అన్ని రంగాల్లో.. జగన్‌ విఫలం

ABN , First Publish Date - 2023-01-25T00:37:26+05:30 IST

భీమవరంలో రెండు రోజులపాటు నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు మంగళవారం ముగిశాయి. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.

అన్ని రంగాల్లో.. జగన్‌ విఫలం
ఇటీవల మృతి చెందిన ప్రముఖులకు నేతల నివాళి

పొత్తులపై స్పష్టత.. వైసీపీ, టీడీపీలకు దూరం

రాష్ట్రంలో పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం

భీమవరం/భీమవరం టౌన్‌, జనవరి 24 : భీమవరంలో రెండు రోజులపాటు నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు మంగళవారం ముగిశాయి. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ప్రధానంగా జనసేనతో పొత్తు అంటూనే వైసీపీ, టీడీపీలకు దూరంగా ఉంటామంటూ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. అప్పుడే రాష్ట్రంలో తమ పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. తొలిరోజు పార్టీ రాష్ట్ర ప్రతినిధులు నరసాపురం పార్లమెంట్‌ పరిధిలోని వంద శక్తి కేంద్రాలను సందర్శించారు. కార్యకర్తలతో మమేకమై పార్టీ పటిష్టతకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. రెండో రోజు మంగళవారం భీమవరం ఆనందా ఫంక్షన్‌ హాల్‌లో రాష్ట్ర కార్యవర్గ ప్రతినిధులతో సమావేశమయ్యారు. కేంద్ర మంత్రులు మురళీధరన్‌, భారతీ పవార్‌, జాతీయ నాయకులు సునీల్‌ థియోధర్‌, శివప్రకాశ్‌, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు, ఎమ్మెల్సీ విష్ణుకుమార్‌, నారాయణరెడ్డి, సీఎం రమేష్‌ పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి కార్యవర్గ ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు.

కేంద్ర పథకాలకు.. రాష్ట్ర ముద్ర

రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ వైఫల్యాలు, బీజేపీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతపై కార్యవర్గ సమావేశాల్లో ఆరు తీర్మానాలు చేశారు. సీఎం జగన్‌ను ఎదిరించే సత్తా ఒక్క బీజేపీకే ఉందని నేతలు స్పష్టం చేశారు. అన్ని రంగాల్లోను వైసీపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కేంద్రం ఇచ్చే నిధులతోనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ అది తమ గొప్పగా సీఎం జగన్‌ చెప్పుకుంటున్నారని తూర్పారబట్టారు. నాడు–నేడు, విద్యా కానుక, ఆరోగ్యశ్రీ, జాతీయ, రాష్ట్ర రహదారులు, రైల్వే లైన్ల నిర్మాణాలను కేంద్ర ప్రభుత్వం చేపడుతోందని, ఈ అభివృద్ధినంతా వైసీపీ తన ఖాతాలో వేసుకుంటోందని మండిపడ్డారు. రాష్ట్రం చేసిన తొమ్మిది లక్షల కోట్ల అప్పులకు వైసీపీ పాలకులే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రజలు అవినీతిరహిత సమాజాన్ని కోరుకుంటోందని, అయితే ప్రజల ఆకాంక్షలను వైసీపీ అణచివేస్తోందని నేతలు వ్యాఖ్యానించారు. ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్విరామంగా సమావేశం సాగింది. పార్టీ ముఖ్యులంతా రాష్ట్ర ప్రతినిధులకు భవిష్యత్‌ ప్రణాళికపై దిశా నిర్దేశం చేశారు. కేంద్ర పఽథకాలకు ముఖ్యమంత్రులు తమ కుటుంబ సభ్యుల పేర్లు పెట్టుకోవడాన్ని సమావేశం ఆక్షేపించింది. బీజేపీపై ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని మండిపడింది. రాష్ట్రంలో కేంద్రం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రతీ కార్యకర్త పని చేయాలని ఉద్బోధించారు. కాగా ఆంధ్రప్రదేశ్‌కు ద్రోహం చేసిన బీఆర్‌ఎస్‌తో వైసీపీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకుందని బీజేపీ నాయకుడు విష్ణువర్థన్‌ రెడ్డి విమర్శించారు. భీమవరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లోని ఆస్తులను కాపాడుకోవటానికే రాష్ట్రంలో నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు.

పలువురికి నివాళులు

ఇటీవల మరణించిన పార్టీ నాయకులు కేంద్ర మాజీ మంత్రి యూవీ కృష్ణంరాజు, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పి.చలపతిరావు తదితర నాయకులకు, సినీ నటులు కైకాల సత్యనారాయణ, చలపతిరావు తదితరులకు సంతాపం వ్యక్తం చేసింది. సంతాప తీర్మానాన్ని మాజీ ఎమ్మెల్యే వేమా ప్రవేశపెట్టారు.

–––––––––––––––––––––––––––––––

––––––––––––––––––––

Updated Date - 2023-01-25T00:37:28+05:30 IST