బడ్జెట్‌లో దీనదయాళ్ దార్శనికత

ABN , First Publish Date - 2023-02-07T02:23:41+05:30 IST

అభివృద్ధి అంటే ఏమిటి? సంపన్నులు మరింత సంపన్నులు కావడమా? భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక దిశా నిర్దేశకుడు దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రవచించిన...

బడ్జెట్‌లో దీనదయాళ్ దార్శనికత

అభివృద్ధి అంటే ఏమిటి? సంపన్నులు మరింత సంపన్నులు కావడమా? భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక దిశా నిర్దేశకుడు దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రవచించిన ‘సమగ్ర మానవతా వాదం’ ప్రకారం సమాజంలోని అందరికీ మేలు చేకూర్చడం, ప్రధానంగా చివరి వరుసలో ఉన్న పేదవారికి సమాజంలో నిలదొక్కుకునే అవకాశాలు కల్పించడమే నిజమైన అభివృద్ధి. దీనదయాళ్ ఉపాధ్యాయ సమగ్ర మానవతా వాదాన్ని భారతీయ జనసంఘ్ 1965లోనే తన సిద్ధాంతంగా ప్రకటించింది. భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిన తర్వాత 1985లో ఆ సిద్ధాంతాన్నే అధికారికంగా స్వీకరించింది. బిజెపి ఆచరణ గురించి తెలియనివారెవరైనా పార్టీ నిబంధనావళిలోని ఆర్టికల్ 3 చదివితే వారికి పార్టీ మూలసిద్ధాంతం ఏమిటో అర్థమవుతోంది. సమాజానికీ వ్యక్తికీ మధ్య; వ్యక్తికీ, ప్రకృతికీ మధ్య ఘర్షణలు సృష్టించి ఆ ఘర్షణ ద్వారా సమాజం మారుతుందనుకునే సిద్ధాంతం కాదు దీనదయాళ్‌ది. సమాజం– వ్యక్తి, వ్యక్తి–ప్రకృతి పరస్పరం విలీనం కావడం ద్వారా అభివృద్ధిని సాధించడమే బిజెపి ఆమోదించిన దీనదయాళ్ సిద్ధాంతం.

ఈ భావజాల నేపథ్యంలోనే గతంలో వాజపేయి హయాంలోనైనా, ఇప్పుడు మోదీ పాలనలోనైనా తీసుకున్న నిర్ణయాలను అర్థం చేసుకోవల్సి ఉంటుంది. సమాజంలోని అన్ని వర్గాల మధ్య సమతుల్యమైన అభివృద్ధి సాధించడమనే సమగ్ర మానవతావాద సిద్ధాంతాన్ని సార్థకం చేసేందుకే బీజేపీ అహర్నిశలు కృషి చేస్తోందని ఈ నెల 1న ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను బట్టి అర్థమవుతోంది. పేదలు, రైతులు, యువత, ఆదివాసీలు, మధ్యతరగతి వర్గాలు ఏ ఒక్క వర్గాన్నీ విస్మరించకుండా మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈ నెల 11న దీనదయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా సరైన నివాళి అని అనిపిస్తోంది.

తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏ వర్గాన్ని విస్మరించిందని? ప్రపంచంలో ఏ ఆర్థికవేత్త సిద్ధాంతం చూసినా ప్రజలకు కూడు, గూడు, దుస్తులు కల్పించలేని ప్రభుత్వం ప్రభుత్వం కాదు. ఈ రీత్యా మోదీ ప్రభుత్వం గత ఎనిమిది సంవత్సరాల్లో అభాగ్యులకు ఎక్కడైనా అన్యాయం చేసిందా? ముఖ్యంగా సమాజంలో చివరి వరుసలో ఉన్న పేదలను దృష్టిలో తీసుకుంటే ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి అయిన భారత దేశంలో ఇవాళ ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన క్రింద 80 కోట్ల మందికి ఆహార ధాన్యాలను సబ్సిడీపై పంపిణీ చేయడం వారి కనీస ఆకలిని తీర్చేందుకు కాదా? ప్రధానమంత్రి ఆవాస్ యోజన క్రింద పేదలకు ఇళ్లు కట్టించేందుకు మొత్తాన్ని రూ.48 వేల కోట్ల నుంచి రూ.79,500 కోట్లకు పెంచడం వారి తలలపై కప్పు కల్పించేందుకు కాదా? జనధన్ ఖాతాల్లో డబ్బులు జమ అవుతూ నేడు తమ కనీసావసరాలు తీర్చుకునే 48 కోట్ల మంది ఏ వర్గం వారు? రూ. 20 లక్షల కోట్ల మేరకు రుణాలు పొందుతున్న రైతన్నలు ఈ దేశం వెన్నెముక కాదా? బడ్జెట్‌లో రూ.1కోటీ 25 లక్షల కోట్లు కేవలం రైతుల సంక్షేమానికే కేటాయించిన మోదీ ప్రభుత్వంది పేద ప్రజల అనుకూల దృక్పథం కాదని ఎవరు అంటారు? ఆహారం, ఎరువులు, పెట్రోలియం సబ్సిడీలు గత ఏడాది కంటే 17 శాతం ఎక్కువగా రూ 5.21 లక్షల కోట్ల మేరకు కేటాయించడం ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకున్నట్లు కాదా? వ్యవసాయాన్ని వేగవంతం చేసేందుకు అవసరమైన స్టార్ట్‌అప్‌లను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా వ్యవసాయ వేగవంత నిధిని ఏర్పాటు చేయడం, వ్యర్థాన్ని సంపదగా మార్చేందుకు, రసాయన ఎరువులకు బదులుగా ప్రత్యామ్నాయ ఎరువులను సృష్టించేందుకు, సహజ వ్యవసాయం కోసం కోటి మంది రైతులను ప్రోత్సహించేందుకు భారీ నిధులను కేటాయించడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడంపై మోదీ ప్రభుత్వ ఆసక్తిని స్పష్టం చేస్తోంది. అడవుల్లో నివసించే ఆదివాసీలను కూడా కేంద్రం విస్మరించలేదు. వారిలో అణగారిన వర్గాల కోసం రూ. 15వేల కోట్లతో ప్రత్యేక పథకం ప్రవేశపెట్టడం, ఆదివాసీ పాఠశాలల్లో 38వేల అధ్యాపకులను నియమించేందుకు నిధులు కేటాయించడం ఇందుకు నిదర్శనం. అదే విధంగా సముద్ర జలాల్లో ప్రాణాలకు తెగించి అత్యంత విలువైన మత్స్యసంపదను సృష్టించే మత్స్యకారులకు చేయూతనిచ్చి మత్స్య మార్కెట్‌ను విస్తరించేందుకు రూ. 6వేల కోట్లు కేటాయించారు. అధిక విలువ కల పళ్లతోటల కోసం రూ. 2200 కోట్లు కేటాయించారు. తృణధాన్యాల పరిశోధనా కేంద్రాన్ని ప్రతిభా కేంద్రంగా గుర్తించారు, పాడి, ఇతర రంగాల్లో సహకారసంఘాలను ప్రోత్సహించడం, సాంప్రదాయ కళాకారులకు విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ ప్యాకేజిని ప్రకటించడం, ప్రతి ఇంటికీ త్రాగు నీరు సరఫరా అందించే లక్ష్యంలో భాగంగా జలజీవన్ మిషన్ క్రింద మొత్తాన్ని రూ. 60 వేలకోట్ల నుంచి రూ. 70 వేలకోట్లకు పెంచడం సమాజంలోని అన్ని వర్గాలపై మోదీ ప్రభుత్వం లోతైన దృష్టిని వెల్లడిస్తోంది. చివరకు జైళ్లలో ఉన్న పేదలకు కూడా న్యాయసహాయం పొందేందుకు ఆర్థిక మద్దతు ప్రకటించారు. సెప్టిక్ ట్యాంకుల్లో దూరి మరణిస్తున్న మునిసిపల్ కార్మికుల పట్ల కూడా మోదీ ప్రభుత్వం ఆర్ద్రతతో వ్యవహరించింది, అన్ని నగరాలు, పట్టణాల్లో నూటికి నూరు శాతం సెప్టిక్ ట్యాంకులు, మ్యాన్ హోల్స్‌ను యంత్రాలతో బాగు చేసేందుకు నిధులు కేటాయించింది. దీనదయాళ్ లక్ష్యాలకు అనుగుణంగా సమాజంలో చివరి వరుసలో ఉన్న చివరి వ్యక్తికి చేరుకోవడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తున్నదనడంలో సందేహం లేదు.

కష్టపడి పనిచేసే మధ్యతరగతి వల్ల మన సంపద పెరుగుతోందని, వారికి మనం చేయూతనిచ్చి అభివృద్ధి పథంలో మరింత భాగస్వామ్యం కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దాదాపు ప్రతి సమావేశంలోనూ పార్టీ నేతలకు చెబుతూ వస్తున్నారు. ఆయన ఆలోచనలకు సార్థకత కలిగించే విధంగా ఈ బడ్జెట్‌లో ఎంతో ఊరట కలిగించారు, పన్ను రాయితీని రూ, 5 లక్షల నుంచి రూ. 7లక్షలకు పెంచడం, ప్రామాణిక తగ్గింపును పెంచడం, కుటుంబ పింఛనులో కూడా రాయితీ కల్పించడం మధ్యతరగతి ఆదాయాన్ని మరింత పెంచుతుందనడంలో సందేహం లేదు. మహిళలకు, సీనియర్ సిటిజన్లకు కూడా బడ్జెట్‌లో ఎన్నో ప్రోత్సాహకాలు కల్పించారు. అంతేకాదు గత ఏడాది కంటే దాదాపు 3 శాతం ఎక్కువగా ఆరోగ్య రంగానికి రూ. 86,175 కోట్లు కేటాయించడం ప్రజారోగ్య రంగంపై ప్రభుత్వ శ్రద్ధకు నిదర్శనం. యువత అంతర్జాతీయ అవకాశాలు అందిపుచ్చుకునేందుకు 30 స్కిల్ ఇండియా అంతర్జాతీయ కేంద్రాలను అభివృద్ధి పరుస్తోంది. స్టార్ట్‌అప్‌లకు మరిన్ని ప్రోత్సాహకాలు కల్పించింది. చిన్న వ్యాపార రంగాలకు కూడా రాయితీలు కల్పించింది.

రాబోయే ఆర్థిక సంవత్సరానికి భారీగా రూ. 45 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి, మొత్తం దేశంలో అన్ని వర్గాల సాధికారిత కోసం ఆచరణీయమైన చర్యలు చేపట్టడం దేశ అభివృద్ధి పట్ల మోదీ ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. ‘సప్తర్షి’ పేరుతో మోదీ ప్రభుత్వం ప్రాధాన్యతగా ఎంచుకున్న అంశాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. మోదీ ప్రభుత్వం ఒకే వర్గాన్ని ప్రోత్సహిస్తోందని బూటకపు ప్రచారం చేసే వారిని నేడు ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఎందుకంటే దీనదయాళ్ ఆశయాలకు అనుగుణంగా తమ జీవితాల్లో అంత్యోదయ కిరణాలు ప్రసరించేందుకు మోదీ సర్కార్ తీసుకుంటున్న చర్యల ప్రభావం ఏమిటో వారికి బాగా తెలుసు.

వై. సత్యకుమార్

(బీజేపీ జాతీయ కార్యదర్శి)

Updated Date - 2023-02-07T02:23:43+05:30 IST