భావితరాలకు మిగిలేది అప్పులే!

ABN , First Publish Date - 2023-02-07T02:15:32+05:30 IST

తెలంగాణ బడ్జెట్ బడుగుల కోసం కాదు, బడాబాబుల కోసం అని మరోమారు రుజువైంది. విద్య, వైద్యం, ఉపాధి కల్పన రంగాలకు కేటాయింపులు నానాటికీ తగ్గిపోతున్నాయి...

భావితరాలకు మిగిలేది అప్పులే!

తెలంగాణ బడ్జెట్ బడుగుల కోసం కాదు, బడాబాబుల కోసం అని మరోమారు రుజువైంది. విద్య, వైద్యం, ఉపాధి కల్పన రంగాలకు కేటాయింపులు నానాటికీ తగ్గిపోతున్నాయి. మాది ‘కుటుంబ పాలనే’ అని కేటీఆర్‌ ఉద్ఘాటించినట్టుగా, ఆయన శాఖలకు మొత్తం బడ్జెట్లో 15వేలకోట్లకు పైగా కేటాయింపులు జరిగాయి. హరీశ్‌ రావు మంత్రిగా ఉన్న ఆర్థిక, వైద్యశాఖలకు 61,910కోట్ల కేటాయింపులున్నాయి. రెవెన్యూకు 3,560 కోట్లు అదనం. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉన్న ఇరిగేషన్‌కు 26,885 కోట్లు, సామాజిక మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలోని పంచాయతీరాజ్‌కు 31,426కోట్లు, సన్నిహితమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి శాఖ రోడ్లు–భవనాలకు 22,260 కోట్లు కేటాయింపులు జరిగాయి. మొత్తం బడ్జెట్ 2.90 లక్షల కోట్లలో తమ చేతిలో కీలక శాఖలున్న కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌లకే 37శాతం నిధులుపోగా, పంచాయతీరాజ్, రోడ్లు, భవనాలను కూడా కలుపుకొంటే బడ్జెట్‌లో 55శాతం (1,61,816కోట్లు). ఈ 1.61 లక్షల కోట్లు రాష్ట్రాభివృద్ధికే ఖర్చు చేయవచ్చు కానీ, ఇంత భారీమొత్తం ఎవరెవరిచేతుల్లో ఉంది, వారు ఎవరి కోసం ఎలా ఖర్చు చేస్తారనే స్పష్టత ప్రజలకు ఉండాలి. లక్షల కోట్లను గుప్పిట్లో పెట్టుకొని, తమవారికి కాంట్రాక్టులు కట్టబెట్టి, మరోసారి అందలం ఎక్కాలనే ఆరాటం తప్ప, అభివృద్ధిపైన, భవిష్యత్‌ తరాలపైనా ఈ బడ్జెట్‌లో ఆలోచనేదీ కనబడటం లేదు.

భవిషత్తుకు భరోసా అంటే విద్య, వైద్యం, ఉపాధి, నైపుణ్యకల్పనలకు అధిక నిధుల కేటాయింపు జరగాలి. విద్యపై తమ మొత్తం బడ్జెట్ వ్యయంలో మిగతా రాష్ట్రాలు సగటున 15.2 శాతం కేటాయిస్తే, తెలంగాణలో 7శాతం మించటంలేదు. రాష్ట్ర జీఎస్‌డీపీలో 6శాతం. కేటాయింపులు ఉండాల్సిందిపోను ఒకశాతం మించలేదు. జీఎస్‌డీపీ పెరిగినట్టు గొప్పకుపోతున్నవారు విద్యకు కేటాయింపులు ఎందుకు తగ్గుతున్నాయో చెప్పాలి కదా. గత బడ్జెట్‌లో యూనివర్సిటీల అభివృద్ధి కోసం కేటాయించిన 500కోట్లను పూర్తిగా ఖర్చు చేయని ప్రభుత్వం, ఇప్పుడూ అదే తరహాలో 500కోట్లు కేటాయించింది. పాఠశాల, మాధ్యమిక విద్యపై కూడా అదే తరహా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. వైద్యంపై ఇతర రాష్ట్రాలు తమ బడ్జెట్ వ్యయంలో సగటున ఆరేడుశాతం నిధులను కేటాయిస్తే, తెలంగాణ కేటాయిస్తున్నది ఐదుశాతం లోపే. మూడేళ్ళుగా ఎదుర్కొన్న కరోనా సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొనైనా వైద్య, మౌలిక సదుపాయాల కల్పనకు, ప్రభుత్వ దవాఖానాల బాగుకోసం కోసం నిధులు కేటాయించి ఉంటే బాగుండేది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామని చెబుతున్న ప్రభుత్వం, ఎఐ, బ్లాక్‌చైన్ టెక్నాలజీస్‌, స్పేస్ టెక్, బిగ్ డాటా వంటి రంగాల్లో నైపుణ్యాలు కల్పించాల్సి ఉండగా, అందుకు నిధులు కేటాయించలేదు. ఐటీ సెక్టారుకు 366 కోట్లు మాత్రమే దక్కింది. ఉపాధి, కార్మిక నైపుణ్యాల కల్పనకు 542కోట్లు మాత్రమే కేటాయించింది. నిరుద్యోగ భృతి విషయంలో నిరుద్యోగులకు నిరాశే మిగిలింది.

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పాఠశాలలు, గురుకులాలు, కాలేజీల సంఖ్య డబుల్, త్రిబుల్ అయిందని చెప్పుకున్న ప్రభుత్వం నిధుల్ని డబుల్ చేయకుండా, సగం తగ్గించేసింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా జీతాల్ని, సౌకర్యాలని పెంచుకున్న, కొత్త కలెక్టరేట్లను, సచివాలయాన్ని నిర్మించుకున్న ప్రభుత్వం – మెస్ చార్జీలు, ట్యూషన్ ఫీజులు పెంచలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ విద్యార్థుల సదుపాయాల కోసం, హాస్టల్‌ స్వంత భవనాల కోసం నిధులు ఇవ్వకుండా ముంచింది. ఆకాశంలో సగం అంటూ మహిళల గురించి మాట్లాడే ప్రభుత్వం – మహిళా సంక్షేమం, పిల్లలు, వృద్ధులకు కలిపి 2,131 కోట్లు మాత్రమే కేటాయించింది. దేశమంతా మహిళా బడ్జెట్‌పై చర్చ జరుగుతుంటే తెలంగాణ మాత్రం అరకొర నిధులతో చేతులు దులుపుకుంది. మహిళా యూనివర్సిటీ విషయంలో అతీగతీ లేదు. దళితబంధుకు గత ఏడాది మాదిరిగా అవే 17,700 కోట్లు కేటాయించి, టీఎస్‌ ప్రైడ్‌ లాంటి పథకాలను పాతర పెట్టింది. గిరిజన బంధు విషయంలో గిరిజనులకు నిరాశే మిగిలింది.

మిగులు రాష్ట్రం అని చరిత్రలో చెప్పుకున్న గొప్పగొప్ప మాటల్ని ఇప్పుడు పూర్తిగా మార్చివేసి, వచ్చే ప్రభుత్వం కనీసం అభివృద్ధి పనుల కోసం ఆలోచించలేనంత భయంకరంగా అప్పులు చేశారు. ఇప్పటికే 1.44 లక్షల కోట్ల మేర బడ్జెటేతర అప్పులు తెచ్చింది ప్రభుత్వం. ఇక 2022–23లో 52,167కోట్లు అప్పు తెచ్చిన ప్రభుత్వం ఈ సారి మాత్రం 70వేల కోట్లకు పైగా ఆప్పు చేస్తే తప్ప మనుగడ సాగించలేని పరిస్థితి ఏర్పడింది. కేంద్రం నుంచి వచ్చే గ్రాంటులు, పన్ను పరిహారాలు తక్కువగానే వస్తాయని తెలిసినప్పటికీ, ఎక్కువగా చూపిస్తూ, బడ్జెట్‌ పెంచి బిల్డప్‌ ఇస్తున్నారు. కేంద్రం నుండి నిధులు రాకపోయేసరికి, మళ్ళీ అప్పుల్ని చేసి రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారు. రాష్ట్రం తన ‘ఆర్థిక క్రమశిక్షణను’ కోల్పోయింది. నీళ్ళు, నిధులు, నియామకాల్లో అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ప్రాణాలు వదిలిన అమరుల త్యాగాలకు విలువ, గౌరవం దక్కాలంటే రాష్ట్ర నిధుల్లో సముచితవాటా బడుగులకు కేటాయించాలి. లేదంటే అమరుల ఆశయాలను అవమానించినట్టే.

ప్రభాకర్ చౌటి

Updated Date - 2023-02-07T02:15:34+05:30 IST