‘ఖాళీ’ కార్పొరేషన్లు

ABN , First Publish Date - 2023-01-25T00:18:36+05:30 IST

బీసీ కార్పొరేషన్లు నిధులు లేక నిరుపయోగంగా మారుతున్నాయి. బీసీల అభివృద్ధి కోసం అంటూ రెండేళ్ల కిందట ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆ తర్వాత వాటికి నిధులు విదల్చడం లేదు. చైర్మన్‌లు, బోర్డు డైరెక్టర్‌లు ఏ పనీ చేయలేక.. కనీస స్థాయిలో రుణాలు ఇవ్వలేక నిరాశలో పడ్డారు.

‘ఖాళీ’ కార్పొరేషన్లు
బీసీ కార్పొరేషన్‌ కార్యాలయం

నిధులు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం

అలంకారప్రాయంగా మారిన వైనం

సబ్సిడీ రుణాల నిరుద్యోగుల ఎదురుచూపు

నెల్లిమర్ల, జనవరి 24 : బీసీ కార్పొరేషన్లు నిధులు లేక నిరుపయోగంగా మారుతున్నాయి. బీసీల అభివృద్ధి కోసం అంటూ రెండేళ్ల కిందట ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆ తర్వాత వాటికి నిధులు విదల్చడం లేదు. చైర్మన్‌లు, బోర్డు డైరెక్టర్‌లు ఏ పనీ చేయలేక.. కనీస స్థాయిలో రుణాలు ఇవ్వలేక నిరాశలో పడ్డారు. పదవుల్లో ఉన్నామని చెప్పుకుంటూ సంతృప్తి పడుతున్నారు. గతంలో ఏటా వెనుకబడిన తరగతుల్లో పేద నిరుద్యోగులకు సబ్సిడీ రుణాలు అందేవి. వాటితో సొంత కాళ్లపై వ్యాపారాలు చేసుకుని రాణించేవారు. ఇంకొందరు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. 56 కులాలకు కార్పొరేషన్లు అయితే ఏర్పాటుచేసిన ప్రభుత్వం వాటికి కార్యవర్గాలను నియమించి వదిలేసింది. వారంతా దిష్టిబొమ్మల్లా మిగిలిపోవాల్సి వచ్చింది. ప్రభుత్వ వాటా లేక బ్యాంకులు కూడా రుణాలు మంజూరు చేసేందుకు ముందుకు రావడం లేదు. రుణాల కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నప్పటికీ వారికి న్యాయం జరగడం లేదు. నెల్లిమర్లకు చెందిన అప్పారావు అనే యువకుడు ఆటో కోసం కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. గత ఏడాది ఇంటర్వ్యూ సైతం పూర్తయింది. నేటికీ రుణం అందలేదు. దీంతో రుణంపై ఆశలు వదులుకున్న ఆయన ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకున్నాడు. ఇదే పరిస్థితి అందరిదీ. రాయితీ రుణ పథకాలన్నీ నిలిచిపోయాయి.

గత ప్రభుత్వ హయాంలో 16 కార్పొరేషన్లు ఉండగా ఈ ప్రభుత్వం 56కి పెంచింది. సామాజిక వర్గానికి ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసింది. చైర్మన్‌తో పాటు సభ్యులను నియమించింది. ఆయా సామాజికవర్గాల సంక్షేమానికి కానీ..నిరుద్యోగ యువతకు కాని రుణ పథకాలు ప్రకటించడం లేదు. గతంలో సంక్షేమ శాఖలు ప్రకటించే వార్షిక ప్రణాళికల కోసం నిరుద్యోగ యువత ఎరుదుచూసేవారు. వెనుకబడిన తరగతుల వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కులాల వారీ ఏర్పాటు చేసుకునే సంఘాల (ఫెడరేషన్లు)కు 50 శాతం సబ్సిడీతో కూడిన గ్రూపు రుణాలను అందించేవారు. గరిష్టంగా రూ.30 లక్షల వరకూ మంజూరు చేసేవారు. 2017- 18 ఆర్థిక సంవత్సరం వరకూ రాయతీ రుణాల మంజూరు ప్రక్రియ సక్రమంగానే సాగింది. 2018-19కి సంబంధించి ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు తదితర కార్పొరేషన్ల పరంగా రూ.150 కోట్ల రుణం లక్ష్యంగా నిర్ణయించి 11 వేలకు పైగా యూనిట్ల ఏర్పాటు కోసం లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఆ సమయంలో సార్వత్రిక ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో రుణాలు మంజూరు ప్రక్రియను నిలిపివేశారు. ఎన్నికలు పూర్తయిన తరువాత ఆ రుణాల గురించే మరిచిపోయారు.

నేరుగా ఆర్థిక సాయం

ప్రభుత్వం చేయూత, ఆసరా, కాపునేస్తం వంటి పథకాల ద్వారా అర్హులైన వారందరికీ ఏటా నేరుగా నగదు అందజేస్తోంది. వాటి ద్వారా ఉపాధి పొందాలి. ప్రభుత్వం అందజేసిన నగదును సొంత అవసరాలకు కాకుండా ఉపాధి పొందేందుకు వినియోగిస్తే మంచిది. కుల వృత్తుల వారికి చిన్న మొత్తంలో రుణాలు మంజూరు చేస్తున్నాం.

- పెంటాజిరావు, ఈడీ, బీసీ కార్పొరేషన్‌, విజయనగరం

Updated Date - 2023-01-25T00:18:36+05:30 IST