చెత్తపన్ను.. తప్పించుకోలేరు..!

ABN , First Publish Date - 2023-02-07T00:17:57+05:30 IST

పట్టణాల్లో అమలు చేస్తున్న చెత్తపన్ను నుంచి ఇక ఎవరూ తప్పించుకోలేరు. ఆస్తి పన్నుతో పాటు చెత్త పన్ను చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

 చెత్తపన్ను..  తప్పించుకోలేరు..!

కొనసాగుతున్న ఆన్‌లైన్‌ ప్రక్రియ

భీమవరం టౌన్‌, ఫిబ్రవరి 6 :

పట్టణాల్లో అమలు చేస్తున్న చెత్తపన్ను నుంచి ఇక ఎవరూ తప్పించుకోలేరు. ఆస్తి పన్నుతో పాటు చెత్త పన్ను చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మునిసిపాలిటీలకు దిశానిర్దేశం చేసింది. ఆ మేరకు పట్టణాల్లో కసరత్తు ప్రారంభిం చా రు. ఆస్తి పన్ను చెల్లించే అసెస్‌మెంట్‌లతోనే చెత్తపన్ను వసూల య్యే లా ఆన్‌లైన్‌ ప్రక్రియ చేపడుతున్నారు. ఫలితంగా ఆస్తి యజమానులే చెత్తపన్ను చెల్లించాల్సి ఉంటుంది. అద్దెదారులు ఉంటే వారినుంచి యజమానులే చెత్త పన్ను వసూలు చేసుకోవాల్సి ఉంటుంది.

వాస్తవానికి ప్రభుత్వం అన్ని పట్టణాల్లోను గత కొన్ని నెలలు నుంచి ప్రత్యేకంగా చెత్తపన్ను వసూలు చేస్తోంది. సచివాలయాల వారీగా సిబ్బంది తిరిగి పన్ను కట్టించుకుంటున్నారు. మూడు నెలల నుంచి చెత్త పన్ను సక్రమంగా వసూలు కావడం లేదు. చెత్తకోసం ఉపయోగించే వాహనాలు నిర్వహణ కష్టతరం అవుతోంది. వాహన డ్రైవర్లకు వేతనాలు చెల్లించడం లేదు. జిల్లాలోని మునిసిపాలిటీల్లో 50 శాతం కంటే తక్కువగానే చెత్తపన్ను వసూలవు తోంది. పట్టణ జనాభా నివాసాల ఆధారంగా ఒక్కొక్క మునిసిపాలిటీకి వాహ నాలు సమకూర్చింది. ప్రతీ రోజు చెత్త సేకరణ నిర్వహిస్తున్నారు. నెల గడిచేసరికి వాహనానికి రూ.50 వేలు వ్యయం అవుతోంది. అంత మొత్తంలో పన్నులు వసూలు కావడం లేదంటూ ప్రభుత్వం గగ్గోలు పెడుతోంది. సమీక్షలు నిర్వహించి చెత్తపన్ను వసూలు చేసేలా ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. కమిషనర్లపై ఒత్తిడి పెంచారు. అంతలోనే ప్రభుత్వం తన నిర్ణయం మార్చు కుంది. ఆస్తి పన్నుతోనే చెత్త పన్ను కట్టేలా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే మునిసిపాలిటీల వారీగా సిబ్బందికి శిక్షణ ఇస్తోంది. ఆన్‌లైన్‌ ప్రక్రియ చేపడుతున్నారు.

జిల్లాలో చెత్తపన్ను ఇలా..

జిల్లాలో భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం మునిసిపాలిటీ ల్లో చెత్త పన్ను వసూలు చేస్తున్నారు. తాడేపల్లిగూడెంలో ప్రతీ ఇంటికి నెలకు రూ.90 చొప్పున పన్ను విధిస్తున్నారు. మిగిలిన మునిసిపాలిటీల్లో నెలకు రూ.60లుగా నిర్ణయిం చినా వసూలులో విఫలమయ్యాయి. దాంతో ప్రభుత్వం కొత్త ఆలోచనకు తెర తీసింది. ఆస్తి పన్నుతో సహా పన్నులు చెల్లిం చేలా చర్యలు తీసుకుంటోంది. లోపయికారీగా ఆదే శాలు జారీ చేసింది.

మ్యాపింగ్‌ ప్రక్రియ..

ప్రతీ వార్డు సచివాలయంలో క్లస్టర్‌ వారీగా ఇప్పటికే అసెస్‌మెంట్‌లు ఉన్నాయి. దాని ఆధారంగా ముందుగా క్లస్టర్‌ను కంప్యూటర్‌లో ఓపెన్‌ చేస్తే కమర్షియల్‌, రెసిడెన్సియల్‌ అనే ఆప్షన్‌ వస్తుంది. అందులో అవసరమైన దానిని ఓపెన్‌ చేస్తే అందులో అసెస్‌మెంట్‌ నెంబరు వస్తుంది. దానిని ఎడిట్‌ ఆప్షన్‌లోకి వెళ్లి ఈ నెంబరును నమోదు చేస్తే చెత్తపన్నుకు సంబంధించిన వివరాలు నమోదవు తాయి. ఈ విధానంతో అనుసంధానం చేస్తున్నారు. ఈనెల 9వ తేదీలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించడంతో వార్డు సచివాలయాల్లో ఈ ప్రక్రియను చేపడుతున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను డిమాండ్‌తో పాటే ఈ చెత్తపన్ను డిమాండ్‌ వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం.

Updated Date - 2023-02-07T00:17:58+05:30 IST