క్షయ రోగులకు చేయూతనివ్వాలి

ABN , First Publish Date - 2023-01-25T00:37:50+05:30 IST

ప్రధానమంత్రి టి.బి. ముక్త్‌ భారత్‌ అభియాన్‌ పథకానికి విరాళాలిచ్చి క్షయ రోగులకు చేయూతనివ్వాలని జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి పిలుపునిచ్చారు.

క్షయ రోగులకు చేయూతనివ్వాలి
టీబీ రోగులకు పౌష్టికాహారం అందజేస్తున్న కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి

జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి

476 మందిని దత్తత తీసుకున్న హెటిరో ఫౌండేషన్‌

అనకాపల్లి టౌన్‌, జనవరి 24 : ప్రధానమంత్రి టి.బి. ముక్త్‌ భారత్‌ అభియాన్‌ పథకానికి విరాళాలిచ్చి క్షయ రోగులకు చేయూతనివ్వాలని జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక ఎన్టీఆర్‌ వైద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని 40 మంది టీబీ రోగులకు పౌష్టికాహారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులకు కావలసినది మందులు, పౌష్టికాహారమే కాకుండా వారిలో ఆత్మస్థైర్యం నింపాలన్నారు. 476 మంది టీబీ రోగులను దత్తత తీసుకున్న హెటిరో ఫౌండేషన్‌ నిర్వాహకులను ఆయన అభినందించారు. టీబీ రోగులు కోలుకునేందుకు సహాయం చేసేందుకు మరిన్ని పారిశ్రామిక సంస్థలు సీఎస్‌ఆర్‌ నిధులతో ముందుకు రావాలని ఆయన కోరారు. డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎ.హేమంత్‌ మాట్లాడుతూ కొంతమంది అధికారులు, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ఇప్పటికే టీబీ రోగులను దత్తత తీసుకున్నారని చెప్పారు. ప్రతి నెల వీరికి అందజేసే పౌష్టికాహారంలో రూ. 700లు విలువ చేసే పప్పులు, బెల్లం, చోడిపిండి ఉంటాయని తెలిపారు. హెటిరో ఫౌండేషన్‌ ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌కు రూ.20 లక్షల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌, హెటిరో సంస్థ ప్రతినిధులు పుల్లారెడ్డి, సుబ్బారెడ్డి, టీబీ మెడికల్‌ ఆఫీసర్‌ కృష్ణకుమార్‌, డీఐవో మురళీధర్‌, ఐఎంఏ డాక్టర్లు బెనర్జీ, గుప్తా పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T00:37:58+05:30 IST