ఇప్పుడేం చేస్తారో?

ABN , First Publish Date - 2023-01-25T00:18:18+05:30 IST

ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించుకునేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. కొనుగోలు లక్ష్యం పూర్తయిందని ఒకవైపు అధికారులు చెబుతుండగా.. తమ వద్ద ఉన్న నిల్వల పరిస్థితేమిటని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు.

ఇప్పుడేం చేస్తారో?
సీతానగరం: మెడకు ఉరితాళ్లతో నిరసన తెలుపుతున్న రైతులు

మిగులు ధాన్యం సేకరణలో జాప్యం

ప్రభుత్వ నిర్ణయంతో ఆందోళనలో రైతులు

పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్‌

(పార్వతీపురం- ఆంధ్రజ్యోతి)

ప్రతి ధాన్యం గింజా కొనుగోలు చేస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైంది. ఆచరణలో పూర్తిగా చేతులెత్తేసింది. లక్ష్యాల నిర్ణయాలతో పూర్తిస్థాయిలో కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించుకునేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. కొనుగోలు లక్ష్యం పూర్తయిందని ఒకవైపు అధికారులు చెబుతుండగా.. తమ వద్ద ఉన్న నిల్వల పరిస్థితేమిటని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలని మంగళవారం సీతానగరం మండలం అంటిపేట వద్ద రైతులు మెడుకు ఉరితాళ్లు బిగించుకుని నిరసన కార్యక్రమం చేపట్టారంటే జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇదీ పరిస్థితి..

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఖరీఫ్‌లో వరి దిగుబడి ఆశాజనకంగా ఉందని చెప్పొచ్చు. అయితే ధాన్యం విక్రయాలకు మాత్రం రైతులు ఆపసోపాలు పడాల్సి వస్తోంది. ప్రణాళిక ప్రకారం ధాన్యం కొనుగోలు చేపట్టాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. పండిన పంట కంటే తక్కువ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించడంతో నెలలు దాటుతన్నా ధాన్యాన్ని విక్రయించుకోలేని దుస్థితిలో రైతులు ఉన్నారు. దీనివల్ల వారు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. వాస్తవంగా జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో లక్షా 71వేల 7వందల 62 ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. 3లక్షల 18వేల 89 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వచ్చింది. అయితే ఇందుకు తగ్గట్టుగా కొనుగోలు లక్ష్యాలను కూడా ప్రభుత్వం నిర్ణయించి ఉంటే రైతులకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉండేది కాదు. ఈ ఏడాది లక్షా 91వేల 240 మెట్రిక్‌ టన్నులను కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. దీంతో సివిల్‌ సప్లయ్‌ శాఖ ద్వారా లక్షా 81వేల 618 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యం ప్రకారం స్థానిక అధికార యంత్రగం దాదాపుగా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేశారని చెప్పొచ్చు. అయితే ఇంకా లక్షా 27వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం నిల్వలు రైతుల వద్ద ఉన్నాయి. ఇందులో విత్తనాల తయారీ కోసం కొంత మేరకు సాలూరు మండలంలోని మామిడిపల్లి తదితర ప్రాంతాల్లో ఏపీ సీడ్స్‌కు వెళ్లగా, సుమారు 80 వేల నుంచి లక్ష మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యాన్ని రైతుల నుంచి ఇంకా అధికారులు కొనుగోలు చేయాల్సి ఉంది. జిల్లాలో సీతానగరం, గరుగుబిల్లి, పార్వతీపురం, కొమరాడ తదితర మండలాల్లో ఉన్న ధాన్యం నిల్వలను ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కొనుగోలు చేయాలని ఆయా ప్రాంత రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

వినూత్నంగా నిరసన

సీతానగరం: పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలని మంగళవారం అంటిపేట రైతు భరోసా కేంద్రం వద్ద అన్నదాతలు డిమాండ్‌ చేశారు. మెడకు ఉరితాళ్లు బిగించుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రెడ్డి లక్ష్మీనాయుడు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు చేస్తామని నెలరోజులుగా చెబుతున్న అధికారులు అదిగో.. ఇదుగో.. అంటూ జాప్యం చేయడం తగదన్నారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్‌ డీడీ నాయక్‌ సెల్‌ఫోన్‌ ద్వారా రైతులతో మాట్లాడారు. పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ నిరసనలో నాయకులు రెడ్డి వెంకటరమణ, రెడ్డి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

కొనుగోలు చేస్తాం

ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యం ప్రకారం ఇప్పటివరకు జిల్లాలో ధాన్యం కొనుగోలు చేపట్టాం. అయితే రైతుల వద్ద అక్కడక్కడ నిల్వలు ఉన్నట్లు సమాచారం వచ్చింది. ఏ మేరకు ధాన్యం నిల్వలు ఉన్నాయనేది యాప్‌ ద్వారా ప్రభుత్వం తెలుసుకుని కొనుగోలుకు చర్యలు తీసుకుంటుంది. మంగళవారం అంటిపేట వద్ద రైతులు నిరసన కార్యక్రమం చేపట్టిన వెంటనే వారితో మాట్లాడాను. పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పాం.

- డీడీ నాయక్‌ , జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్‌

Updated Date - 2023-01-25T00:18:18+05:30 IST