స్టాక్‌ బ్రోకర్లు ఇకపై క్లయింట్ల సొమ్మును అట్టిపెట్టుకోలేరు..

ABN , First Publish Date - 2023-02-07T02:57:39+05:30 IST

స్టాక్‌ బ్రోకర్లు మదుపరుల సొమ్మును దుర్వినియోగపర్చకుండా అడ్డుకునేందుకు క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. స్టాక్‌ బ్రోకర్లు, క్లియరింగ్‌ సభ్యులు...

స్టాక్‌ బ్రోకర్లు ఇకపై క్లయింట్ల సొమ్మును అట్టిపెట్టుకోలేరు..

  • ట్రేడింగ్‌ రోజునే ఇన్వెస్టర్‌ నిధులను క్లియరింగ్‌ కార్పొరేషన్‌కు బదిలీ చేయాల్సిందే..

  • కీలక ప్రతిపాదన చేసిన సెబీ

ముంబై: స్టాక్‌ బ్రోకర్లు మదుపరుల సొమ్మును దుర్వినియోగపర్చకుండా అడ్డుకునేందుకు క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. స్టాక్‌ బ్రోకర్లు, క్లియరింగ్‌ సభ్యులు ట్రేడింగ్‌ ముగిసిన తర్వాత క్లయింట్ల సొమ్మును తమ వద్ద అట్టిపెట్టుకోకుండా మొత్తం నిధులను అదే రోజున క్లియరింగ్‌ కార్పొరేషన్‌కు బదిలీ చేయాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం ఇన్వెస్టర్ల్లు ట్రేడింగ్‌ కోసం తమ సొమ్ము ను బ్రోకర్‌ వద్ద ఉంచినప్పుడు.. లావాదేవీ అనంతరం మిగిలిన మొత్తాన్ని క్లియరింగ్‌ కార్పొరేషన్‌కు బదిలీ చేసే ముందు కొంత భాగాన్ని బ్రోకర్‌, మిగతా భాగాన్ని క్లియరింగ్‌ మెంబర్‌ అట్టిపెట్టుకుని ఉంటారు.

గ్రీన్‌ డెట్‌ సెక్యూరిటీస్‌ జారీకి ప్రవర్తనా నియమావళి

హరిత రుణ పత్రాల జారీకి సంబంధించి ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించే ప్రకటనలను నిరోధించేందుకు సెబీ ప్రవర్తనా నియమావళిని చేసింది. గ్రీన్‌ డెట్‌ సెక్యూరిటీలు జారీ చేసే వారు ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించే లేబుళ్లు, డేటా వినియోగం లేదా ఇతర అనుచిత విధానాలకు పాల్పడవద్దని నియంత్రణ మండలి పేర్కొంది.

అలాగే ఆల్టర్నేటివ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్లు (ఏఐఎఫ్‌) నేరుగా ఇన్వెస్టర్లకే పథకాలు ఆఫర్‌ చేయాలని సెబీ ప్రతిపాదించింది. అలాగే, మిస్‌ సెల్లింగ్‌ను నిరోధించేందుకు కమిషన్‌ పంపిణీకి ప్రయోగాత్మక విధానాన్ని కూడా ప్రతిపాదించింది. తొలిదశ ఆదేశాల్లో భాగంగా రూ.500 కోట్లకు పైగా కార్పస్‌ కలిగిన అన్ని ఏఐఎ్‌ఫల పథకాలు 2024 ఏప్రిల్‌ 1 నాటికి తప్పనిసరిగా తమ యూనిట్లను డీమెటీరియలైజ్‌ చేయాలని సెబీ ఆదేశించింది.

గ్రీన్‌ బాండ్స్‌కు మార్గదర్శకాలు

గ్రీన్స్‌బాండ్‌ నిర్వహణకు సంబంధించి సెబీ మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ రుణ సమీకరణకు సంబంధించిన పర్యావరణ స్థిరీకరణ ఉద్దేశాలపై మరింత సమాచారాన్ని వెల్లడించాలని చేయాలని బాండ్లు జారీ చేసేవారిని నిర్దేశించింది.

మార్కెట్లోని విదేశీ పెట్టుబడుల అసలు లబ్ధిదారులెవరు..?

  • కస్టోడియన్‌ బ్యాంక్స్‌ను వివరాలు కోరిన సెబీ

భారత మార్కెట్లోని విదేశీ ఫండ్ల నిధులు, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల (ఎ్‌ఫపీఐ) అసలు లబ్ధిదారుల వివరాలను సమర్పించాలని క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ గత వారంలో పలు కస్టోడియన్‌ బ్యాంక్‌లను ఆదేశించినట్లు తెలిసింది. ఇది అసాధారణ పరిణామమేమీ కానప్పటికీ, అమెరికన్‌ షార్ట్‌ సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ తన నివేదికలో చేసిన ఆరోపణలతో అదానీ గ్రూప్‌ షేర్లతో పాటు మొత్తం మార్కెట్‌ భారీ కుదుపునకు లోనవుతున్న నేపథ్యంలో సెబీ తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఎందుకంటే, అదానీ గ్రూప్‌ పన్ను స్వర్గధామ దేశాలను అక్రమ వ్యవహారాలకు ఉపయోగించుకుందని, విదేశాల నుంచి భారత్‌కు మళ్లించిన నిధులతో కంపెనీల షేర్ల ధరలను కృత్రిమంగా పెంచుకుందని హిండెన్‌బర్గ్‌ ఆరోపించింది. గత నెలలో విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్‌ నుంచి రూ.28,852 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం సెబీ వద్ద రిజిస్టర్‌ చేసుకున్న విదేశీ ఫండ్లు 11,000కు పైమాటే. ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో లైసెన్సు కలిగిన ఇన్వెస్టర్లు సెబీ కోరిన మేరకు తన పెట్టుబడుల అసలు లబ్ధిదారు ఎవరన్న వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.

Updated Date - 2023-02-07T02:57:42+05:30 IST