ధాన్యం కొనుగోళ్ల గడువు పొడిగించాలి

ABN , First Publish Date - 2023-02-07T00:35:46+05:30 IST

రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్న ధాన్యం కొనుగోళ్ల గడువును పొడిగించాలని రైతుల కోరుతున్నారు.

ధాన్యం కొనుగోళ్ల గడువు పొడిగించాలి

ముదినేపల్లి రూరల్‌, ఫిబ్రవరి 6 : రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్న ధాన్యం కొనుగోళ్ల గడువును పొడిగించాలని రైతుల కోరుతున్నారు. ఈ నెల 5వ తేదీతో కొనుగోలు ప్రక్రియ ముగిసిందని పౌరసరఫరాల సంస్థ జిల్లా అధికారుల ఆదేశాలతో ఆర్‌బీకేలకు నాలుగు రోజుల క్రితం సర్క్యులర్‌ వచ్చింది. అయితే ధాన్యం కొనుగోళ్లు నిలిపివేస్తే వరి కుప్పల నూర్పిళ్లు పూర్తి చేయని తమ ధాన్యం ఎవరికి విక్రయించాలని రైతులు ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటి వరకు ముదినేపల్లి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 24 లక్షల 50 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, వరి కుప్పలపై ఇంకా ఐదు వేల మెట్రిక్‌ టన్నులు ధాన్యం మిగిలినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సుమారు వెయ్యి ఎకరాలు కుప్పలు మిగిలినట్లు తేల్చారు. ఈ–క్రాప్‌ నమోదు చేసిన మేరకు ఆయా ఆర్‌బీకే కేంద్రాల పరిధిలోని గ్రామాల్లో మిగిలిన ధాన్యం పరిస్థితి ఏమిటని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పెనుమల్లి, గురజ, దేవరపూడి, వాడవల్లి, వణుదుర్రు గ్రామాల్లో నూర్పిళ్లు పూర్తవకుండా అక్కడకక్కడ మిగిలిపోయాయి. పెదపాల పర్రు ఆర్‌బీకే పరిధిలో కొద్ది మేర కుప్ప నూర్పిళ్లు పూర్తి కాలేదు. ఆయా గ్రామాల్లో మిగిలిన కుప్పలకు సంబంధించి పొలాలను రబీ సాగు కింద ఈ–క్రాప్‌ చేయించుకోవాలని, మరో పది రోజుల్లో రబీ ధాన్యం కొనుగోలు చేస్తామని రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. ఆయా రైతు భరోసా కేంద్రాల పరిధిలో మిగిలివున్న కుప్పలకు సంబంధించి పూర్తిస్థాయిలో ఈ–క్రాప్‌ చేయించాలని సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు.

ఇప్పుడేం చేయాలి

ఈ ఏడాది 15 ఎకరాలు సాగుచేశా. కూలీల కొరత కారణంగా నూర్పిళ్లు పూర్తి చేయలేదు. మరో రెండు రోజుల్లో నూర్పిళ్లు చేద్దామనుకున్న తరుణంలో కొను గోళ్లు నిలిపివేశారు. నాలాంటి రైతులు చాలామంది ఉన్నారు. ధాన్యం ఏం చేయాలి ? మరలా ఈ–క్రాప్‌ అంటున్నారు.

మేకా బాబూరావు, గురజ

ధాన్యం పూర్తిస్థాయిలో కొనుగోలు చేయకుండానే లక్ష్యం మేరకు కొనుగోలు చేశాం ! అంటూ కొను గోలు కేంద్రాలను మూసివేయటం ఏమిటి మరో వారం రోజులు పొడిగిస్తే మిగిలి ఉన్న రైతులు నూర్పిళ్లు పూర్తి ధాన్యం విక్రయించుకునే వారు. అలాంటిది ఇప్పుడు నూర్పిళ్లు పూర్తి చేస్తే ధాన్యం ఏమి చేయాలి.

యు.అచ్యుత గంగాధర్‌

Updated Date - 2023-02-07T00:35:52+05:30 IST