న్యాయం చేయండి

ABN , First Publish Date - 2023-02-02T00:17:22+05:30 IST

తప్పుడు ఫిర్యాదుతో విచారణ పేరిట గిరిజనుడిని పోలీసులు కొట్టారని గుమ్మలక్ష్మీపురం మండలం దుడ్డుకల్లు గ్రామస్థులు ఆరోపించారు.

న్యాయం చేయండి
గుమ్మలక్ష్మీపురం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న దుడ్డుకల్లు గ్రామస్థులు

విచారణ పేరుతో గిరిజనుడిని పోలీసులు కొట్టారని ఆరోపణ

తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా

పార్వతీపురం టౌన్‌/ గుమ్మలక్ష్మీపురం: తప్పుడు ఫిర్యాదుతో విచారణ పేరిట గిరిజనుడిని పోలీసులు కొట్టారని గుమ్మలక్ష్మీపురం మండలం దుడ్డుకల్లు గ్రామస్థులు ఆరోపించారు. ఈ మేరకు బుధవారం గుమ్మలక్ష్మీపురం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. న్యాయం చేయాలని గ్రామస్థులు, కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. దుడ్డుకల్లు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో మూడేళ్ల కిందట అదే గ్రామానికి చెందిన కొండగొర్రె కామరాజు పనిచేసేవాడు. జీతం సరిగ్గా ఇవ్వడం లేదనే కారణంతో మూడు నెలల కిందట అక్కడ పని మానేశాడు. అయితే దుడ్డుకల్లు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల డిప్యూటీ వార్డెన్‌ మండంగి సుబ్బారావు తమ హాస్టల్‌లో జనరేటర్‌ చోరీకి గురైందని గత నెల 22న ఎల్విన్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంతమంది అనుమాతుల పేర్లును చెప్పారు. దర్యాప్తులో భాగంగా ఆశ్రమ పాఠశాలలో గతంలో పనిచేసి మానేసిన కొండగొర్రె కామరాజును పోలీసులు గతనెల 31న విచారణ చేశారు. అయితే ఇదే సమయంలో కామరాజును పోలీసులు తీవ్రంగా కొట్టారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. తప్పుడు ఫిర్యాదుతోనే ఎల్విన్‌పేట పోలీసులు తీవ్రంగా కొట్టారని వారు గుమ్మలక్ష్మీపురం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ తహసీల్దార్‌ రాజేంద్రకు వినతిపత్రం ఇచ్చారు. ఈ విషయంపై డిప్యూటీ వార్డెన్‌కు వివరణ కోరగా జనరేటర్‌ చోరీకి గురైన విషయంపై గతనెల 22న ఎల్విన్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. అనుమానితుల పేర్లు ఇచ్చామని చెప్పారు. ఎల్విన్‌పేట సీఐ సత్యనారాయణను వివరణ కోరగా దర్యాప్తు చేసి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

జిల్లాకేంద్రాసుపత్రిలో బాధితుడు

ప్రస్తుతం పార్వతీపురం జిల్లాకేంద్రాసుపత్రిలో బాధితుడు చికిత్స పొందుతున్నాడు. అయితే ఆయన భార్య పార్వతి ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. మూడేళ్లుగా తన భర్త కామరాజు దొడ్డుకల్లు ఆశ్రమ పాఠశాలలో పనిచేసేవాడని, తగిన జీతం ఇవ్వకుండా వార్డెన్‌ వేధింపులకు గురి చేయడంతో మూడు నెలల కిందట మానేశాడని తెలిపింది. ఈ కారణంగానే వార్డెన్‌ తన భర్తపై పోలీసులకు తప్పుడు ఫిర్యాదులు చేశారని, ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు కామరాజుతోపాటు కుటుంబ సభ్యులను సీపీఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు పరామర్శించారు. నిజంగా జనరేటర్‌ దొంగతనం చేసి ఉంటే వార్డెన్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం కేసు పెట్టి కోర్టులో హాజరుపరచాలే తప్పా ఇలా కొట్టడం సరికాదన్నారు. ఎల్విన్‌ పేట పోలీసులతో పాటు ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎంపై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులతో పాటు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని, లేకుంటే భవిష్యత్‌లో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

Updated Date - 2023-02-02T00:17:24+05:30 IST