ఏఎస్‌ఐ రాజుకు ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌

ABN , First Publish Date - 2023-01-26T00:34:31+05:30 IST

భోగాపురం పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న తిరుమలరాజు సూర్యనారాయణరాజు ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌ అందుకోనున్నారు. ఈ పురస్కారానికి కేంద్రప్రభుత్వం ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 15 మంది ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌కు ఎంపిక కాగా ఉత్తరాంధ్ర స్థాయిలో (పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖ జిల్లాల నుంచి) ఈయనొక్కరే ఎంపిక కావడం విశేషం. ఈయన స్వగ్రామం పూసపాటిరేగ మండలం గోవిందపురం.

ఏఎస్‌ఐ రాజుకు ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌
తిరుమలరాజు సూర్యనారాయణరాజు

భోగాపురం, జనవరి25: భోగాపురం పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న తిరుమలరాజు సూర్యనారాయణరాజు ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌ అందుకోనున్నారు. ఈ పురస్కారానికి కేంద్రప్రభుత్వం ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 15 మంది ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌కు ఎంపిక కాగా ఉత్తరాంధ్ర స్థాయిలో (పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖ జిల్లాల నుంచి) ఈయనొక్కరే ఎంపిక కావడం విశేషం. ఈయన స్వగ్రామం పూసపాటిరేగ మండలం గోవిందపురం. ఈయనకు తల్లి రామలక్ష్మి, భార్య నాగమణి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. సూర్యనారాయణరాజు 10వ తరగతి వరకు గోవిందపురంలోనూ, విజయనగరంలో ఇంటర్మీడియట్‌ చదువుకొన్నారు. 1989లో పోలీస్‌ ఉద్యోగానికి ఎంపికై ఆ ఏడాది జూన్‌ 1న సీతానగరం పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా చేరారు. 1993నుంచి 1996 వరకు పాచిపెంట, 1996 నుంచి 2001 వరకు కొత్తవలస, 2001నుంచి 2005వరకు విజయనగరం రెండో పట్టణపోలీస్‌స్టేషన్‌, 2005నుంచి2010 వరకు సెంట్రల్‌క్రైం స్టేషన్‌లో విధులు నిర్వహించారు. 2011లో హెడ్‌కానిస్టేబుల్‌గా విజయనగరం పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహించారు. తాడేపల్లి, తుని, విజయనగరంలో రైల్వేపోలీస్‌గా కూడా పనిచేశారు. 2018లో ఏఎస్‌ఐగా పదోన్నతి పొందారు. చీపురుపల్లిలో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తూ బదిలీపై 2019లో భోగాపురం స్టేషన్‌కు వచ్చారు. పోలీస్‌ మెడల్‌కు ఎంపిక కావడంపై సూర్యనారాయణరాజును పోలీసు అధికారులు, సిబ్బంది అభినందిస్తున్నారు.

అధికారుల మన్నన, ప్రజాధారణతోనే

ఉన్నత పురస్కారానికి ఎంపిక కావడంపై సూర్యనారాయణరాజు మాట్లాడుతూ అధికారుల మన్ననలు, సూచనలు, ప్రజలతో మమేకమై విధులు నిర్వహించడంతోనే ఈ పురస్కారం లభించిందన్నారు. జిల్లా స్థాయిలో నగదు, ఉత్తమ సేవా పురస్కారాలు సుమారు 40 వరకు పొందానన్నారు. పోలీస్‌ మెడల్‌ రావడం చాలా సంతోషంగా ఉందని, తాను మంచి మార్గంలో నడిచేందుకు దోహదపడిన వారందరికీ రుణపడి ఉంటానని కృతజ్ఞతలు చెప్పారు.

Updated Date - 2023-01-26T00:34:31+05:30 IST