కల్యాణం..కమనీయం!

ABN , First Publish Date - 2023-02-02T00:18:58+05:30 IST

ఉత్తరాంధ్రలో చిన తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి భక్తులతో కిటకిటలాడింది. అంతటా వెంకన్న నామస్మరణ మార్మోగింది.

 కల్యాణం..కమనీయం!
తోటపల్లిలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తున్న దృశ్యం

తోటపల్లికి పోటెత్తిన భక్తులు

గరుగుబిల్లి, ఫిబ్రవరి 1: ఉత్తరాంధ్రలో చిన తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి భక్తులతో కిటకిటలాడింది. అంతటా వెంకన్న నామస్మరణ మార్మోగింది. బుధవారం ఆలయ ప్రాంగణంలో వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించి పులకించిపోయారు. మాఘ శుద్ధ ఏకాదశిని పురస్కరించుకొని వేకువజామునే సుప్రభాత సేవ, ఆరాధన, ద్వజారోహణం, మంగళశాసనములు, విశేష హోమాలు తదితర పూజా కార్యక్రమాలు చేశారు. ఉదయం 9 గంటలకు ఎదురు సన్నాహోత్సవము, స్వామివారి తిరువీధి మహోత్సవం నిర్వహించారు. సాయంకాలం 5 గంటలకు వీరఘట్టానికి చెందిన ప్రముఖ యజ్ఞ యాగకర్త ఎస్‌వీఎల్‌ఎన్‌.శర్మయాజీ , ఆరవెల్లి రామాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు వివి.అప్పలాచార్యులు తదితర రుత్వికుల ఆధ్వర్యంలో వైభంగా కల్యాణ మహోత్సవం జరిపారు. మంగళ సూత్రాలను రాజాంకు చెందిన కె.వెంకట శివప్రసాద్‌ దంపతులు అందజేశారు. స్వామివారికి, రుత్వికులకు పట్టు , దీక్షా వస్త్రాలను పార్వతీపురానికి చెందిన డి. శ్రీనివాసరావు, జ్యోతి దంపతులు అందించారు. స్వామివారి కల్యాణంలో పాల్గొనే దంపతులకు ప్రత్యేకంగా కంకణధారణ చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా ఆలయ సిబ్బంది చర్యలు చేపట్టారు. కల్యాణ మహోత్సవం అనంతరం అందరికీ ఉచితంగా ప్రసాదాలు అందించారు. మధ్యాహ్నం అన్నసమారాధన కూడా జరిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గరుగుబిల్లి ఎస్‌ఐ ఎం.రాజేష్‌ ఆఽధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి నగేష్‌, దేవస్థానం సిబ్బంది మార్కొండ మురళీనాయుడు, మరిశర్ల బలరాంనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-02T00:18:59+05:30 IST