బిల్లులేవి.. జగనన్నా

ABN , First Publish Date - 2023-09-20T00:44:01+05:30 IST

ప్రభుత్వమే గోదాములు మాదిరిగా నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో ఏ మిల్లుకు ఎంత మేర ధాన్యం ఇవ్వాలనే విషయంలోనూ స్పష్టత కొరవడనుంది. రైతులకు సొమ్ములు చెల్లించిన తర్వాత మిల్లర్ల బకాయిలు విడుదల చేస్తామంటూ చెప్పుకొచ్చిన ప్రభుత్వం ఇప్పుడు చుక్కలు చూపిస్తోంది.

బిల్లులేవి.. జగనన్నా

బ్యాంక్‌ గ్యారెంటీలకు సొమ్ములు నిల్‌

చేతులెత్తేస్తున్న మిల్లర్లు.. ఖరీఫ్‌ కొనుగోళ్లపై ప్రభావం

ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం కొనుగోలుకు ఇబ్బందులు తప్పవా ? మిల్లర్లు చేతులు ఎత్తేయనున్నారా ? బ్యాంకు గ్యారెంటీలు సమర్పించే అవకాశం లేదా ? ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోతే ఈ ప్రశ్నలన్నీ నిజం కానున్నాయి. బకాయిలు విడుదల చేయకపోతే ధాన్యం సేకరించే పరిస్థితి లేదంటూ మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వమే గోదాములు మాదిరిగా నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో ఏ మిల్లుకు ఎంత మేర ధాన్యం ఇవ్వాలనే విషయంలోనూ స్పష్టత కొరవడనుంది. రైతులకు సొమ్ములు చెల్లించిన తర్వాత మిల్లర్ల బకాయిలు విడుదల చేస్తామంటూ చెప్పుకొచ్చిన ప్రభుత్వం ఇప్పుడు చుక్కలు చూపిస్తోంది. బిల్లులు విడుదల చేయ కుండా తాత్సారం చేస్తోంది. రవాణా చార్జీలు, కస్టమ్‌ మిల్లింగ్‌ బకాయిలు పెద్ద మొత్తంలో పేరుకుపోయాయి. జిల్లాలోనే దాదాపు రూ.300 కోట్లు బకాయి ఉందంటూ మిల్లర్లు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తేనే ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి మిల్లర్లు బ్యాంక్‌ గ్యారెంటీలు సమర్పించనున్నారు. ప్రభుత్వం అప్పగించే ధాన్యం విలువకు సరిపడా మిల్లర్లు గ్యారెంటీ సమర్పించాలి. ఇందులో 15 శాతం నగదు చెల్లించాలి. మిగిలిన మొత్తానికి ఆస్తులు తాకట్టు పెడుతున్నారు. బ్యాంకు గ్యారంటీ కోసం జిల్లాలోని మిల్లర్లు ప్రతి సీజన్‌లోనూ దాదాపు రూ.500 కోట్ల మేర తొలి విడతగా లెక్కలు చూపుతున్నారు. ఆ మేరకు ప్రభుత్వం ధాన్యం అప్పగిస్తోంది. మిల్లర్లు కస్టమ్‌ మిల్లింగ్‌ చేసి తిరిగి బియ్యాన్ని అప్పగిస్తున్నారు. ఇలా బియ్యం అప్పగించిన మేరకు బ్యాంక్‌ గ్యారెంటీలు బ్యాంకుల నుంచి విడుదల అవుతుంటాయి. ఆ మేరకు కొత్తగా మళ్లీ ధాన్యం అప్పగిస్తుంటారు. గడచిన రబీలో దాదాపు రూ.1,350 కోట్ల విలువైన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. మిల్లర్లు ముందుగా రూ.500 కోట్లకు బ్యాంక్‌ గ్యారెంటీలు సమర్పించారు. ఆ తర్వాత బియ్యాన్ని అప్పగిస్తే మిగిలిన ధాన్యాన్ని మిల్లర్లకు కేటాయించారు. ప్రతి సీజన్‌లో ఇదే పంథా నడుస్తోంది. ధాన్యం మొత్తానికి ఏకకాలంలో బ్యాంక్‌ గ్యారంటీలు చెల్లించే స్తోమత జిల్లా మిల్లర్లక లేదు. అందుకే మూడో వంతు మాత్రమే తొలుత చెల్లిస్తున్నారు. అందులో 15 శాతం అంటే రూ.75 కోట్ల మేర నగదు రూపంలో బ్యాంకులు చెల్లించాలి. మిగిలిన దానికి ఆస్తులు తాకట్టు పెడుతు న్నారు. ఈసారి ప్రభుత్వం బిల్లులు చెల్లించక పోతే గ్యారెంటీలు ఇచ్చే పరిస్థితి కానరావడం లేదు.

మొక్కుబడి చెల్లింపులు

ఏటా ధాన్యం సీజన్‌ ప్రారంభమైనప్పుడు ప్రభుత్వం మొక్కుబడిగా బిల్లులు చెల్లిస్తోంది. గరిష్టంగా రూ.20 కోట్లు చెల్లించి చేతులు దులుపుకొంటోంది. ఇలా జిల్లాలో దాదాపు రూ.300 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. మిల్లర్లకు బ్యాంకుల్లో అప్పులు పెరిగిపోయాయి. వాయిదాలు చెల్లించలేకపోతున్నారు. మరోవైపు విద్యుత్‌ చార్జీలు చెల్లింపునకు కటకటలాడుతున్నారు. ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోవడం లేదు. బ్యాంక్‌ గ్యారెంటీల కోసం పరోక్షంగా ఒత్తిడి తెస్తోంది. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆటలు సాగాయి. ఖరీఫ్‌ సీజన్‌లో మాత్రం చేతులెత్తేసేందుకు మిల్లర్లు సిద్ధపడుతున్నారు. ప్రభుత్వం సొమ్ములు చెల్లిస్తేనే బ్యాంక్‌ గ్యారెంటీలు సమర్పించేందుకు ఆసక్తి చూపుతు న్నారు. మరోవైపు ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోలుపై అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఎప్పటిలాగే తూకం వేసిన తర్వాతే మిల్లర్లకు ధాన్యం అప్పగించే నిర్ణయం తీసుకోనున్నారు. ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం నిబంఽధనలు కఠినతరం చేస్తోంది. ధాన్యం కొనుగోలులో ఈ పోస్‌ యంత్రంలో రైతు వేలిముద్ర తప్పనిసరి చేసింది. ఇవన్నీ ఖరీఫ్‌ కొనుగోళ్లపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.

Updated Date - 2023-09-20T00:44:01+05:30 IST