కార్పొరేట్లకు దాసోహమన్న మరో బడ్జెట్

ABN , First Publish Date - 2023-02-02T00:44:41+05:30 IST

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చివరిసారిగా ఈ రోజు పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2023–24 బడ్జెట్‌లో భారత రైతాంగం, వ్యవసాయ రంగం...

కార్పొరేట్లకు దాసోహమన్న మరో బడ్జెట్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చివరిసారిగా ఈ రోజు పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2023–24 బడ్జెట్‌లో భారత రైతాంగం, వ్యవసాయ రంగం పట్ల, నిరాదరణను స్పష్టంగా కనపర్చినది. కొవిడ్‌ సమయంలో ఉపాధి కోల్పోయిన కోట్లాదిమంది నిరుపేదలకు ఉపాధిని, ఆదాయాన్ని కలుగజేసిన గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమానికి ఈ చివరి బడ్జెట్‌లో కూడా తక్కువ కేటాయింపు చేశారు. గత ఏడాది కేటాయింపు రూ.89,400కోట్లు కాగా, ఖర్చుచేసినది రూ.73,000కోట్లు. ఇప్పటి బడ్జెట్‌లో కేవలం రూ.60,000కోట్లు మాత్రమే కేటాయించారు. దీన్నిబట్టే పేదల పట్ల మోదీకి ఎంత ప్రేమో అర్థం అవుతోంది. బడ్జెట్‌ ఫలితాలు చిట్టచివరి వ్యక్తి వరకూ అందాలన్న లక్ష్యానికి భిన్నంగా ఈ కేటాయింపు ఉంది. వాస్తవానికి 202౩–2౪ సంవత్సరానికి రూ.2.4లక్షల కోట్లు అవసరమని అంచనాలు ఉండగా ఇందులో నాల్గవ వంతు మాత్రమే కేటాయింపు ఉండటం అత్యంత దురదృష్టకరం.

మరొక వైపు కొవిడ్‌ సమయంలో కూడా వందల, వేల కోట్ల రూపాయల లాభాలను దండుకొన్న కార్పొరేట్‌ సంస్థలకు, ధనాడ్యులకు ఇన్‌కంటాక్స్ రాయితీలను పెంచారు. కస్టమ్స్ డ్యూటీ రేట్లను 21శాతం నుంచి 13శాతానికి, సర్‌చార్జి రేటును 37శాతం నుంచి 25శాతానికి తగ్గించారు. లోపాలతో కూడిన జీఎస్టీ వలన లక్షలాదిగా మూతపడిన సూక్ష్మ, చిన్న పరిశ్రమలు తిరిగి నిలదొక్కుకొనేందుకు పెద్ద ఎత్తున తోడ్పాటు అందివ్వాల్సి ఉండగా, కేవలం రూ.9,000కోట్లను క్రెడిట్‌ గ్యారంటీ కార్పస్‌కు కేటాయించారు. దీనివల్ల ఆశించిన ఫలితం ఉండదు. మన దేశ జీడీపీకి 30శాతం ఎగుమతులలో 40శాతం వాటాను అందజేస్తూ, దేశంలో మొత్తం పనివారిలో 40శాతం మందికి ఉపాధి కల్పిస్తున్న కుటీర, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు బ్యాంకుల నుంచి కేవలం రూ.1లక్ష కోట్ల ఋణ పరపతి లభించగా, కేవలం 20 కార్పొరేట్‌ గ్రూపులకు అందిన ఋణం రూ.15 లక్షల కోట్లు!

పేదల గృహ నిర్మాణాలకు కేటాయింపులు పెంచడం మాత్రమే ఈ బడ్జెట్‌లో హర్షించవలసిన అంశం. సంవత్సరం క్రితం చారిత్రాత్మక రైతు ఉద్యమాన్ని విరమించే సందర్భంలో యం.ఎస్‌. స్వామినాథన్‌ రైతు కమిషన్‌ చేసిన సిఫారసులకు అనుగుణంగా సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయానికి 50శాతం కలిపి (సి2+50శాతం) చట్టబద్ధ కనీస మద్దతు ధరను కేంద్రం ప్రకటించాలన్న రైతాంగ డిమాండును పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు మోదీ. నేడు ఆ హామీని అటకెక్కించినట్లు కనబడుతుంది. ఏటా ప్రతి బడ్జెట్టులోను వ్యవసాయ అనుబంధ రంగాలకు లక్షల కోట్ల రూపాయల ఋణ పరపతిని పెంచుతున్నామని ప్రకటనలు ఉన్నా ఆచరణలో కౌలు రైతులు, సన్నకారు, చిన్నరైతులు అధిక వడ్డీలకు ప్రైవేటు సంస్థలు/ వ్యక్తుల నుంచి ఋణం తీసుకోక తప్పటం లేదన్నది వాస్తవం. ఈ పరిస్థితిలో తాజా బడ్జెట్‌లో వ్యవసాయ అనుబంధ రంగాలకు ఋణ పరపతి ప్రకటన నేతిబీరకాయలో నెయ్యి చందమే అవుతుంది.

2023–2024 సంవత్సరంలో క్యాపిటల్‌ వ్యయంగా రూ.10లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి సెలవిచ్చారు. వివిధ రాష్ట్రాలలో దీర్ఘకాలంగా పూర్తి కాకుండా మిగిలిపోయిన మేజర్‌, మీడియం, ప్రాజెక్టులు పూర్తి చేయడానికి రాష్ట్రాలకు సహకారం అందించాలన్న భావనే మోదీకి లేదు. ఒకవైపున రైల్వేస్టేషన్‌లు, రైలు మార్గాలను ప్రైవేటీకరించబోతూ, వాటిపైన రూ.2.4 లక్షల కోట్లు ఖర్చు చేయుటమంటే ప్రభుత్వ ఖర్చుతో ప్రైవేట్‌ సంస్థలకు లబ్ధి చేకూర్చడమే! గత ఎనిమిదిన్నరేళ్లుగా సామాన్య ప్రజలు, రైతులు, కార్మికులకు వ్యతిరేకంగా, కార్పొరేట్లకు అనుకూలంగా మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు కొనసాగింపుగానే ఈ చివరి బడ్జెట్‌ కూడా ఉంది.

వడ్డే శోభనాద్రీశ్వరరావు

Updated Date - 2023-02-02T00:44:43+05:30 IST