రవాణా వాహనాల పన్ను పెంపుపై ఉభయ తారక పరిష్కారం!

ABN , First Publish Date - 2023-01-25T04:31:10+05:30 IST

రవాణా వాహనాలపై త్రైమాసిక పన్ను పెంపుదలకు సంబంధించి లారీ యజమానుల సంఘాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి ఉభయ తారకంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ చెప్పారు.

రవాణా వాహనాల పన్ను పెంపుపై ఉభయ తారక పరిష్కారం!

లారీ యజమానుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా

ఇరుపక్షాలకూ ఆమోదయోగ్య నిర్ణయాలు తీసుకుంటాం

జూన్‌ నాటికి రాష్ట్రంలో రోడ్లు బాగు చేస్తాం

రవాణా శాఖ మంత్రి విశ్వరూప్‌ వెల్లడి

విజయవాడ, జనవరి 24(ఆంధ్రజ్యోతి): రవాణా వాహనాలపై త్రైమాసిక పన్ను పెంపుదలకు సంబంధించి లారీ యజమానుల సంఘాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి ఉభయ తారకంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ చెప్పారు. లారీ యజమానుల సంఘం నుంచి వచ్చిన సూచనలను ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లి సానుకూల నిర్ణయం తీసుకునేందుకు కృషి చేస్తామన్నారు. కృష్ణాజిల్లా లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ నేతృత్వంలో మంగళవారం విజయవాడలో రోడ్డు భద్రతా వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథి విశ్వరూప్‌ ఈ సందర్భంగా రవాణా రంగాన్ని కలవరపెడుతున్న జీఓ ఎంఎస్‌ నెంబర్‌ 1 పై స్పందించారు. త్రైమాసిక పన్ను పెంపుపై లారీ యజమానుల నుంచి వస్తున్న స్పందనను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. లారీ యజమానుల సంఘాలను ఇబ్బంది పెట్టేలా నిర్ణయాలు తీసుకోబోమని, ఉభయులకు ఆమోదయోగ్యమైన నిర్ణయాలనే తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో జూన్‌ నాటికి రోడ్లను బాగు చేస్తామని తెలిపారు. ఎంత ఖర్చు అయినా సరే రోడ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని సంబంధిత శాఖలకు సీఎం చెప్పారన్నారు. ప్రమాదాల నివారణకు ఎన్ని చర్యలు చేపడుతున్నా విజయవంతం కాలేకపోతున్నామని తెలిపారు. ప్రమాదాలను పూర్తిగా డ్రైవర్ల తప్పిదాలుగానే భావించటానికి వీల్లేదన్నారు. అనుకోని సంఘటనల వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.

కుక్కలు, మతిస్తిమితం లేని వారు ఒక్కసారిగా రోడ్లపైకి రావటంవల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఏటా 8 వేల మంది, సగటున రోజుకు 21 మంది రోడ్డు ప్రమాదాలకు చనిపోతున్నారని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని చెప్పారు. లారీ యజమానుల సంఘాలు ఇలాంటి బాధ్యతలు తీసుకోవటం అభినందనీయమన్నారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పీఎస్‌ ప్రద్యుమ్న మాట్లాడుతూ డ్రైవింగ్‌ లైసెన్స్‌, సేఫ్టీ డ్రైవింగ్‌ అనే అంశాలను ప్రజలు సీరియ్‌సగా తీసుకోకపోవటం కూడా సమస్యేనని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ అదనపు కమిషనర్‌ ఎస్‌ఏవీ ప్రసాదరావు, ఏపీ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు, కృష్ణాజిల్లా లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు తుమ్మల లక్ష్మణస్వామి, ఎన్‌హెచ్‌ రీజనల్‌ ఆఫీసర్‌ ఆర్‌కే సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T04:31:10+05:30 IST