రూ.కోట్లు వ్యయం.. నెరవేరని లక్ష్యం!

ABN , First Publish Date - 2023-01-26T01:02:50+05:30 IST

బాలల సత్వర ఆరోగ్య కేంద్రం కోసం కోట్లు వెచ్చించినా అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు. సిబ్బంది కొరత, ఆస్పత్రిలో సరైన సదుపాయాలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రూ.కోట్లు వ్యయం.. నెరవేరని లక్ష్యం!
పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఆటల పరికరాలు

బాలల సత్వర చికిత్సా కేంద్రానికి వెంటాడుతున్న సిబ్బంది కొరత, సౌకర్యాల లేమి

ఫర్నిచర్‌ సరఫరా చేయని అధికారులు

శానిటేషన్‌ సిబ్బందిని నియమించని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు

నర్సీపట్నం, జనవరి 25: బాలల సత్వర ఆరోగ్య కేంద్రం కోసం కోట్లు వెచ్చించినా అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు. సిబ్బంది కొరత, ఆస్పత్రిలో సరైన సదుపాయాలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శానిటేషన్‌ సిబ్బంది నియామకం లేక ఆస్పత్రి ప్రాంగణం అపరిశుభ్రంగా ఉంటుంది. సౌకర్యాలు లేకపోవడంతో ఆస్పత్రిలో వైద్య సేవలు కూడా అంతంతమాత్రంగా అందుతున్నాయని ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. మేనరికపు వివాహాలు, జన్యు పరమైన లోపాలు, ఆలస్య గర్బధారణ తదితర కారణాలతో జన్మించిన పిల్లలకు ఇక్కడ వైద్య సేవలు అందిస్తారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈ చికిత్సా కేంద్రాలు విశాఖ కేజీహెచ్‌, పాడేరు ఆస్పత్రులలో ఉండేవి. గత ఏడాది అనకాపల్లి, నర్సీపట్నంల్లో మరో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశారు. జాతీయ ఆరోగ్య మిషన్‌ నిధులతో రాష్ట్రీయ బాల ఆరోగ్య కార్యక్రమం(ఆర్‌బీఎస్‌కే)లో భాగంగా ప్రాంతీయ ఆస్పత్రి ఎదురుగా రూ.1.6 కోట్ల వ్యయంతో ఆస్పత్రి భవనాన్ని నిర్మించారు. గత ఏడాది జూన్‌ 13న జిల్లా బాలల సత్వర చికిత్సా కేంద్రాన్ని ఎమ్మెల్యే పెట్ల

ఉమాశంకర్‌ గణేశ్‌ అట్టహాసంగా ప్రారంభించారు. చిన్న పిల్లల వైద్య నిపుణులు, ఎంబీబీఎస్‌ వైద్యుడు, దంత వైద్య నిపుణుడు, డెంటల్‌ టెక్నీషియన్‌, ఫిజియోథెరఫిస్టు, సైకాలజిస్టు, స్పెషల్‌ ఎడ్యుకేటర్‌, స్పీచ్‌ థెరఫిస్టు, ఆప్తొమెట్రిస్ట్‌, సోషల్‌ వర్కర్‌, ఇద్దరు స్టాఫ్‌ నర్సులు పోస్టులు మంజూరు చేశారు. రక్తహీనత, విటమిన్‌-ఏ లోపం, పెదవి చీలిక, పుట్టుకతో వచ్చే కంటి శుక్లం, చెవుడు, గుండె జబ్బులు, మానసిక క్షీణత తదితర 40 పైగా లోపాలతో పుట్టిన 0-18 ఏళ్ల లోపు పిల్లలకు వైద్య సేవలు అందిస్తారు. అవసరమైన వారికి ఫిజియోథెరఫీ చేయించడానికి ఏర్పాటు చేశారు. పిల్లలకు సత్వరమే లోపాలను గుర్తించి మెరుగైన వైద్య సేవలు అవసరమైన వారిని విశాఖపట్నం కేజీహెచ్‌కి తరలిస్తారు.

నెరవేరని లక్ష్యం..

బాలల సత్వర ఆరోగ్యం కేంద్రం ఏర్పాటు చేయాలన్న ఉద్దేశం మంచిదే గాని కేంద్రాలలో సరైన సౌకర్యాలు లేని కారణంగా ఉపయోగపడడం లేదు. లోపాలతో పుట్టే పిల్లలకు వైద్య సేవలు అందించడానికి ఇక్కడ ఆస్పత్రి ఉందన్న సంగతే చాలా మందికి తెలీయదు. రోజుకి పది మంది పేషెంట్లు కూడా ఓపీకి రాని పరిస్థితి ఉంది. ఆస్పత్రికి వైద్య సిబ్బందిని మంజూరు చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు శానిటేషన్‌ సిబ్బందిని ఇవ్వలేదు. దీంతో ఆస్పత్రి పరిసరాలు పరిశుభ్రత ఉండడం లేదు. అప్పుడప్పుడు ఏరియా ఆస్పత్రి శానిటేషన్‌ సిబ్బంది వచ్చి శుభ్రం చేస్తున్నారు. రూ.కోటి వెచ్చించి భవనం నిర్మించారు..కాని కుర్చోవడానికి ఒక ప్లాస్టిక్‌ స్టూల్‌ కూడా ఏర్పాటు చేయలేదు. కేవలం వైద్యులకు మాత్రమే బల్లలు, కుర్చీలు ఉన్నాయి. పిల్లలను తీసుకొని ఆస్పత్రికి వచ్చే పేరెంట్స్‌ కోసం ఫర్నిచరు ఏర్పాటు చేయలేదు. దీంతో ఆస్పత్రి వచ్చినవారి పిల్లలు వైద్య సేవలు పొందే వరకు గంటల తరబడి నిలబడి ఉండాల్సి వస్తుంది. స్పీచ్‌ థెరఫిస్టు, ఆప్తోమెట్రిస్ట్‌ పోస్టులు భర్తీ చేయకపోవడంతో కేసులు కేజీహెచ్‌కి తరలిస్తున్నారు. దీంతో బాలల సత్వర చికిత్సా కేంద్రం లక్ష్యం బూడిదలో పోసిన కన్నీరులా తయారైందని ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి.

Updated Date - 2023-01-26T01:02:55+05:30 IST