బస్ షెల్టర్ నిర్మించండి..
ABN , First Publish Date - 2023-01-24T23:56:17+05:30 IST
చాట్రాయిలో బస్‌షెల్టర్ లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ, వాన సమయంలో ఇబ్బందులు పడుతూ ప్రమాదకరంగా రోడ్డు పక్కనే నిలబడుతున్నారు.

చాట్రాయిలో ప్రయాణికుల వినతి
చాట్రాయి, జనవరి 24: చాట్రాయిలో బస్‌షెల్టర్ లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ, వాన సమయంలో ఇబ్బందులు పడుతూ ప్రమాదకరంగా రోడ్డు పక్కనే నిలబడుతున్నారు. వృద్ధులు, మహిళలు, చిన్నారుల ఇబ్బందులు వర్ణనాతీతం. బస్ షెల్టర్ లేక బస్సులను రోడ్డు మధ్యలోనే ఆపి ప్రయాణికులు ఎక్కడం, దిగడం చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ నిలిపోతుంది. చాట్రాయి పది గ్రామాలకు కూడలి కావడంతో ఇక్కడి నుంచే అధిక సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. చాట్రాయి మీదుగా ధర్మాజీగూడెం–హైదరాబాద్, తిరువూరు–జనార్దనవరం, నూజివీడు–వైజాగ్, చింతలపూడి, జనార్దనవరం, చీపురుగూడెం తదితర రూట్లలో నడిచే సర్వీసులు నడుపుతున్నారు. చాట్రాయి రోడ్లు బాగా ఇరుకుగా ఉంటాయి. ఇది ఏలూరు–ఎన్టీఆర్ జిల్లాలను కలిపే రహదారి కావడంతో నిత్యం వందలాది వాహనాలు రాకపోకల వల్ల రోడ్డు రద్దీగా ఉంటుంది. గ్రామ కూడలిపై బస్ ఆగితే బైక్‌లు తప్ప మిగిలిన వాహనాలు వెళ్లడానికి ఖాళీ ఉండదు, ఆ సమయంలో ప్రయాణికులు బస్సులు ఎక్కడం, దిగడం ప్రమాదకరంగా ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి చాట్రాయిలో బస్ షెల్టర్ నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు.