బీమా ప్రీమియం బకాయి పేరుతో టోకరా
ABN , First Publish Date - 2023-01-25T03:57:53+05:30 IST
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారు.

మహిళ నుంచి 3.19 లక్షలు దోచేసిన సైబర్ నేరగాళ్లు
ఎండాడ (విశాఖపట్నం), జనవరి 24: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారు. తాజాగా ఇన్సూరెన్స్ పాలసీ బకాయి పేరిట విశాఖ నగరానికి చెందిన మహిళ నుంచి రూ.3,19,470 దోచేశారు. సైబర్ క్రైమ్స్టేషన్ సీఐ కె.భవానీప్రసాద్ అందించిన వివరాల ప్రకారం... పురుషోత్తపట్నానికి చెందిన మహిళకు మాక్స్లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి మాట్లాడుతున్నామంటూ కాల్స్ వస్తున్నాయి. మీరు తీసుకున్న పాలసీ రెన్యువల్ చేయాలని చెప్పడంతో ఆమె నమ్మలేదు. అయితే ఆధార్, పాన్, అడ్రస్, ఫోన్ నంబరు వివరాలు కరెక్ట్‌గా చెప్పడంతో నమ్మారు. వారు చెప్పిన బ్యాంకు ఖాతాకు దఫదఫాలుగా రూ.3,19,470 ట్రాన్స్ఫర్ చేశారు. ఆ మరుసటి రోజు ‘ఎన్‌పీసీఎల్ నుంచి కాల్ చేస్తున్నాం, మీరు పంపిన సొమ్ము ఫ్రాడ్ అకౌంట్‌కి వెళ్లింది. అది మొత్తం పాలసీగా మారాలంటే ప్రతి లావాదేవీకి రూ.15 వేలు కట్టాలి’ అంటూ మరోసారి ఫోన్ వచ్చింది. దీంతో ఆమె మాక్స్లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాలయానికి వెళ్లారు. తమ సంస్థ నుంచి అలాంటి కాల్స్ చేయబోమని వారు తెలపడంతో తాను మోసపోయినట్టు గుర్తించి కేసు పెట్టారు.