బ్యాంకింగ్‌, ఆర్థిక షేర్లలో అమ్మకాలు

ABN , First Publish Date - 2023-01-26T01:23:04+05:30 IST

భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు ఒక శాతానికి పైగా పతనమయ్యాయి. బ్యాంకింగ్‌, ఆర్థిక సేవల రంగ షేర్లలో అమ్మకాలు..

బ్యాంకింగ్‌, ఆర్థిక షేర్లలో అమ్మకాలు

సెన్సెక్స్‌ 774 పాయింట్లు పతనం జూ 18,000 దిగువకు నిఫ్టీ

ముంబై: భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు ఒక శాతానికి పైగా పతనమయ్యాయి. బ్యాంకింగ్‌, ఆర్థిక సేవల రంగ షేర్లలో అమ్మకాలు హోరెత్తడంతోపాటు విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున పెట్టుబడులను ఉపసంహరించుకోవడం ఇందుకు కారణమైంది. ఫ్యూచర్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌ అండ్‌ ఓ) కాంట్రాక్టుల ముగింపు రోజు కావడంతో బుధవారం చాలామంది ఇన్వెసర్లు తమ పొజిషన్లను క్లోజ్‌ చేసుకున్నారు. అలాగే, అదానీ గ్రూప్‌ షేర్లలో అమ్మకాలు పోటెత్తడం, శుక్రవారం నుంచి టీ2 నుంచి టీ1 సెటిల్‌మెంట్‌కు మారనుండటం కూడా మార్కెట్‌పై ఒత్తిడి పెంచింది. ఒక దశలో దాదాపు 900 పాయింట్లకు వరకు క్షీణించిన సెన్సెక్స్‌.. చివరికి 773.69 పాయింట్ల (1.27ు) నష్టంతో 60,205.06 వద్ద ముగిసింది. నిఫ్టీ 226.35 పాయింట్లు కోల్పోయి 17,891.95 వద్ద క్లోజైంది.

నేడు మార్కెట్లకు సెలవు: గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం స్టాక్‌ మార్కెట్లకు సెలవు. శుక్రవారం మార్కెట్లు యధావిధిగా పనిచేస్తాయి.

Updated Date - 2023-01-26T01:23:04+05:30 IST