గట్టెక్కిన అదానీ ఎఫ్‌పీఓ

ABN , First Publish Date - 2023-02-01T04:02:25+05:30 IST

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.20,000 కోట్ల ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఇష్యూ (ఎఫ్‌పీఓ)కు రిటైల్‌ ఇన్వెస్టర్లు షాకిచ్చారు...

గట్టెక్కిన అదానీ ఎఫ్‌పీఓ

  • ఆదుకున్న సంస్థాగత మదుపరులు

  • సహకరించిన తోటి పారిశ్రామిక పెద్దలు !

  • ముఖం చాటేసిన రిటైల్‌ ఇన్వెస్టర్లు, ఉద్యోగులు

న్యూఢిల్లీ: అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.20,000 కోట్ల ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఇష్యూ (ఎఫ్‌పీఓ)కు రిటైల్‌ ఇన్వెస్టర్లు షాకిచ్చారు. మంగళవారం ముగిసిన ఎఫ్‌పీఓలో రిటైల్‌ ఇన్వెస్టర్ల కోసం రిజర్వు చేసిన షేర్లలో 12 శాతం మాత్రమే సబ్‌స్ర్కైబ్‌ అయ్యాయి. హిండెన్‌బర్గ్‌ నివేదికతో అదానీ గ్రూపుపై సడలిన విశ్వాసం, ఎఫ్‌పీఓ కంటే తక్కువ ధరకే కంపెనీ షేర్లు సెకండరీ మార్కెట్‌లో దొరకడం ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కంపెనీ ఉద్యోగులూ ఈ ఎఫ్‌పీఓపై పెద్దగా ఆసక్తి చూపలేదు. వీరికోసం రిజర్వు చేసిన షేర్లలో 55 శాతం షేర్లకు మాత్రమే బిడ్స్‌ వచ్చాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లలా కంపెనీ ఉద్యోగులకూ అదానీలపై విశ్వాసం సన్నగిల్లినట్టు కనిపిస్తోంది.

ఎట్టకేలకు గట్టెక్కిన ఎఫ్‌పీఓ: రిటైల్‌ మదుపరులు, ఉద్యోగులు దూరంగా ఉన్నా సంస్థాగత మదుపరుల అండతో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ (ఏఈఎల్‌) కంపెనీ రూ.20,000 కోట్ల ఎఫ్‌పీఓ ఎట్టకేలకు గట్టెక్కింది. ఆఖరి రోజైన మంగళవారం ట్రేడింగ్‌ ముగిసేసరికి ఇష్యూ 1.12 రెట్లు సబ్‌స్ర్కైబ్‌ అయింది. ఈ ఇష్యూ కింద మొత్తం 4.55 కోట్ల షేర్లను కంపెనీ అమ్మకానికి పెట్టగా.. మదుపరుల నుంచి 5.08 కోట్ల షేర్ల కొనుగోలుకు బిడ్స్‌ అందాయి. ఒక్కో షేరు రూ.3,112-3,276 ధరల శ్రేణిలో ఏఈఎల్‌ ఈ షేర్లను అమ్మకానికి పెట్టింది. ఇష్యూ ధర ఖరారు చేసేందుకు ఏఈఎల్‌ బోర్డు బుధవారం సమావేశమవుతోంది. హిండెన్‌బర్గ్‌ నివేదిక నేపథ్యంలో ఈ ఎఫ్‌పీఓ ఇష్యూని పూర్తిగా సబ్‌స్ర్కైబ్‌ చేయించడం ద్వారా అదానీ గ్రూప్‌... మార్కెట్లో తన సత్తాని మరోసారి చాటిందని భావిస్తున్నారు.

సంస్ధాగత మదుపరుల దన్నుతో: హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ నివేదిక నేపథ్యంలో తొలి రెండు రోజుల్లో ఈ ఎఫ్‌పీఓ సబ్‌స్ర్కిప్షన్‌ మూడు శాతం మించలేదు. దీంతో అసలు ఈ ఇష్యూ గట్టెక్కుతుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఇష్యూ చివరి రోజైన మంగళవారం సంస్థాగత, వ్యూహాత్మక మదుపరులు రంగంలోకి దిగడంతో ఎఫ్‌పీఓ కొద్దిపాటి ఓవర్‌ సబ్‌స్ర్కిప్షన్‌తో గట్టెక్కింది. మొత్తం ఎఫ్‌పీఓలో 16 శాతం షేర్లను అబుదాబీ రాజకుటుంబానికి చెందిన ఇంటర్నేషనల్‌ హోల్డింగ్‌ కంపెనీ (ఐహెచ్‌సీ) అనే సంస్థ తీసుకుంది. ఇందుకోసం ఈ సంస్థ 40 కోట్ల డాలర్లు (సుమారు రూ.3,200 కోట్లు) ఖర్చు చేసింది. ఆఖరి రోజైన మంగళవారం ఈ ఇష్యూలో మదుపు చేసిన సంస్థాగత మదుపరులు పేర్లు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.

ఎవరీ సంస్థాగత మదుపరులు: అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఎఫ్‌పీఓను గట్టెక్కించిన ఈ సంస్థాగత ఇన్వెస్టర్లు ఎవరనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అబుదాబీ రాజకుటుంబానికి చెందిన ఐహెచ్‌సీ పేరు తప్ప మరే సంస్థాగత సంస్థ పేరు ఇంకా వెల్లడి కాలేదు. అయితే అదానీలకు సన్నిహితులైన కొందరు పారిశ్రామికవేత్తల కుటుంబాల నేతృత్వంలోని సంస్థలూ తలా ఒక చేయి వేసినట్టు సమాచారం.

టాప్‌ 10 కుబేరుల జాబితా నుంచి అదానీ ఔట్‌

స్టాక్‌ మార్కెట్‌ పతనం అదానీ గ్రూప్‌ ప్రధాన ప్రమోటర్‌ గౌతమ్‌ అదానీ కుబేర స్థానానికీ ఎసరుపెట్టింది. హిండెన్‌బర్గ్‌ నివేదిక దెబ్బకు అదానీ సంపద రోజురోజుకు తరిగిపోతూ వస్తోంది. నిన్నమొన్నటి వరకు బ్లూంబర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ జాబితాలో ఏడో స్థానంలో ఉన్న గౌతమ్‌ అదానీ తాజాగా 11వ స్థానానికి పడిపోయారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ 12వ స్థానంలో ఉన్నారు. గత నెల రోజుల్లోనే అదానీ పెట్టుబడుల విలువ 3,600 కోట్ల డాలర్లు తగ్గి 8,440 కోట్ల డాలర్లకు చేరింది. అయినా ఇప్పటికీ ప్రపంచంలో అత్యంత సంపన్న భారతీయుల్లో గౌతమ్‌ అదానీనే మొదటి స్థానంలో ఉన్నారు.

స్వల్ప లాభంతో ముగిసిన సెన్సెక్స్‌

కేంద్ర బడ్జెట్‌, అమెరికన్‌ ఫెడ్‌ రిజర్వ్‌ సమావేశం ముందు ఇన్వెస్టర్లు అప్రమత్త వైఖరి ప్రదర్శించిన కారణంగా మంగళవారం స్టాక్‌ మార్కెట్‌ స్వల్ప లాభంతో ముగిసింది. చివరి క్షణం అమ్మకాలతో సెన్సెక్స్‌ 49.49 పాయింట్లు లాభపడి 59,549.90 వద్ద, నిఫ్టీ 13.20 పాయింట్ల లాభంతో 17,662.15 వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ గరిష్ఠంగా 59,787.63 పాయింట్లు, కనిష్ఠంగా 59,104.59 పాయింట్ల మధ్యన కదలాడింది.

Updated Date - 2023-02-01T04:02:28+05:30 IST