చిత్తడి నేలలను కాపాడుకుందాం

ABN , First Publish Date - 2023-02-01T23:29:33+05:30 IST

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కొల్లేరు సరస్సు చిత్తడి నేలలకు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇటువంటి నేలను, ప్రకృతిని కాపాడితే అది భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేస్తుందని కొంతమంది గుర్తించలేకపోతు న్నారు.

చిత్తడి నేలలను కాపాడుకుందాం

కొల్లేరు మనుగడతోనే పర్యావరణ పరిరక్షణ

అనేక రకాల జల, వృక్ష సంపదకు కొల్లేరు ఆలవాలం

చిత్తడినేలలపై ప్రచారం అంతంతమాత్రమే

కైకలూరు : ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కొల్లేరు సరస్సు చిత్తడి నేలలకు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇటువంటి నేలను, ప్రకృతిని కాపాడితే అది భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేస్తుందని కొంతమంది గుర్తించలేకపోతు న్నారు. సృష్టిలో సహజసిద్ధంగా మానవాళి మనుగడ కోసం ఏర్పడిన సంపదను విస్మరిస్తున్నారు. ప్రపంచ దేశాలుసైతం పర్యావరణాన్ని పరిరక్షించండి, ప్రకృతిని కాపాడడండి అంటూ పదేపదే హెచ్చరిస్తున్నా వాటి వినాశనానికి చేసే వికృతి చేష్టలు తగ్గలేదు. సహజసిద్ధంగా ఏర్పడిన సంపదను రక్షించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ప్రతి ఏడాది ఫిబ్రవరి రెండో తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని (వరల్డ్‌ వెట్‌ల్యాండ్స్‌డే) జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం..

ఉమ్మడి ఆంఽధ్రప్రదేశ్‌లో గుర్తింపు పొందిన ఏకైక చిత్తడి నేలలు ఏలూరు జిల్లాలో విస్తరించిన 77,136 ఎకరాలు కొల్లేరు సరస్సు మాత్రమే. ఈ చిత్తడి నేలలు అనేక జీవరాశులకు, పక్షులకు ఎంతో మేలు చేస్తుంటాయి. అందువల్లే ప్రపంచంలోని అనేక దేశాలకు చెందిన పక్షులు వలసవస్తున్నాయి. చిత్తడినేలలపై 1971 సంవత్సరంలో ఫిబ్రవరి 2న ఇరాన్‌ దేశంలో రామ్‌సర్‌ నగరంలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. అప్పుడు సదస్సులో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రపంచంలోని 164 దేశాలు చిత్తడినేలల పరిరక్షణకు ఒప్పంద సంతకాలు చేశాయి. వీటిలో భారతదేశం కూడా ఒకటిగా ఉంది. 2002 సంవత్సరంలో కొల్లేరును రామ్‌సర్‌ సైట్‌లోనికి తీసుకున్నారు. భారతదేశంలో 21 రాష్ర్టాల్లో 46 ప్రాంతాలను చిత్తడినేలలుగా గుర్తించారు. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని కైకలూరు మండలం ఆటపాక పక్షుల కేంద్రంలో పలు రకాల పోటీలు నిర్వహించి ఈనేలల విశిష్టతను విద్యార్థులకు తెలియజేస్తూ ఉంటారు.

చిత్తడి నేలల ప్రాధాన్యం

సముద్రం, నది ఇతర నీటి వనరుల తీర ప్రాంతాల్లో లోతు తక్కువ ఉండి ఎక్కువ కాలం నీటి నిల్వ ఉండే భూములను చిత్తడి నేలలు అంటారు. మంచినీటి సరస్సులు, ఉప్పునీటి సరస్సులు, మడ అడవుల తీరప్రాంతాలన్నీ చిత్తడినేలలే. అరుదైన మొక్కలు, పక్షులు, జంతువులు, చేపలు గుడ్లు పెట్టడానికి ఈ నేలలు చాలా అనుకూలం. నీటి నాణ్యతను పెంచడంలో, కాలుష్య కారకాలను గ్రహించడంలో ఈ చిత్తడినేలలు ప్రాధాన్యత పోషిస్తాయి. మానవ తప్పిదాలతో పర్యావరణానికి చాలాహాని జరుగుతుంది. ప్రజలు వ్యవసాయ, ఆక్వా అవసరాలకు ఈ భూములను ఆక్రమించుకుని రసాయన ఎరువులు వాడడం వల్ల నివాసయోగ్యానికి ఈ నేలలను పూడ్చడంతో చిత్తడి నేలలు విధ్వంసానికి గురవుతున్నాయి. ప్రపంచం పరిశ్రమల కోసం ఈ చిత్తడి నేలలు కేటాయించడంతో మరింత వినాశనానికి దారితీస్తున్నాయి.

కొల్లేరును కాపాడే ప్రయత్నాలు నిల్‌..

పేరుకు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కొల్లేరు సరస్సుగా గుర్తించినప్పటికీ ఎక్కడచూసినా ఆక్రమణల పర్వమే. 2006లో కొల్లేరు ప్రక్షాళన కోసం ఆపరేషన్‌ నిర్వహించినప్పటికీ దానిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురాలేకపోయారు. మళ్లీ చెరువులు తవ్వకాలు చేపట్టినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడంతోపాటు ఈ అక్రమ చేపల చెరువు గట్ల వల్ల ఎగువ నుంచి కొల్లేరులోకి నీరు రావడం లేదు. దీంతో ప్రతి ఏడాది చిత్తడినేలలు కాస్తా ఎడారిగా మారి సహజజాతి మత్య్స సంపద అంతరించిపోతుంది. అధికార రాజకీయ నాయకుల ఒత్తిడితో అటవీశాఖ అక్రమార్కులపై చర్యలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా చిత్తడినేలలను పరిరక్షించుకుంటే మానవాళికి ఎంతో దోహదపడుతుందని, వీటి పరిరక్షణ చర్యలు చేపట్టాలని పలువురు పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.

అవగాహన అంతంత మాత్రమే

కొల్లేరు చిత్తడి నేలలకు అనువైన ప్రదేశం అయినప్పటికీ వీటి పట్ల ప్రజల్లో అవగాహన, ప్రభుత్వ కార్యక్రమాలు అంతంతమాత్రంగానే సాగుతూ ఉంటాయి. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కొల్లేరు విశిష్టతను తెలిపేందుకు పక్షుల పండుగ, సంప్రదాయకమైన తాటిదోనెల పోటీలను నిర్వహించేవారు. వీటితోపాటు ఫిబ్రవరి 2న పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులకు చిత్తడినేలల ప్రాముఖ్యతపై వ్యాసరచన, డిబేట్‌, డ్రాయింగ్‌ పోటీలను నిర్వహించేవారు. ప్రస్తుతం అయితే విద్యార్థులకు పోటీలు మాత్రమే నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. ఈనేలల ప్రాముఖ్యతను కొల్లేరు పరివాహక ప్రాంత ప్రజలకు తెలియజేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.

చిత్తడి నేలలను పరిరక్షించాలి..

చిత్తడి నేలలు పర్యావరణానికి, ప్రజలకు, అనేక జీవరాశులకు ఎంతో దోహదపడుతాయి. వీటిని కాపాడుకునేందుకు కృషి చేయాలి. చిత్తడి నేలల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. వీటిని సంరక్షించుకునే చర్యలను ప్రభుత్వం, ప్రజలు తీసుకోవాలి.

– చింతపల్లి వెంకటనారాయణ, సాహితీవేత్త, కొల్లేరు వాసి

Updated Date - 2023-02-01T23:29:40+05:30 IST