ఆర్థిక శాఖలో హల్వా వేడుక తీపి కార్యక్రమంతో మొదలైన బడ్జెట్‌ పత్రాల కూర్పు

ABN , First Publish Date - 2023-01-27T04:10:56+05:30 IST

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో గురువారం హల్వా వేడుక జరిగింది. బడ్జెట్‌ పత్రాల రూపకల్పన, కూర్పు ప్రారంభించే ముందు నార్త్‌ బ్లాక్‌లోని బేస్‌మెంట్‌లో ఈ వేడుక నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది..

ఆర్థిక శాఖలో హల్వా వేడుక తీపి కార్యక్రమంతో మొదలైన బడ్జెట్‌ పత్రాల కూర్పు

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో గురువారం హల్వా వేడుక జరిగింది. బడ్జెట్‌ పత్రాల రూపకల్పన, కూర్పు ప్రారంభించే ముందు నార్త్‌ బ్లాక్‌లోని బేస్‌మెంట్‌లో ఈ వేడుక నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కరోనా వ్యాప్తి కారణంగా గత ఏడాది కేవలం కీలక సిబ్బందికి మిఠాయిల పంపిణీతో సరిపెట్టగా.. ఈ ఏడాది మళ్లీ ఆర్థిక శాఖ అధికారులు, ఇతర సిబ్బందికి హల్వా వండి, వడ్డించే సంప్రదాయాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోపాటు సహాయ మంత్రులు పంకజ్‌ చౌదరి, భగవత్‌ కే కరాద్‌, ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్‌, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్‌ సేథ్‌, దీపమ్‌ కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే, రెవెన్యూ సెక్రటరీ సంజయ్‌ మల్హోత్రా పాల్గొన్నారు. ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత వీ నాగేశ్వరన్‌, సీబీడీటీ చైర్మన్‌ నితిన్‌ గుప్తా, సీబీఐసీ చైర్మన్‌ వివేక్‌ జోహ్రీ, అదనపు కార్యదర్శి(బడ్జెట్‌) ఆశిశ్‌ వచనితోపాటు బడ్జెట్‌ రూపకల్పన, కూర్పు ప్రక్రియలో భాగమైన ఇతర అధికారులు, సిబ్బంది కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

సీతారామన్‌కు ఇది వరుసగా ఐదో బడ్జెట్‌. గత రెండేళ్ల మాదిరిగానే ఈసారి కూడా మంత్రి పేపర్‌లెస్‌ బడ్జెట్‌నే ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్‌ సభ్యులతోపాటు సాధారణ ప్రజానీకం ‘యూనియన్‌ బడ్జెట్‌ మొబైల్‌ యాప్‌’ ద్వారా బడ్జెట్‌ ప్రతులను యాక్సెస్‌ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో బడ్జెట్‌కు చెందిన మొత్తం 14 డాక్యుమెంట్లు ఆంగ్లం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటాయి. ఈ యాప్‌లో డౌన్‌లోడింగ్‌, ప్రింటింగ్‌, సెర్చ్‌, జూమ్‌ ఇన్‌, జూమ్‌ అవుట్‌, బైడైరెక్షనల్‌ స్ర్కోలింగ్‌, విషయ సూచిక, తదితర ఫీచర్లుంటాయి. యూనియన్‌ బడ్జెట్‌ వెబ్‌ పోర్టల్‌ (ఠీఠీఠీ. జీుఽఛీజ్చీఛఠఛీజ్ఛ్ట. జౌఠి.జీుఽ) ద్వారానూ ఈ యాప్‌ను డౌన్‌లోన్‌ చేసుకోవచ్చు. వచ్చేనెల 1న పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రసంగం ముగిశాక యాప్‌లో బడ్జెట్‌ డాక్యుమెంట్లు అందుబాటులోకి వస్తాయి.

Updated Date - 2023-01-27T04:14:08+05:30 IST