాంతి భూషణ్ గట్టిగా అభిప్రాయపడ్డారు. దీనిపై ఆయన తన పార్టీ అగ్రనాయకుల అనుమతితో సుప్రీంకోర్టులో ఒక పిటీషన్ దాఖలు చేశారు. అయితే బీజేపీ అగ్రనాయకులు ఆ పిటీషన్‌తో తమకుగానీ, పార్టీకి గానీ సంబంధం లేదని మాట మార్చారు. దీంతో శాంతి భూషణ్ బీజేపీ నుంచి వైదొలిగారు. ‘కోర్టింగ్ డెస్టినీ’ అన్న తన పుస్తకంలో భారతీయ జనతా పార్టీనుంచి తాను బయటకు రావడానికి దారి తీసిన పరిస్థితులను శాంతి భూషణ్ విపులంగా వెల్లడించారు.

అలహాబాద్‌లోని ఒక ప్రముఖ న్యాయవాది కుటుంబం నుంచి ప్రభవించిన న్యాయకోవిదుడు శాంతి భూషణ్. ఆయన న్యాయవాద వృత్తి జీవితం ప్రజాప్రయోజనాలకు అంకితమయింది. సుదీర్ఘ వృత్తి జీవితంలో రాజ్యాంగ సంస్థల స్వతంత్రత, న్యాయవ్యవస్థ జవాబుదారీతనానికి సంబంధించిన ఎన్నో కేసులలో ఆయన తన పటిష్ఠ వాదనలతో న్యాయాన్ని నిలబెట్టారు. 1980 దశకం తుది సంవత్సరాలలో సహచర న్యాయకోవిదులు విఎమ్ తార్కుండే, ఫాలి నారిమన్, అనీల్ దివాన్‌లతో కలసి ‘సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్’ (సిపిఐఎల్) అనే ప్రభుత్వేతర న్యాయసేవా సంస్థ నొకదాన్ని శాంతి భూషణ్ నెలకొల్పారు. ఆ సంస్థ తరపున ప్రజల సమస్యలు, పాలనా సంబంధిత వివాదాలపై ‘ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు’ (పిల్స్) వివిధ న్యాయస్థానాలలో దాఖలు చేసి న్యాయవిజయాలను సాధించారు. 2జి స్పెక్ట్రమ్ లైసెన్స్‌ల రద్దు, కేంద్ర విజిలెన్స్ కమిషనర్‌గా పిజె థామస్ నియామకం రద్దు మొదలైనవి ఆయన దాఖలు చేసి, వాదించి, గెలిచిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలలో ప్రముఖమైనవి.

తన కుమారుడు, దేశ వ్యాప్తంగా న్యాయవాదిగా సుప్రసిద్ధుడైన ప్రశాంత్ భూషణ్‌తో కలిసి ‘కాంపేన్ ఫర్ జుడీషియల్ అకౌంటబిలిటీ అండ్ జుడీషియల్ రిఫార్మ్’ (సిజెఎఆర్) అనే సంస్థ నొకదాన్ని శాంతి భూషణ్ నెలకొల్పారు. భారత న్యాయవ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంపొందించడమే ఆ సంస్థ లక్ష్యం. న్యాయమూర్తుల నియామకాలలో పారదర్శకత పాటించాలని, న్యాయమూర్తుల వృత్తిగత ప్రవర్తనకు సంబంధించి వచ్చే ఆరోపణలపై నిష్పాక్షిక విచారణకు యోగ్యమైన యంత్రాంగం నొకదాన్ని నెలకొల్పాలని, న్యాయమూర్తులుగా నియమితులయినవారు తమ ఆస్తిపాస్తులను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేస్తే ఈ సంస్థ తరపున పలు కేసులు దాఖలు చేసి లక్ష్యసాధనకు ఆయన అవిరామంగా పోరాడారు.

2009లో ఒక వెబ్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అప్పటికి రిటైరైన 16 మంది సిజెఐ (భారత ప్రధాన న్యాయమూర్తి)లలో సగం మంది అవినీతిపరులేనని ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. ఇది దేశవ్యాప్తంగా న్యాయవ్యవస్థ వర్గాలలోనూ, ప్రజలలోనూ తీవ్ర సంచలనం సృష్టించింది. కోర్టు ధిక్కారం ఆరోపణతో ప్రశాంత్ భూషణ్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఆ కేసు విచారణ సందర్భంగా కుమారుడి ఆరోపణలను సమర్థిస్తూ శాంతి భూషణ్, విశ్రాంత భారత ప్రధాన న్యాయమూర్తుల అవినీతి వివరాలను వెల్లడించే సాక్ష్యాధారాలను ఒక సీల్డ్ కవర్‌లో ఉంచి దేశ సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించారు. 2010లో సమర్పించిన ఆ సీల్డ్ కవర్‌ను సుప్రీంకోర్టు విప్పి చూడడం జరగనే లేదు. అసలు ఆ కేసులో శాంతి భూషణ్ ఒక కక్షిదారు కావడానికి కూడా సుప్రీంకోర్టు అనుమతించనే లేదు. అంతేగాక న్యాయస్థానానికి క్షమాపణ చెప్పడం ద్వారా కేసుకు ముగింపు పలకాలని గౌరవనీయ న్యాయమూర్తులు ఆయనకు సూచించారు. తాను ఎట్టి పరిస్థితులలోనూ క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని శాంతి భూషణ్ నిష్కర్షగా చెప్పారు. ‘క్షమాపణ చెప్పను. ఈ వ్యవహారంలో క్షమాపణ చెప్పడమనే ప్రశ్నే లేదు. జైలుకు వెళ్లడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. అత్యున్నత న్యాయవ్యవస్థలో అవినీతి వేళ్లూనుకున్నదని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను’ అని ఆయన వ్యాఖ్యానించారు. గత ఏడాది ఆగస్టులో ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కారంపై కేసును సుప్రీంకోర్టు అంతిమంగా మూసివేసింది.

‘ఇండియా ఎగెనిస్ట్ కరప్షన్’ (ఐఏసీ) కేంద్ర కమిటీలో కూడా శాంతి భూషణ్ కీలక సభ్యుడు. 2012లో ఆవిర్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీలో కూడా ఆయన సంస్థాపక సభ్యుడు. అయితే పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో విభేదాల కారణంగా 2015లో, ఆయన తన కుమారుడితో సహా ఆప్ నుంచి వైదొలిగారు.

ఉత్కర్ష్ ఆనంద్

(‘హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యం)

Updated Date - 2023-02-07T02:21:10+05:30 IST