అదానీ నష్టం రూ.9.5 లక్షల కోట్లు

ABN , First Publish Date - 2023-02-07T02:54:30+05:30 IST

అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్ల పతనం కొనసాగుతూనే ఉంది. గ్రూప్‌లోని 10 లిస్టెడ్‌ కంపెనీల్లో ఏడింటి షేర్లు సోమవారమూ నష్టాలు చవిచూశాయి...

అదానీ నష్టం రూ.9.5 లక్షల కోట్లు

9 రోజుల్లో ఆవిరైన గ్రూప్‌ మొత్తం సంపద ఇది.. మెజారిటీ కంపెనీల షేర్లు ఇప్పటికీ నష్టాల్లోనే

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్ల పతనం కొనసాగుతూనే ఉంది. గ్రూప్‌లోని 10 లిస్టెడ్‌ కంపెనీల్లో ఏడింటి షేర్లు సోమవారమూ నష్టాలు చవిచూశాయి. అందులో అదానీ ట్రాన్స్‌మిషన్‌ అత్యధికంగా 10 శాతం పతనమవగా... అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ పవర్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ విల్మర్‌ షేర్లు 5 శాతం చొప్పున క్షీణించాయి. గ్రూప్‌లోని ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ కూడా 0.74 శాతం నష్టంతో రూ.1,572.40 వద్ద ముగిసింది. అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ మాత్రం 9.46 శాతం మేర పుంజుకోగా.. అంబుజా సిమెంట్స్‌ 1.54 శాతం, ఏసీసీ 2.24 శాతం, ఎన్‌డీటీవీ 1.37 శాతం పెరిగాయి. అయినప్పటికీ, గ్రూప్‌ మొత్తం మార్కెట్‌ విలువ మరింత తగ్గింది. గడిచిన తొమ్మిది ట్రేడింగ్‌ సెషన్లలో (జనవరి 24 నుంచి ఫిబ్రవరి 6 వరకు) గ్రూప్‌ సంపదలో దాదాపు రూ.9.5 లక్షల కోట్లు ఆవిరైంది.

మరో 40% క్షీణించనున్న ఏఈఎల్‌?

హిండెన్‌బర్గ్‌ నివేదిక దెబ్బకు అదానీ గ్రూప్‌లోని మెజారిటీ కంపెనీల షేర్ల ధరలు ఇప్పటికే సగానికి పైగా క్షీణించాయి. అయినప్పటికీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ (ఏఈఎల్‌) షేరు ఇప్పటికీ చాలా అధిక ధర వద్ద ట్రేడవుతున్నదని న్యూయార్క్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఆశ్వత్‌ దామోదరన్‌ అభిప్రాయపడ్డారు. ఈ కంపెనీ షేరు మరో 40ు వరకు పతనమయ్యే అవకాశాలున్నాయని అంచనా వేశారు.

రూ.9,135 కోట్ల రుణాల ప్రీపేమెంట్‌

గ్రూప్‌ కంపెనీల షేర్లు తాకట్టుపెట్టి తీసుకున్న 111.4 కోట్ల డాలర్ల (సుమారు రూ.9,135 కోట్లు) రుణాలను ప్రమోటర్లు గడువు తీరకముందే చెల్లించనున్నట్లు అదానీ గ్రూప్‌ ప్రకటించింది. గ్రూప్‌ భవితవ్యంపై ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆందోళనలను తగ్గించేందుకు షేర్ల తనఖా ద్వారా తీసుకున్న రుణ భారాన్ని పూర్తిగా తగ్గించుకోవాలని ప్రమోటర్లు భావిస్తున్నారు. ఈ రుణాల మెచ్యూరిటీ గడువు 2024 సెప్టెంబరుతో ముగియనుంది.

సెన్సెక్స్‌ 334 పాయింట్లు డౌన్‌

భారత స్టాక్‌ మార్కెట్లో ఐదు రోజుల ర్యాలీకి అడ్డుకట్ట పడింది. ఐటీ, విద్యుత్‌, లోహ రంగ షేర్లలో అమ్మకాల కారణంగా ప్రామాణిక ఈక్విటీ సూచీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 334.98 పాయింట్లు కోల్పోయి 60,506.90 వద్దకు జారుకుంది. ఇంట్రాడేలో సూచీ 500 పాయింట్లకు పైగా పతనమైనప్పటికీ, మళ్లీ కాస్త కోలుకోగలిగింది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 89.45 పాయింట్ల నష్టంతో 17,764.60 వద్ద క్లోజైంది.

Updated Date - 2023-02-07T02:54:33+05:30 IST