పోలవరం ప్రస్తావనేదీ..

ABN , First Publish Date - 2023-02-02T00:08:46+05:30 IST

కేంద్ర బడ్జెట్‌లో పన్నులు పెంచేలా ఉరుములు లేవు. ఆదాయపు పన్ను పరిమితులు పెంచడం తప్ప పెద్దగా మెరుపులు కనిపించలేదు.

పోలవరం ప్రస్తావనేదీ..
లేసు అల్లికలు చేస్తున్న మహిళలు

కేటాయింపుల్లేని నిర్మలమ్మ బడ్జెట్‌

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి):

కేంద్ర బడ్జెట్‌లో పన్నులు పెంచేలా ఉరుములు లేవు. ఆదాయపు పన్ను పరిమితులు పెంచడం తప్ప పెద్దగా మెరుపులు కనిపించలేదు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌కు ఆచి తూచి మెరుగులు దిద్దినట్టు కనిపిస్తోంది. పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం 2023–24 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సారి కేంద్ర వార్షిక బడ్జెట్‌లో పెను మార్పులు ఉంటాయని, నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు, రైతులకు ఆశాజనకమైన కేటాయింపులు ఉంటాయని ఊహించిన దానికన్నా బడ్జెట్‌లో ఈ మేరకు స్పందన తక్కువే. నిర్మలమ్మ బడ్జెట్‌ ఆకర్షణీయ, పేదల బడ్జెట్‌గా బీజేపీ అభివర్ణిస్తే.. బీజేపీయేతర పక్షాలన్నీ ఇదొక ఎన్నికల బడ్జెట్‌, సానుకూల నిర్ణయాలు తీసుకోలేదంటూ తప్పుపట్టింది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకంజ వేశారంటూ విమర్శించారు. ఊరించి ఊరించి బడ్జెట్‌కు ఇంకేదో ఆపాదించారంటూ ప్రతిపక్షాలు దుయ్యబట్టాయి. వ్యవసాయ రంగానికి రూ.20 లక్షల కోట్లు కేటాయించడం సముచిత నిర్ణయంగా భారతీయ జనతా పార్టీతో సహా దాదాపు మిగతా పక్షాలన్నీ స్వాగతించాయి. పంటలకు మద్దతు ధర విషయాన్ని ప్రస్తావించకపోవడం, పంటల బీమా సహా మరికొన్ని పథకాలపై ఆశించినట్టు వరాలు కురిపించకపోవటం నిరాశనే కలిగించింది. బడ్జెట్‌ ఘనంగా చూపించినా ఎరువులు, పురుగు మందులు ధరల తగ్గింపును నామమాత్రంగానైనా పట్టించుకోకపోవడంపై రైతులు, రైతు సంఘాలు కస్సుమన్నాయి. ఆయిల్‌ ఫాంకు సంబంధించి కీలక నిర్ణయం వెలువడుతుందని రైతులు ఆశించినా బడ్జెట్‌లో అలాంటిదేమీ కనిపించలేదు.

పోలవరం ఎక్కడ ?

ఆంఽద్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు ఈసారి ఆశించినంతగా బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయనుకున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన నిధులపైనా తగు నిర్ణయాలు తీసుకుంటారనుకున్నారు. కేంద్ర బడ్జెట్‌లో పోలవరంపై నామమాత్రంగానైనా ప్రస్తావన లేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన దగ్గర నుంచి ముగించేంత వరకు ఆశతో అందరూ చెవురిక్కించి మరీ ఆలకించారు. పోలవరం ప్రాజెక్టుకు సంతృప్తికర నిధులు కేటాయించడమే కాకుండా విధాన ప్రకటన చేస్తారని ఆశించిన వారందరికీ భంగపాటు ఎదురైంది. పోలవరంను ప్రస్తావించకపోవడాన్ని అందరినీ దిగ్ర్భాంతికి గురిచేసింది. ఇప్పటికే పోలవరం పనులు కుంటుపడిపోగా గడిచిన రెండేళ్ళల్లో ప్రాజెక్టు డిజైన్లను కుదించేలా వ్యవహరించారు. ఇప్పుడేమో నిధుల ప్రస్తావన లేకుండా గుంభనంగా ఉన్నారు. ప్రత్యేకించి జల వనరుల విభాగంలో ప్రతీ పనికి కేటాయింపులు ఉంటాయని, ఇప్పటికిప్పుడు స్పష్టత లేకపోయినా ఒకటి, రెండు రోజుల్లోనే తగు స్పష్టత వచ్చి తీరుతుందని ఇంజనీర్లు చెబుతున్నారు. ఇంకోవైపు పోలవరం నిరాశ్రయుల గురించి, వారికి ఇవ్వాల్సిన ప్యాకేజీల గురించి ఇసుమంతైనా నిర్మలమ్మ ప్రస్తావించకపోవటాన్ని ప్రజా సంఘాలు తప్పుపడుతున్నాయి. అత్యధిక ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా గుర్తించిన పోలవరం లేకపోవటం ఏమిటనే ప్రశ్న అందరినీ వేధిస్తుంది.

నిట్‌ జాడ లేదు

రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ, ఇతర యూనివర్సిటీలకు కేటాయింపులు ఇచ్చారే తప్ప తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్‌కు ఆశించినట్టుగా ఎలాంటి కేటాయింపులు లేనేలేవు. ఇప్పటికే ఇక్కడ నిట్‌ ప్రారంభమై సంవత్సరాలు గడుస్తున్నా పలు నిర్మాణాలను ఇక్కడ పూర్తి చేయలేకపోయారు. గత వార్షిక బడ్జెట్‌ అనంతరం ప్రతిపాదించిన 780 కోట్ల అభివృద్ధి ప్రణాళికకు వీలుగా కీలక నిర్ణయం బడ్జెట్‌లో తీసుకుంటారని ఆశించినా అదీ నెరవేరలేదు. దీంతో ఏపీలో ఉన్న ఏకైక నిట్‌కు ఈసారి మొండి చెయ్యి ఎదరైందని భావిస్తున్నారు.

ఆక్వాకు ఊరట

ఆక్వా రంగానికి కాస్త ఊరటనిచ్చేలా కేంద్రం ప్రత్యేకించి ఆక్వా రంగానికి ఆరు వేల కోట్లు కేటాయించింది. ఏపీ, ఒడిశా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లోనే ఆక్వా విస్తారంగా ఉంది. ఈ మధ్యనే బెంగాల్‌లోనూ పుంజుకుం టుంది. ఈ క్రమంలోనే ప్రతీ ఏటా ఆక్వా నష్టాలు తొంగిచూ డడం, రైతులు దివాళా తీయ డం తరచూ ఎదురవుతోంది. ఈ అను భవాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ రంగాన్ని కాస్తంత ప్రోత్సహించేలా కేంద్రం ఈ తరహా నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపైనా సంతృప్తికర స్పష్టత కనిపించలేదు.

ఆదాయ పరిమితి

ఆదాయపు పన్ను పరిమితిని తగు రీతిలో పెంచాలంటూ కొన్నేళ్ళుగా వేతన జీవులు డిమాండ్‌ చేస్తూ వచ్చారు. ప్రతీ వార్షిక బడ్జెట్‌లోనూ వారికి మొండిచెయ్యే. ఈ సారి కేంద్రం వేతన జీవుల పట్ల కాస్తంత ఉదారత చూపింది. పరిమితిని పెంచుతూ బడ్జెట్‌ లో కీలక విధాన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఒక్క ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే లక్షన్నర మందికిపైగా లబ్ధి పొందబోతున్నారు. ఇది సహేతుకం, సంతృప్తికర మంటూ ఉద్యోగ సంఘాలు ప్రకటనలు గుప్పించాయి. ‘చాన్నాళ్ళ నుంచి వేతన జీవులు ఎదురు చూస్తున్నట్టుగానే ఈసారి కేంద్ర బడ్జెట్‌లో ఆదాయపు పన్ను పరిమితి పెంచడం ఉద్యో గులందరికీ గొప్ప సంతోషాన్ని మిగిల్చిం ది. తాము ఇన్నా ళ్ళు పన్ను పరిమితి పెంచాలంటూ డిమాండ్‌ చేస్తూనే వచ్చామని, అయితే ఇది సాకారం కావడం సంతోషం’ ఎన్జీవో నేత చోడగిరి శ్రీనివాస్‌ అన్నారు. మిగతా వేతన జీవులకు కూడా ఇది అత్యంత ప్రయోజకర మంటూ మిగతావర్గాలు కీర్తించాయి. చార్టర్డ్‌ అకౌండెంట్స్‌ సైతం దీనిని ఉదహరిస్తూ మంచి పరిణామంగా అభివర్ణించారు.

మన రైలు ఆగిందా..?

కేంద్ర వార్షిక బడ్జెట్‌లో రైల్వేకు కనీవినీ ఎరుగని రీతిలో 2 లక్షల 40 వేల కోట్లు కేటాయించారు. అయితే మోడీ ప్రభుత్వం గత కొన్నేళ్ళుగా రైల్వేకు గంపగుత్తగా నిధులు ప్రకటించడం, ఆ తదుపరే అవసరమైన ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడం చేస్తూ వచ్చింది. ఈసారి కూడా అదే విధానాన్ని పాటిస్తున్నట్టుగా బడ్జెట్‌లో లక్షల కోట్లు అయితే కేటాయించారుకాని అది ఏ ఏ ప్రాజెక్టుకు అనేది మాత్రం స్పష్టత ఇవ్వలేదు. దీంతో కొవ్వూరు–సత్తుపల్లి లైను ఏమైపో యిందో ఎవరికీ అంతుపట్టకుండా పోయింది. సమాంతరం గా నరసాపురం–కోటిపల్లి లైనుకు ఈసారి అమోఘమైన కేటాయింపులు ఉంటాయని అనుకున్నా ఒక స్పష్టత రాలేదు. ఇదంతా జిల్లావాసులను కాస్తంత నిరాశే పరిచింది. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ప్రతీసారి రైల్వే లైన్ల ఆధునికీకరణ, కొత్త రైళ్ళు ప్రతిపాదనలు, ఉన్న స్టేషన్ల ఆధునికీకరణ నిర్ణయాలపై ఎదురుచూసేవారు. ఈసారి కూడా ఆ మాదిరిగానే అందరూ ఉత్కంఠతో ఎదురు చూసినా రైల్వేలైన్లకు కేటాయింపులు ఆవిష్కృతం కాకపోవడంతో తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తమైంది. గత వార్షిక బడ్జెట్‌లోనూ ఒక్క కోటిపల్లి–నరసాపురం లైనుకే రూ.450 కోట్లు కేటాయింపులు ఇచ్చారు. అప్పట్లో కూడా ఈ విషయం బడ్జెట్‌ ప్రతిపాదించిన రోజు కాకుండా మూడు రోజుల తరువాతే ఈ తరహా అంకెలన్నీ బయటపడ్డాయి. ఈసారి కూడా అంతేనేమోనని అంటున్నారు. అలాగే కొత్త రైళ్ళ ప్రతిపాదన మచ్చుకైనా కనిపించలేదు.

Updated Date - 2023-02-02T00:08:48+05:30 IST