పథకం ప్రకారమే మహిళ హత్య..

ABN , First Publish Date - 2023-02-01T23:31:53+05:30 IST

చింతలపూడికి చెందిన పొట్ల నాగమణి (37)ను పథకం ప్రకారం హత్య చేసి ఆ తరువాత మృతిరాలి తమ్ముడితో అదృశ్యమైనట్టు చింతలపూడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయించిన కేసును పోలీసులు ఛేదించారు.

పథకం ప్రకారమే మహిళ హత్య..
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ

ఇద్దరి అరెస్ట్‌ : వివరాలు వెల్లడించిన ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ

చింతలపూడి, ఫిబ్రవరి 1 : చింతలపూడికి చెందిన పొట్ల నాగమణి (37)ను పథకం ప్రకారం హత్య చేసి ఆ తరువాత మృతిరాలి తమ్ముడితో అదృశ్యమైనట్టు చింతలపూడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయించిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు కారకులైన ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్టు జిల్లా ఎస్పీ రాహుల్‌దేశ్‌ శర్మ తెలిపారు. స్థానిక సీఐ కార్యాలయంలో విలేకరులతో ఎస్పీ మాట్లాడుతూ చింతలపూడి ఎస్‌బీఐ నగర్‌కు చెందిన పొట్ల నాగమణికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2015లో ఆమె భర్త చనిపోగా అప్పటినుంచి ఇద్దరు కుమార్తెలు, అత్తమామలతో కలిసి ఉంటున్నారు. ఆమెకు ఖమ్మం జిల్లా గంగారంలో 20 గుంటల స్థలం విషయంలో అదే జిల్లా వైరాకు చెందిన నంబూరి శ్రీనివాసరావు అనే వ్యక్తితో గొడవలు జరుగుతున్నాయి. ఈ స్థలం వివాదంలో 2016లో నాగమణి కోర్టులో సివిల్‌ దావా వేశారు. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం చింతలపూడి మండలం యండపల్లి గ్రామానికి చెందిన బర్రె రాంబాబు అనే వ్యక్తితో నాగమణికి పరిచయమైంది. స్థలం విషయం పెద్దలతో మాట్లాడి పరిష్కరిస్తానని ఆమెను నమ్మించి వివాహేతర సంబంధం కొనసాగించాడు. కొంతకాలం గడిచాక స్థలం వివాదం ఎటూ తేలకపోవడంతో స్థలం తనకే కావాలని నాగమణి పట్టుపట్టడంతో నంబూరి శ్రీనివాసరావు, బర్రె రాంబాబు ఇద్దరూ పథకం ప్రకారం నాగమణిని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. జనవరి 19న బర్రె రాంబాబు కారును కిరాయికి తీసుకుని నాగమణిని ఎక్కించుకుని కాకినాడ సర్పవరం జంక్షన్‌లో ఉన్న శ్రీనివాస లాడ్జికి తీసుకువెళ్ళాడని, అదే రోజు రాత్రి నాగమణిని కారులోని జాకీ రాడ్డుతో తలపై కొట్టి చీరతో మెడకు గట్టిగా బిగించి ఊపిరాడకుండా చేసి చంపాడని, ఆమె మెడలో ఉన్న బంగా రం లాకెట్‌, చేతికి ఉన్న బ్రాస్లెట్‌ తీసుకుని లాడ్జి దగ్గరలో ఉన్న షాపులో ఎరువుల సంచి, పెట్రోలు డబ్బా కొని సంచిలో మృతదేహాన్ని కట్టి కారులో వేసుకుని దారిలో డబ్బాలో పెట్రోలు నింపుకుని జనవరి 21వ తేదీ తెల్లవారు జామున ముందుగానే అనుకున్న విధంగా తెలంగాణ రాష్ట్రం దమ్మపేట మండలం ఆర్లపెంట గ్రామ శివారులో ఉన్న డంపింగ్‌ యార్డు వద్దకు తీసుకువెళ్ళి మృతదేహాన్ని తగలపెట్టాడని చెప్పారు.

అయితే ఏమీ తెలియనట్టు మృతురాలి తమ్ముడితో కలిసి చింతలపూడి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి అదృశ్యమైనట్టు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో ముద్దాయిని అనుమానిస్తున్నట్టు తేలడంతో పారిపోయాడని, ఎట్టకేలకు చింత లపూడి పోలీసులు నిందితుడిని పట్టుకున్నారన్నారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ కె.వి.సత్యనారాయణ నేతృత్వంలో చింతలపూడి సీఐ మల్లేశ్వరరావు, సిబ్బంది కేసును దర్యాప్తు చేసి మృతికి కారణమైన బర్రె రాంబాబు, నంబూరి శ్రీనివాస రావులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్టు తెలిపారు. కేసు దర్యాప్తుకు సహకరించిన ఇరువురు కానిస్టేబుల్స్‌ శివాజి, సత్తిబాబు పోలీసు శాఖకు చెందిన మరొకరు జగదీష్‌కు ఎస్పీ ప్రశంసించి రివార్డులను అందజేశారు.

Updated Date - 2023-02-01T23:32:07+05:30 IST