కూలిన బతుకులు

ABN , First Publish Date - 2023-02-07T00:20:36+05:30 IST

వారంతా పొట్టకూటి కోసం వ్యవసాయ పను లు చేసుకునే మహిళలు. పని ముగించుకుని ట్రాక్టర్‌పై తిరిగి వస్తున్న క్రమంలో అది బోల్తా పడింది.

కూలిన బతుకులు
ఘటనా స్థలిని పరిశీలిస్తున్న సీఐ నాగరాజు

ఇద్దరు మహిళా కూలీల మృతి.. పది మందికి గాయాలు

మాధవరంలో విషాద ఘటన

తాడేపల్లిగూడెం రూరల్‌, ఫిబ్రవరి 6 : వారంతా పొట్టకూటి కోసం వ్యవసాయ పను లు చేసుకునే మహిళలు. పని ముగించుకుని ట్రాక్టర్‌పై తిరిగి వస్తున్న క్రమంలో అది బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు దుర్మరణం పాలవగా పది మందికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలివి. అప్పారావు పేటకు చెందిన పాకనాటి భారతి(47), ఆకుమర్తి సుజాత(36), మరో తొమ్మిది మందిని మాధవరానికి చెందిన రైతు కుంచే రాము తన వరి పొలంలో కలుపు తీసేందుకు సోమవారం ఉదయం ట్రాక్టర్‌పై తీసుకెళ్లాడు. పని ముగించుకుని మధ్యాహ్నం తిరిగి తీసుకొ స్తుండగా మాధవరం కోతిగుంట చెరువు గట్టు పైనుంచి కిందకు ట్రాక్టర్‌ బోల్తా కొట్టింది. దీని కింద పడిన భారతి, సుజాత మృతి చెందారు. రైతు రాముతోపాటు కూలీలు కోట సింహా చలం, తానేటి వరలక్ష్మి, ఎస్‌కే మస్తాన్‌లకు తీవ్రంగా మిగిలిన దిద్దే పద్మ, జొన్నాడ శివ పార్వతి, కొయ్యల నాగజ్యోతి, మడిపల్లి సుబ్రహ్మణ్యం, తిరు మళ్ల రామలక్ష్మి, తిరుమళ్ల లక్ష్మి లకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని తాడేపల్లిగూడెం లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పట్టణ ఎస్‌ఐ నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాక్టర్‌ పడిన ప్రాంతంలో నీళ్లు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ.5 లక్షల ఎక్స్‌ గ్రేషియా అందిస్తామని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ప్రకటించారు. ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు.

రెక్కల కష్టం మీదే..

భారతి భర్త పెళ్లయిన కొన్నేళ్లకే మృతి చెందా డు. కాయకష్టం చేసి కుమారుడిని పెంచి పెద్ద చేసింది. వివాహనంతరం కుమారుడు హైదరా బాద్‌కు వెళ్లి తన బతుకు తాను బతుకుతున్నాడు. గ్రామంలో ఒంటరిగా ఉంటూ కూలి పనులు చేసుకుంటూ భారతి జీవనం సాగిస్తోంది.

రెండు రోజుల్లో దుబాయ్‌ ప్రయాణం..

మరో మృతురాలు సుజాతకు భర్త వెంకటేశ్వర్లు, కుమార్తె ఉన్నారు. నెల రోజుల క్రితమే దుబాయ్‌ నుంచి వచ్చింది. ఊళ్లో ఉండే రోజుల్లో కూడా పనికి వెళ్తుంటుంది. మరో రెండు రోజుల్లో దుబాయ్‌ వెళ్లాల్సి ఉంది. ఇంతలో తిరిగి రానీ లోకాలకు సుజాత వెల్లిపోవడంతో వారి కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.

Updated Date - 2023-02-07T00:20:40+05:30 IST