పొంచి ఉన్న మరో మార్కెట్‌ సంక్షోభం!

ABN , First Publish Date - 2023-01-27T04:18:19+05:30 IST

దేశీయ స్టాక్‌మార్కెట్‌లో మరో కుంభకోణం పొంచి ఉందా? అయితే దానికి ఎక్కడ బీజాలు పడనున్నాయి?? ముంబైలోనా, లేక లండన్‌, సింగపూర్‌ వంటి విదేశీ నగరాల్లోనా...

పొంచి ఉన్న  మరో మార్కెట్‌ సంక్షోభం!

షార్ట్‌సెల్లింగ్‌ పేరుతో మాయాజాలం

దేశీయ స్టాక్‌మార్కెట్‌లో మరో కుంభకోణం పొంచి ఉందా? అయితే దానికి ఎక్కడ బీజాలు పడనున్నాయి?? ముంబైలోనా, లేక లండన్‌, సింగపూర్‌ వంటి విదేశీ నగరాల్లోనా... దీనిపై మార్కెట్‌ వర్గాలు ఏమంటున్నాయి...

  • హిండెన్‌బర్గ్‌ నివేదికతో ప్రకంపనలు

  • సన్నగిల్లుతున్న మదుపరుల నమ్మకం

  • ఆ సంస్థ చెప్పేవన్నీ కట్టుకథలే

  • పరువునష్టం దావాకు అదానీ సన్నాహాలు

గత 30 సంవత్సరాల్లో దేశీయ స్టాక్‌మార్కెట్‌లో అనేక కుంభకోణాలు వెలుగు చూశాయి. హర్షద్‌ మెహతా, కేతన్‌ పరేఖ్‌ వంటి కేటుగాళ్లు బ్యాంకింగ్‌ రంగంలోని లోపాలను అడ్డుపెట్టుకుని మార్కెట్‌ను ఆడుకున్నారు. ఇన్వెస్టర్లను నిలువునా ముంచారు. స్టాక్‌మార్కెట్‌లో నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చని ఆనుకున్న అనేక మంది రిటైల్‌ ఇన్వెస్టర్లు నష్టాలు తట్టుకోలేక ప్రాణాలే తీసుకున్నారు.

ఈ సారి విదేశాల నుంచే స్కామ్‌

భారత ఆర్థిక వ్యవస్థ, స్టాక్‌మార్కెట్‌ ఇప్పుడు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, స్టాక్‌మార్కెట్లతో మరింతగా అనుసంధానమయ్యాయి. ఈ మార్పులతో విదేశీ పోర్ట్‌ఫోలియో సంస్థ లు (ఎఫ్‌పీఐ) కూడా పెద్ద ఎత్తున భారత మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతున్నాయి. దీంతో దేశీయ స్టాక్‌మార్కెట్‌లో చోటు చేసుకునే తదుపరి కుంభకోణానికి ముంబైలోని దలాల్‌ స్ట్రీట్‌ కాకుండా, లండన్‌ లేదా సింగపూర్‌ వంటి నగరాలు వేదికలుగా మారే ప్రమాదం ఉందని ఎకనామిక్‌ టైమ్స్‌లో వచ్చిన ఒక కథనం సూచిస్తోంది. అదానీ గ్రూప్‌ కంపెనీల మార్కెట్‌ దందాపై అమెరికా ఇన్వెస్ట్‌మెంట్‌ రీసెర్చ్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ తాజా నివేదిక ఈ విషయాన్నే సూచిస్తోంది. సెబీ వెంటనే రంగంలోకి దిగి, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోతే దేశీయ స్టాక్‌ మార్కెట్‌ విశ్వసనీయత మరింత దెబ్బతినే ప్రమాదం ఉందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.

పీ-నోట్ల ముసుగులో...

ఎఫ్‌పీఐల ద్వారా వచ్చే పార్టిసిపేటరీ నోట్ల (పీ-నోట్స్‌) పెట్టుబడులు సైతం కొంత మంది ప్రమోటర్లకు వరంగా మారా యి. ఈ పెట్టుబడుల ముసుగులో కొన్ని కంపెనీల ప్రమోటర్లు తమ బ్లాక్‌మనీని వైట్‌గా మార్చుకుంటున్నారు. ఇందుకు విదేశాల్లో ఏర్పాటు చేసిన వారి డొల్ల కంపెనీలు వేదికలుగా మారాయి. ఈ లోపాయికారీ పీ-నోట్ల పెట్టుబడులతో తమ కంపెనీల షేర్ల ధరలు అడ్డగోలుగా పెంచి, సాధారణ మదుపరుల్ని ప్రమోటర్లు నిండా ముంచుతున్నారు. ఈ దందాల్లో ప్రమోటర్లు కొన్ని బ్రోకరేజి సంస్థలనూ పావులుగా వాడుకుంటున్నారు.

చేతులెత్తేసిన సెబీ

కంపెనీల షేర్ల ధరలు పెరగడం లేదా తగ్గడం వాటి ఆర్థిక స్థితిగతులపై ఆధారపడి ఉంటుంది. కొన్ని కంపెనీల షేర్లకు ఇది వర్తించదు. పీకల్లోతు అప్పుల్లో ఉన్నా, అదానీ గ్రూపు కంపెనీల షేర్లలా, ఆ కంపెనీల షేర్ల ధర అడ్డగోలుగా పెరుగుతుంటుంది. దీని వెనక బ్రోకర్లు లేదా ప్రమోటర్ల ప్రత్యక్ష, పరోక్ష హస్తం ఉంటుందని వేరే చెప్పాల్సిన పని లేదు. సర్క్యులర్‌ (వలయాకార) ట్రేడింగ్‌గా పిలిచే ఈ ట్రేడింగ్‌ దందాకు అడ్డుకట్ట వేసేందుకు సెబీ గతంలో అనేక ప్రయత్నాలు చేసింది. అయినా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. సెబీ దీనిపై దర్యాప్తు చేపట్టినప్పుడల్లా ఎఫ్‌పీఐలు పోలోమంటూ అమ్మకాలకు దిగి, మార్కెట్‌ను కుప్పకూలుస్తున్నాయి. దీనికి భయపడి సెబీ ఈ విషయం పట్టించుకోవడమే మానేసింది.

‘షార్ట్‌ సెల్లింగ్‌’తో దందా !

షార్ట్‌ సెల్లింగ్‌ కూడా అక్రమార్కులైన ప్రమోటర్ల దందాకు వేదికగా మారింది. కంపెనీల షేర్లను బ్రోకరేజీ సంస్థల నుంచి అప్పుగా తీసుకుని అధిక ధరల వద్ద అమ్మడం, ఆ తర్వాత అవే షేర్లను మార్కెట్‌ నుంచి తక్కువ ధరకు కొని బ్రోకరేజి సంస్థలకు సర్దుబాటు చేయడాన్నే షార్ట్‌ సెల్లింగ్‌ అంటారు. ఇంతకు ముందు ఈ దందా అంతా స్టాక్‌ బ్రోకర్లు నడిపేవారు. ఇపుడు కొన్ని కంపెనీల ప్రమోటర్లు కూడా విదేశాల్లోని తమ డొల్ల కంపెనీల ద్వారా ఈ దందా నడిపిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ నేరుగా చెప్పక పోయినా, అదానీ గ్రూప్‌ ప్రమోటర్లు కూడా ఈ దందా చేస్తున్నట్టు సమాచారం. దీంతో ప్రమోటర్లు, బ్రోకర్లు లాభపడినా, రిటైల్‌ ఇన్వెస్టర్లు మాత్రం ఈ మాయాజాలంతో తీవ్రంగా నష్టపోతున్నారు.

పరువు నష్టం దావా వేస్తాం..

తమ పరువు తీసిన హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ అంతు చూడాలని అదానీ గ్రూప్‌ భావిస్తోంది. చట్టపరంగానే ఆ సంస్థ పని పడతామని ప్రకటించింది. ఇందుకోసం అమెరికా, భారత చట్టాల ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్టు తెలిపింది. అదానీ గ్రూప్‌ ప్రధాన అధికారి జతిన్‌ జలుంద్‌వాలా పేరుతో గురువారం ఈ మేరకు ఒక సంక్షిప్త ప్రకటన విడుదల చేసింది. రూ.20,000 కోట్ల అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఎఫ్‌పీఓను దెబ్బతీసేందుకే హిండెన్‌బర్గ్‌ సంస్థ ఈ చర్యకు పాల్పడినట్టు మరోసారి ఆరోపించింది. ఈ నివేదిక అదానీ గ్రూపునేగాక వాటాదారులు, పెట్టుబడిదారులనూ తీవ్రంగా దెబ్బతీసేలా ఉందని పేర్కొంది. ఈ నివేదికతో బుధవారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ తీవ్ర ఆటుపోట్లకు లోవనడాన్నీ అదానీ గ్రూప్‌ గుర్తు చేసింది. ఇది దేశ పౌరులనూ తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందని తెలిపింది.

హిండెన్‌బర్గ్‌ వెనక ఎవరు ?

నాథన్‌ అండర్సన్‌ అనే వ్యక్తి ఈ సంస్థను ఏర్పాటు చేశారు. 1937లో న్యూయార్క్‌లో మంటల్లో చిక్కుకుని కుప్పకూలిన ‘హిండెన్‌బర్గ్‌’ ఎయిర్‌షిప్‌ పేరుతో ఈ సంస్థ ఏర్పడింది. అమెరికా కేంద్రంగా పని చేసే ఈ ఇన్వెస్ట్‌మెం ట్‌ రీసెర్చ్‌ సంస్థకు స్టాక్‌మార్కెట్‌ షార్ట్‌ సెల్లింగ్‌, ఫోరెన్సిక్‌ ఫైనాన్సియల్‌ రీసెర్చ్‌లో మంచి ప్రావీణ్యం ఉంది. 2020లో తమ ఎలక్ట్రిక్‌ ట్రక్కుల స్పీడ్‌పై నికోలా కార్ప్‌ అనే కంపెనీ చేసిన తప్పుడు ప్రచారాన్ని హిండెన్‌బర్గ్‌ సాక్ష్యాలతో సహా ఎండగట్టింది. దాంతో ఈ కంపెనీ షేర్ల మార్కెట్‌ క్యాప్‌ 3,400 కోట్ల డాలర్ల నుంచి 134 కోట్ల డాలర్లకు పడిపోయింది. దీనికి తోడు తప్పుడు ప్రచారానికి పాల్పడినం దుకు అమెరికా సెక్యూరిటీస్‌ కమిషన్‌కు 12.5 కోట్ల డాలర్ల జరిమానా చెల్లించాల్సి వచ్చింది.

మా నివేదికకు కట్టుబడి ఉన్నాం

మరోవైపు అదానీ గ్రూపు కంపెనీలపై తమ ఆరోపణలను హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ సమర్థించుకుంది. తమ నివేదికలోని ఆరోపణలకు నూటికి నూరు శాతం కట్టుబడి ఉన్నట్టు ప్రకటించింది. ట్విట్టర్‌ వేదికగా గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. కేసులు పెడతామని అదానీ గ్రూపు చేస్తున్న బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. తమ నివేదికలో పేర్కొన్న ప్రతి ఆరోపణకు కట్టుబడి ఉన్నట్టు తెలిపింది. తాము లేవనెత్తిన 88 ప్రశ్నల్లో అదానీ గ్రూప్‌ ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రశ్నకూ నేరుగా సమాధానం చెప్పకపోవడాన్ని ప్రశ్నిం చింది. దమ్ముంటే అదానీ గ్రూపు తమ కేంద్ర స్థానమైన అమెరికా కోర్టుల్లో కేసు ఫైల్‌ చేస్తే అక్కడే తేల్చుకుంటామని సవాల్‌ చేసింది. అదానీ గ్రూపు బండారం బయట పెట్టేందుకు అవసరమైన అన్ని పత్రాలు తమ వద్ద సిద్ధంగా ఉన్నట్టు ట్వీట్‌ చేసింది.

Updated Date - 2023-01-27T04:18:21+05:30 IST