పశువులకు దోమ కాటు

ABN , First Publish Date - 2023-02-06T23:08:03+05:30 IST

దోమల వల్లే మనుషులు, పంట చేలే కాదు పశుపక్ష్యాదులు కూడా ఇబ్బందిపడుతున్నాయి.

పశువులకు దోమ కాటు
పశువులకు ఏర్పాటు చేసిన తెర

కల్లూరు, ఫిబ్రవరి 6: దోమల వల్లే మనుషులు, పంట చేలే కాదు పశుపక్ష్యాదులు కూడా ఇబ్బందిపడుతున్నాయి. గత కొద్ది రోజుల నుంచి కల్లూరులో దోమల ఉధృతి పెరగడం.. అవి పశువులను కుడుతుండటంతో పాల దిగుబడి తగ్గుతోంది. దీంతో వాటి పెంపకందారులు ఇబ్బందిపడుతున్నారు. పాలు తగ్గడంతో ఆర్థికం నష్టపోతున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో గల కేంద్రాల్లో కూడా పాల సేకరణ 20 నుంచి 25 శాతం వరకు తగ్గింది. దీని ప్రభావంతో పాల సేకరణ కేంద్రాల్లో కూడా డిమాండ్‌కు తగ్గ పాలు రానందున వినియోగదారుల అవసరాల మేరకు క్షీరం లభించని పరిస్థితి నెలకొంది. ఖమ్మం ఉమ్మడి జిల్లాలోనే కల్లూరు మండలం పాడి పోషణలో అగ్రగామి. ఈ ప్రాంతంలో సాగర్‌ జలాలను ఆధారంగా చేసుకుని రైతులు వానాకాలం, యాసంగి వరి పండిస్తారు. విస్తారంగా భూములు ఉండటం, పశుగ్రాసం కూడా లభ్యమవుతుండటంతో చాలా మంది రైతులు పశువులను సాకుతున్నారు. వీటి ద్వారా వచ్చే పాలతో ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో కుటీర పరిశ్రమగా పశువుల పెంపకం మారిందంటే అతిశయోక్తి కాదు. హెరిటేజ్‌ లాంటి పాల సేకరణ సంస్థ కల్లూరులో ఏర్పాటయిందంటే అందుకు కారణం ఇక్కడ పశువుల పెంపకం అధికంగా ఉండటమే.

దోమ కాటుతో తగ్గిన పాల దిగుబడి

కల్లూరు మండలంలో ప్రతి ఏడాది సాగర్‌ కాల్వ పరిధిలో రెండు పంటలు సాగు చేస్తారు. సాగునీటి ఉధృతి కారణంగా దోమలు కూడా అదే స్థాయిలో వ్యాప్తి చెందుతున్నాయి. ఇటీవలి కాలంలో ప్రజలు కూడా దోమల బెడదతో అవస్థలు పడుతున్నారు. పాడి రైతులు తమ పశువులను ఇంటి ముంగిట కట్టేయడంతో విపరితంగా దోమ కాటుకు గురయి ఆనారోగ్యం పాలవుతున్నాయి. ఇలా సగటున ఒక పాడి పశువు గతంలో ఐదు లీటర్లు పాలు ఇస్తే, దోమ కాటుతో 3.50 లీటర్ల పాలు మాత్రమే ఇస్తోంది మండలంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ సేకరణ కేంద్రాల్లో పాలు సక్రమంగా రాక మార్కెట్‌లో డిమాండ్‌ పెరిగింది. పాలల్లో కొవ్వు శాతం ఆధారంగా సగటున ఒక లీటరుకు రూ. 3 నుంచి రూ.5 వరకు పెంచారు.

Updated Date - 2023-02-06T23:08:04+05:30 IST