మళ్లీ త్రిసభ్య కమిటీలే

ABN , First Publish Date - 2023-02-01T23:29:43+05:30 IST

శాఖ సహకార సంఘాలకు మళ్లీ త్రిసభ్య కమిటీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గత నెల 31వ తేదీ జీవో నెంబర్‌ 81 ద్వారా ఈ ఆదేశాలు వచ్చాయి.

మళ్లీ త్రిసభ్య కమిటీలే

మరో ఆరు నెలలు పొడిగిస్తూ సహకార శాఖ ఉత్తర్వులు

కొత్త కమిటీలపై అసంతృప్తి

భీమవరం, ఫిబ్రవరి 1 : శాఖ సహకార సంఘాలకు మళ్లీ త్రిసభ్య కమిటీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గత నెల 31వ తేదీ జీవో నెంబర్‌ 81 ద్వారా ఈ ఆదేశాలు వచ్చాయి. ఆరు నెలల పాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. జిల్లాలో మొత్తం 114 సొసైటీలు ఉండగా 107 సొసైటీలకు తాజాగా కమిటీలు నియమించారు. ఆచంట మండలంలోని కరుగోరుమిల్లి, చినమల్లం సొసైటీలకు ఇప్పటికే ఉన్న కమిటీలను కొనసాగిస్తున్నారు. మరో 3 సొసైటీలకు కమిటీలు నియమించాల్సి ఉంది. ఈ తాజా ఉత్తర్వులు ఈ ఏడాది జులై 30తేదీ వరకు అమల్లో ఉంటాయని సహకార శాఖ పేర్కొంది.

ఎన్నికలు నిర్వహించే ధైర్యం లేదా..?

2019లో అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం కీలకమైన వ్యవసాయ రంగంలోని రైతులకు ప్రాతినిధ్యం విహించే సొసైటీలకు ఎన్నికలు నిర్వహించకుండా కాలం గడుపుకుంటూ వస్తుందన్న విమర్శలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఎన్నిక ద్వారా ఎంపికైన సహకార సంఘాల కమిటీలను చివరి దశలో మూడేళ్ళపాటు పాత కమిటీలను తిరిగి కొనసాగించారు. వైసీపీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు ప్రస్తుతం నాలుగో సంవత్సరం. ఈ ప్రకారం చూస్తే ఏడు సంవత్సరాలుగా సహకార సంఘాలకు ఎన్నికలు లేకుండానే కాలం గడిపేస్తున్నారు. వచ్చే ఏడాదిలోగా సహకార వ్యవస్ధకు ఎన్నికలు నిర్వహిస్తారో లేదా అనేది వేచి చూడాలి. ఈసారి త్రిసభ్య కమిటీలలో పూర్తిగా నూతన నాయకత్వానికి అవకాశం కల్పించారు. గతంతో పోలిస్తే ఈసారి ఈ కమిటీల పట్ల అధికార పార్టీలో అసంతృప్తులు వ్యక్తం అవుతున్నాయి. పార్టీలో గుర్తింపు లేనివారికి కూడా ఇటు వంటి పదవులు ఇవ్వడం ఏమిటంటూ నిరసన వ్యక్తమవుతున్నాయి. భీమవరం నియోజకవర్గంలో ఈ పరిస్థితి అప్పుడే బయటపడింది.

Updated Date - 2023-02-01T23:29:46+05:30 IST