బడ్జెట్లో మధ్య తరగతికి తాయిలాలు?

ABN , First Publish Date - 2023-01-27T04:08:27+05:30 IST

ఈసారి బడ్జెట్లో మధ్య తరగతికి భారీగా తాయిలాలు ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆయా ప్రభుత్వ శాఖల...

బడ్జెట్లో మధ్య తరగతికి తాయిలాలు?

ఐటీ మినహాయింపు పరిమితి పెంచే అవకాశం

సెక్షన్‌ 80 మినహాయింపులు సైతం పెరిగే చాన్స్‌

న్యూఢిల్లీ: ఈసారి బడ్జెట్లో మధ్య తరగతికి భారీగా తాయిలాలు ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆయా ప్రభుత్వ శాఖల సిఫారసులను బడ్జెట్లో ప్రకటించవచ్చని, అవి మధ్య తరగతివారికి ప్రయోజనకరం కానున్నాయని వారు పేర్కొన్నారు.

  • 2014లో అరుణ్‌ జైట్లీ వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రూ.2.5 లక్షలకు పెంచారు. అప్పటి నుంచి ఈ పరిమితిని పెంచలేదు. అంతేకాదు, రూ.50,000 స్టాండర్డ్‌ డిడక్షన్‌ కూడా 2019 నుంచి అదే స్థాయిలో కొనసాగుతోంది. మధ్యతరగతి ఎదుర్కొంటున్న ఇబ్బందులపై తనకు పూర్తి అవగాహన ఉందని.. ఇప్పటికే తమ ప్రభుత్వం వారికోసం ఎంతో చేసిందని, మున్ముందూ చేస్తుందని ఈమధ్య సీతారామన్‌ వ్యాఖ్యానించడం బడ్జెట్లో ఈ వర్గానికి భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించవచ్చన్న అంచనాలను పెంచాయి.

  • ఐటీ మినహాయింపు పరిమితి, స్టాండర్డ్‌ డిడక్షన్‌తోపాటు సెక్షన్‌ 80సీ మినహాయింపుల పరిమితిని కూడా పెంచే అవకాశాలున్నాయి. ప్రస్తుతం 80సీ కింద జీవిత బీమా, ఎఫ్‌డీ, బాండ్లు, హౌసింగ్‌, పీపీఎఫ్‌ వంటి ఆర్థిక సాధనాల్లో పెట్టిన పెట్టుబడులపై ఏటా రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. 80డీ కింద ఆరోగ్య బీమా ప్రీమియంపైనా మరింత పన్ను మినహాయింపు లభించే చాన్స్‌ లేకపోలేదు. ఈ సెక్షన్‌ కింద 60 ఏళ్ల లోపు వారికి ఏటా గరిష్ఠంగా రూ.55,000 వరకు ప్రీమియంపై మినహాయింపు లభిస్తుంది.

  • కరోనా సంక్షోభం మొదలైనప్పటినుంచి క్యాపిటల్‌ మార్కెట్లో చురుకుగా పెట్టుబడులు పెడుతున్న మధ్యతరగతి మదుపరులకు లబ్ది చేకూరేలా మూలధనంపై లాభార్జన పన్నును మరింత సరళీకరించే అవకాశం ఉంది.

Updated Date - 2023-01-27T04:08:31+05:30 IST