ఏ ఊరటా లభించలేదు

ABN , First Publish Date - 2023-02-02T00:21:58+05:30 IST

కేంద్ర బడ్జెట్‌లో ఉమ్మడి జిల్లాకు ప్రత్యేకంగా ఏ ఊరటా లభించలేదు. ఉద్యోగ, కర్షక, వ్యాపారులు పెదవి విరుస్తున్నారు.

ఏ ఊరటా లభించలేదు
పార్వతీపురంలో నిర్వహిస్తున్న కురుపాం ఏకలవ్య పాఠశాలల్లో విద్యార్థుల పరిస్థితి ఇదీ..

(పార్వతీపురం- ఆంధ్రజ్యోతి/సాలూరు రూరల్‌)

కేంద్ర బడ్జెట్‌లో ఉమ్మడి జిల్లాకు ప్రత్యేకంగా ఏ ఊరటా లభించలేదు. ఉద్యోగ, కర్షక, వ్యాపారులు పెదవి విరుస్తున్నారు. ఈ బడ్జెట్‌ మొత్తంగా చూస్తే పార్వతీపురం మన్యం జిల్లాకు ఎటువంటి ప్రయోజనం లేదని వివిధ వర్గాల వారు అంటున్నారు. పలు రంగాలకు బాగానే కేటాయింపులు చేసినా జిల్లాకు అవి చేరే పరిస్థితి కనిపించడం లేదని చెబుతున్నారు. జిల్లాలో రైల్వేలకు ఏ మాత్రం లబ్ధి చేకూరుతుందో బడ్జెట్‌ అనంతరం ప్రచురించే పింక్‌ బుక్స్‌ చూస్తేగాని స్పష్టతరాదని రైల్వే వర్గాలంటున్నాయి. జిల్లాలో రూ.కోట్లలో విక్రయాలు చేస్తున్న మందుబాబులకు కేంద్రబడ్జెట్‌లో పన్ను పెంపు వల్ల షాక్‌ తగలనుంది. టీవీలు, మొబైల్‌ ధరలు తగ్గే అవకాశాలున్నాయి. అదే సమయంలో బంగారం ధరలు పెరగనుండడంతో శుభకార్యాలు చేయనున్న వారికి ఆర్థిక భారం పెరగనుంది. ఆదాయపు పన్ను శ్లాబ్‌ రేట్లు మార్చినా కొత్త స్కీమ్‌ వారికే లబ్ధి జరుగుతుందని, పాత స్కీం వారికి పైసా ప్రయోజనం లేదని ఉద్యోగులంటున్నారు.

‘ఏకలవ్య’కు బోధన సిబ్బందిని నియమిస్తే మేలే..

ఏకలవ్య పాఠశాలల్లో బోధన సిబ్బంది నియామకానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. అయితే జిల్లాలో ఆ దిశగా చర్యలు తీసుకుంటే విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా బోధన సిబ్బంది, మౌలిక వసతులు లేక ‘ఏకలవ్య’ విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాత్కాలికంగా బోధన సిబ్బందిని నియమించినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. వాస్తవంగా జిల్లాలో పాచిపెంట, మక్కువ ,కురుపాం, గుమ్మలక్ష్మీపురం, భామిని మండలాల్లో ఏకలవ్య పాఠశాలలు ఉన్నాయి. ఇందులో గుమ్మలక్ష్మీపురం మండలంలో మినహా మిగిలిన మండలాల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో లేవు. నేటి వరకు భవన నిర్మాణాలు పూర్తి కాలేదు. దీనివల్ల విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొం టున్నారు. ఈ నేపథ్యంలో ఏకలవ్య పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించి బోధన సిబ్బందిని నియమించడమే కాదు.. పూర్తిస్థాయిలో పర్యవేక్షించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. గుమ్మలక్ష్మీపురం మినహా మిగిలిన ఏకలవ్య పాఠశాలల భవన నిర్మాణాలపైనా దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లావాసులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2023-02-02T00:22:00+05:30 IST