యువత కోసం యువగళం

ABN , First Publish Date - 2023-01-25T00:25:53+05:30 IST

జగన్‌రెడ్డి అరాచక పాలనపై ఉక్కు పిడికిలి బిగించి అన్ని వర్గాల ప్రజలను చైతన్యం చెయ్యడమే లక్ష్యంగా యువగళం పేరుతో నీతి–అవినీతి...

యువత కోసం యువగళం

జగన్‌రెడ్డి అరాచక పాలనపై ఉక్కు పిడికిలి బిగించి అన్ని వర్గాల ప్రజలను చైతన్యం చెయ్యడమే లక్ష్యంగా యువగళం పేరుతో నీతి–అవినీతి, ధర్మం–అధర్మం, సమర్ధత–అసమర్ధత, ఏది మంచి–ఏది చెడు అనే అంశాలు వివరించేందుకు సుదీర్ఘ పాదయాత్రకు సిద్ధమయ్యారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. రాష్ట్రంలో 100 నియోజకవర్గాల గుండా దాదాపు 400 రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్ల మేర కొనసాగే ఈ పాదయాత్రలో జగన్‌రెడ్డి పాలనలో పీడనకు గురి అయిన అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకొంటూ, వాటిపై గళమెత్తుతూ జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు లోకేష్ పాదయాత్ర చెయ్యనున్నారు.

ప్రజాస్వామ్యంలో ఎవరైనా అధికారంలోకి రావచ్చు. కానీ ప్రజల పేరుచెప్పి అధికారంలోకి వచ్చి తన రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు బలిపెట్టడం అందరినీ కలిసివేస్తున్నది. పగ, ప్రతీకారం, విద్వేషం, విధ్వంసంతో ఆంధ్రప్రదేశ్‌ను అధోగతిపాలు చేశారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలు తిరోగమన బాట పట్టాయి. రాష్ట్ర ప్రజలకు వర్తమానమే కాదు భవిష్యత్ కూడా లేకుండా చేశారు. నవ్యాంధ్రను నాశనం చేస్తున్న అవినీతి, అరాచక, అనైతిక, అసమర్ధ పాలకుల పీచమణిచే మహోగ్రశక్తిగా యువజనం కదం తొక్కాలి. కులాలు, మతాలు, కుట్రలు, కుతంత్రాలు, నిర్బంధాలతో నలిగిపోతున్న రాష్ట్రాన్ని కాపాడేందుకు యువత ఉప్పెనై ఎగిసిపడాలి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా యువతే కనిపిస్తున్నారు. వారిలో అత్యధికులు స్వయం ఉపాధి కల్పన, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారే. రాష్ట్రానికి యువతే పెద్ద సంపద. అటువంటి యువత అనేక సమస్యలతో సతమతమౌతోంది. మాదకద్రవ్యాలు, మద్యం, డ్రగ్స్‌ వంటి వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారు. రాజకీయాలకు విద్యావంతులైన యువత దూరంగా ఉంటున్నారు. చైతన్యవంతమైన యువత నేడు రాజకీయాలలోకి రావాలి.

నారా లోకేశ్ నాలుగేళ్లుగా జగన్మోహన్ రెడ్డి విధ్వంస, విద్వేష, అరాచక, ఫాసిస్టు పాలనపై వెన్ను చూపని పోరాటం చేస్తున్నారు. అధికార పక్ష నాయకులు తనపై ఎన్ని తప్పుడు ఆరోపణలు, విమర్శలు చేసినా సమర్ధంగా తిప్పికొడుతున్నారు. ప్రభుత్వ మోసపూరిత జాబ్ క్యాలెండర్ ఉపసంహరించుకోవాలని, జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చిన విధంగా 2లక్షల 30 వేల ఉద్యోగాలకు రీ నోటిపికేషన్ ఇవ్వాలని ఉద్యోగాల భర్తీ కోసం రోడ్కెక్కి ఆందోళన చేస్తున్న నిరుద్యోగుల తరఫున లోకేష్‌ పోరాటం చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగులకు అండగా నిలిచారు. భారీ వర్షాలకు, వరదలకు సర్వం కోల్పోయిన రైతులను ఓదార్చి వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇసుక కొరత వల్ల దాదాపు 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడినప్పుడు వారి తరపున పోరాటం చేసి వారికి అండగా నిలిచారు. అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలిచారు. సహజ వనరుల దోపిడిలో పెట్రేగిపోతున్న అధికార పార్టీ నాయకులపై పోరాటం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులపై జరుగుతున్న దాడులు, అక్రమ అరెస్టులపై పోరాటం చేస్తూ వారికి భరోసా ఇచ్చారు. దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, దాడులు పైనా, కక్ష సాధింపుల పైనా నారా లోకేష్‌ అవిశ్రాంత పోరాటం చేశారు.

గత ప్రభుత్వంలో ఐటి మంత్రిగా లోకేష్ వివిధ దేశాల్లో పర్యటించి ఐటి పరిశ్రమలు రాష్ట్రానికి రప్పించేందుకు శ్రమించారు. రాష్ట్రంలో యువత భవిష్యత్తు లక్ష్యాలకు దీటుగా వారిని గుణాత్మకంగా తీర్చిదిద్ది పెద్దఎత్తున వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు లోకేశ్ అవిరళ కృషి చేశారు. నేడు అధికారం అయోగ్యుల పాలబడి ఐటి అడ్రస్ లేకుండా పోయింది. జగన్‌రెడ్డి కొత్త పరిశ్రమలు తేకపోగా, ఉన్న కంపెనీలు తరిమేసి యువతకు ఉపాధి దూరం చేశారు.

సెంటర్ పర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 2019 ఏప్రిల్ నాటికి నాలుగు శాతం ఉన్న నిరుద్యోగిత రేటు నేడు 13 శాతానికి పెరగడం ప్రస్తుత ప్రభుత్వ చేతకాని తనానికి అద్దం పడుతున్నది. ఉద్యోగ, ఉపాధి కల్పన కేంద్రంగా ఉన్న అమరావతిని ఆపేసి 15 లక్షల ‎ఉద్యోగాలకు గండి కొట్టారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉపాధికి ఊతం ఇచ్చే విదేశీ విద్య, స్వయం ఉపాధి రుణాలు, స్కిల్ డెవలప్‌మెంట్, ఎన్టీఆర్ స్టడీ సర్కిల్స్ రద్దు చేశారు. తెలుగుదేశం హయాంలో ఐటీ అభివృద్ధితో 36 వేల మందికి ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధితో 64 వేల మందికి ఉద్యోగ కల్పన జరిగింది. గత ప్రభుత్వం ఐదేళ్లలో రెండుసార్లు డీఎస్సీ నిర్వహించి 17,591 ఉద్యోగాలిస్తే ప్రతి ఏటా డీఎస్సీ అన్న జగన్‌రెడ్డి ఇంతవరకు కనీసం ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదు. బ్యూరో ఆఫ్ పోలీసు రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (బిపిఆర్‌డి) గణాంకాల ప్రకారం 2020 జనవరి 1 నాటికి రాష్ట్రంలో 14,341 పోలీసు ఉద్యోగాలు ఖాళీలుంటే, ‎ఇంతవరకు ఒక్క ఉద్యోగం భర్తీ చెయ్యలేదు.

కాంట్రాక్టు ఉద్యోగుల్ని రెగ్యులైజ్ చేస్తానన్న జగన్‌రెడ్డి అధికారంలోకి రాగానే ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టి వారిని రోడ్డున పడేశారు. టీడీపీ ప్రభుత్వం ప్రతి నెలా ఆరు లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇస్తే, ఈ ప్రభుత్వం దానిని రద్దు చేసి నిరుద్యోగులకు ద్రోహం చేసింది. గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు, సబ్సిడీతో బ్యాంకు రుణాల ద్వారా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పిస్తే, జగన్ రెడ్డి వాటిని రద్దు చేసి నిరుద్యోగుల పొట్టకొట్టారు. ఉపాధి, ఉద్యోగావకాశాలు లేక 2021–22‎లో 358 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రత్యేక హోదా సాధించి ఉద్యోగాల విప్లవం తెస్తానని యువతకు ఆశపెట్టారు జగన్. అధికారంలోకి వచ్చాక హోదాపై పిల్లిమొగ్గలు వేసి తన కేసుల మాఫీ కోసం హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారు. అడుగడుగునా వంచించే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు యువత వివేకవంతం కావాలి. యువతీ యువకులు రాష్ట్రంలో నిర్ణాయక శక్తులుగా ఎదిగి తమ భవిష్యత్‌కి మేలు బాటలు వేసుకోవాలి. యువతరమే సమసమాజ నిర్మాణానికి సారథులై, నవ్యాంధ్ర నిర్మాణానికి వారధులై, రాష్ట్ర ప్రగతికి నిచ్చెన మెట్లవ్వాలి. ఆ దిశగా యువతరం ముందడుగు వెయ్యాలి.

నన్నూరి నర్సిరెడ్డి

టిడిపి జాతీయ అధికార ప్రతినిధి

Updated Date - 2023-01-25T00:29:30+05:30 IST