కొత్త బ్యాగులు వచ్చేనా?

ABN , First Publish Date - 2023-01-26T00:35:27+05:30 IST

మెంటాడ మండలంలో జగనన్న విద్యాకానుక అభాసుపాలవుతోంది. విద్యా సంవత్సరం మరో మూడు నెలల్లో ముగియనుండగా ఇప్పటికీ వేల సంఖ్యల్లో విద్యార్థులకు స్కూల్‌ బ్యాగులు అంద లేదు. మరోవైపు అరకొర బ్యాగుల సరఫరాతో ఉపాధ్యాయులు అయోమయంలో పడ్డారు.

కొత్త బ్యాగులు వచ్చేనా?
గోనె సంచులను స్కూల్‌ బ్యాగులుగా వినియోగిస్తున్న కేఎల్‌వలస విద్యార్థులు, ఇన్‌సెట్‌లో చిరిగిన బ్యాగుతో బాలుడు

ఆరంభంలోనే అరకొర సరఫరా

అందులోనూ సగం నాణ్యతాలోపం

నేటికీ కొత్తవి అందజేయని వైనం

అభాసుపాలవుతున్న జగనన్న విద్యాకానుక

మెంటాడ, జనవరి 25: మెంటాడ మండలంలో జగనన్న విద్యాకానుక అభాసుపాలవుతోంది. విద్యా సంవత్సరం మరో మూడు నెలల్లో ముగియనుండగా ఇప్పటికీ వేల సంఖ్యల్లో విద్యార్థులకు స్కూల్‌ బ్యాగులు అంద లేదు. మరోవైపు అరకొర బ్యాగుల సరఫరాతో ఉపాధ్యాయులు అయోమయంలో పడ్డారు. మండలంలోని పాఠశా లలకు సుమారు నాలుగు వేల స్కూలు బ్యాగులు అవసరం కాగా విద్యా సంవత్సరం ప్రారంభంలో పూర్తిస్థాయిలో సరఫరా కాలేదు. చాలా మందికి అందలేదు. ఇదే సమయంలో బ్యాగుల్లో నాణ్యతాలోపం ఉపాధ్యా యులను సంకట స్థితిలోకి నెట్టింది. సరఫరా అయిన బ్యాగుల్లో సగం వారం తిరక్కముందే చిరిగిపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్రంగా మండిపడ్డారు. పరిస్థితిని ఉపాధ్యాయులు ఎంఈవో దృష్టికి తీసుకువెళ్లడం, ఆయన ఉన్నతాధికారులకు తెలియజేయడం, నాణ్యత లేని బ్యాగులను మండల విద్యాశాఖాధికారి కార్యాలయానికి అప్పగించడం తదితర పరిణామాలు వరుసగా జరిగాయి. నాలుగు వేలకు గాను సుమారు మూడువేల బ్యాగులు పాడయ్యాయని ప్రధాన ఉపాధ్యాయులు నివేదించారు. అందులో మంచి, చెడు ఫిల్టర్‌ చేసి సుమారు రెండువేల బ్యాగులు బాగోలేవని నిర్ధారించారు. ఈ తంతు బ్యాగ్‌లు పంపిణీ చేసిన నెలరోజుల్లో పూర్తి చేశారు. అయితే ఇప్పటికీ వాపసు ఇచ్చిన బ్యాగుల స్థానంలో కొత్తవి రాలేదు. విసిగిపోయిన విద్యార్థుల్లో కొందరు బయట మార్కెట్లో కొనుక్కోగా, పేద విద్యార్థులు గోనె సంచిల్ని బ్యాగులుగా తయారు చేసుకొని నెట్టుకొస్తూ అవస్థలు పడుతున్నారు.

ఎదురుచూస్తున్నాం

బ్యాగుల అంశాన్ని మండల విద్యాశాఖాధికారి వెంకటరావు వద్ద ప్రస్తావించగా వాపసు పంపిన బ్యాగుల స్థానంలో కొత్తవి ఇంకా అందలేదని అన్నారు. సుమారు వెయ్యిబ్యాగులు రావాల్సి వుందన్నారు. ఎప్పుడు వస్తే అప్పుడు విద్యార్థులకు పంపిణీ చేస్తామని చెప్పారు. విద్యార్ధులు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమేనని, పరిస్థితిని అధికారులకు మరోసారి తెలియజేస్తామని ఆయన తెలిపారు.

Updated Date - 2023-01-26T00:35:29+05:30 IST