నీరివ్వని ప్రాజెక్టులు

ABN , First Publish Date - 2023-01-26T00:35:32+05:30 IST

జైకా(జపాన్‌ ఆర్థిక సహాయ సంస్థ) నిధులతో జిల్లాలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల ఆధునీకరణ పనులు నత్తతో పోటీపడుతున్నాయి. కొన్నిచోట్ల పూర్తిగా పడకేశాయి. ఆధునీకరణ పనుల పేరుతో ప్రస్తుత రబీ పంటలకు కాల్వల నుంచి నీరు కూడా విడుదల చేయలేదు.

నీరివ్వని ప్రాజెక్టులు
వెంగళరాయసాగర్‌ ప్రాజెక్టు.. ఇన్‌సెట్‌లో కాల్వ లైనింగ్‌ పనులు(ఫైల్‌)

అయోమయంలో రైతులు

పడకేసిన పెద్దగెడ్డ, వెంగళరాయ, పెదంకలాం కాల్వల పనులు

మంజూరు కాని బిల్లులు

ఎక్కడి పనులు అక్కడే వదిలేసిన కాంట్రాక్టర్లు

జైకా(జపాన్‌ ఆర్థిక సహాయ సంస్థ) నిధులతో జిల్లాలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల ఆధునీకరణ పనులు నత్తతో పోటీపడుతున్నాయి. కొన్నిచోట్ల పూర్తిగా పడకేశాయి. ఆధునీకరణ పనుల పేరుతో ప్రస్తుత రబీ పంటలకు కాల్వల నుంచి నీరు కూడా విడుదల చేయలేదు. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు పనులు చేయిస్తారని తాము పంటలను వేయలేదంటున్నారు. ఈ పరిస్థితికి కారణం బిల్లులు మంజూరు కాకపోవడమే. ఇప్పటికే చేసిన పనులకు డబ్బులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లు ఎక్కడి పనులను అక్కడే వదిలేశారు.

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలోని రామభద్రపురం మండలానికి సాగునీరు అందించే పెద్దగెడ్డ సాగునీటి ప్రాజెక్టు పనులను జైకా నిధులతోనే చేపట్టారు. ఇంతవరకు 20శాతం మాత్రమే పూర్తి చేశారు. కాల్వల లైనింగ్‌ పనులు ఇప్పటికీ చేపట్టలేదు. ఈ ప్రాజెక్టు కాల్వల అధునీకరణకు 28.18 కోట్లు మంజూరయ్యాయి. 18 కిలోమీటర్ల పొడవునా ఉన్న ప్రధాన కాల్వలో పూడిక తీత, లైనింగ్‌ పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇంతవరకు 10కిలోమీటర్ల మేర ఎర్త్‌వర్క్‌ చేశారు. బిల్లులు రాక కాంట్రాక్టర్‌ పనులను నిలిపేశారు. అధికారులు మాత్రం యంత్రాలు వచ్చేశాయి. త్వరలోనే పనులు పునఃప్రారంభిస్తామని మళ్లీ చెబుతున్నారు. ఏదైనాగాని ఈ ప్రాజెక్టు పరిధిలోని రైతులు రబీలో పంటలను సాగు చేయలేకపోయారు. ఇక పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలోని వెంగళరాయసాగర్‌ సాగునీటి ప్రాజెక్టు పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ ప్రాజెక్టు పరిధిలో బొబ్బిలి మండలంలో ఎక్కువ ఆయకట్టు ఉంది. అయితే కొన్నాళ్లుగా పంట పొలాలకు సాగునీరు సాఫీగా రావడం లేదు. మక్కువ, సీతానగరం మండలాలను దాటి జిల్లాలోని బొబ్బిలి మండలానికి సాగునీరు రావాల్సి ఉంది. నీరు సాఫీగా ప్రవహించి చివరి ఆయకట్టు వరకు చేరాలంటే కాల్వల లైనింగ్‌ పనులు పూర్తి కావాలి. ఈ పనులకు రూ.63.50 కోట్ల భారీ మొత్తాన్ని మంజూరు చేశారు. నిర్మాణ పనులను దృష్టిలో పెట్టుకుని జలాశయంలోని నీటి నిల్వలను డిసెంబరు నెలలో వృథాగా సువర్ణముఖీ నదిలోకి విడిచి పెట్టారు. కానీ ప్రయోజనం లేకపోతోంది. బిల్లులు అంతంత మాత్రంగా ఇవ్వడంతో పనులు నత్తతో పోటీపడుతున్నాయి. కాల్వలో నీరు ఉన్న కారణంగా జాప్యం జరుగుతున్నట్లు అధికారులు చేపతున్నారు. బిల్లుల సమస్య కారణమని రైతులు విమర్శిస్తున్నారు. కాగా బొబ్బిలి సమీపంలోని పెదంకలాం సాగునీటి ఆనకట్ట కాల్వల ఆధునీకరణకు జైకా నిధుల ఉంచి 17.30 కోట్లు మంజూరు చేశారు. ఈ పనులు కూడా కదలడం లేదు.

- మెంటాడ మండలంలోని ఆండ్ర సాగునీటి ప్రాజెక్టుకు రూ.26 కోట్ల జైకా నిధులు మంజూరు చేశారు. ఇందులో 70 శాతం పనులు పూర్తి చేశారు. మిగిలిన పనులు విడిచి పెట్టారు. త్వరగా పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.

----------------------------------------------------------

ప్రాజెక్టు పేరు జైకా నిధులు ఆయకట్టు

------------------------------------------------------------

వెంగళరాయసాగర్‌ 63.50 కోట్లు 24700 ఎకరాలు

పెద్దగెడ్డ ప్రాజెక్టు 28.18 12000

ఒట్టిగెడ్డ 44.85 16684

పెదంకలాం 17.30 8253

ఆండ్ర జలాశయం 26.00 9500

రెండు మూడు రోజుల్లో పనులు ప్రారంభిస్తాం

జైకా నిధులతో చేపడుతున్న కాల్వల ఆధునీకరణ పనులను రెండు మూడు రోజుల్లో మళ్లీ ప్రారంభిస్తాం. మిషనరీ కూడా వచ్చింది. 18 కిలోమీటర్ల ప్రధాన కాల్వ పనుల్లో 10 కిలోమీటర్ల పరిధిలో ఎర్త్‌వర్క్‌, పూడిక తీత, గట్టు పటిష్టత పనులు పూర్తి చేశాం. లైనింగ్‌ పనులు చేపట్టాల్సి ఉంది. 1.1 కిలోమీటర్లు మాత్రమే లైనింగ్‌ పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు పునః ప్రారంభించి పూర్తి చేస్తాం.

- కనకారావు, డీఈ, పెద్దగెడ్డ

----------------

Updated Date - 2023-01-26T00:35:32+05:30 IST