అప్పులాంధ్రప్రదేశ్‌గా మార్చిన ఘనత జగన్‌దే

ABN , First Publish Date - 2023-01-25T00:36:00+05:30 IST

రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్‌గా మార్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని తెలుగుదేశం పార్టీ చోడవరం నియోజకవర్గం ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు అన్నారు.

అప్పులాంధ్రప్రదేశ్‌గా మార్చిన ఘనత జగన్‌దే
మంగళాపురంలో ఇదేం ఖర్మ ర్యాలీలో పాల్గొన్న తాతయ్యబాబు

బుచ్చెయ్యపేట, జనవరి 24: రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్‌గా మార్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని తెలుగుదేశం పార్టీ చోడవరం నియోజకవర్గం ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు అన్నారు. మంగళవారం రాత్రి మంగళాపురంలో ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఇంటింటికెళ్లి పెరిగిన నిత్యావసర ధరలు, పెరిగిన డీజిల్‌, పెట్రోల్‌ ధరలను వివరించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం రూ.9.99 లక్షల కోట్ల రుణభారంలో మునిగిపోయిందన్నారు. జగన్‌ పగ్గాలు చేపట్టే నాటికి ఏపీ అప్పులు రూ.3.62 లక్షల కోట్ల కాగా, గత మూడేళ్లలో జగన్‌ చేసిన అప్పు రూ.637 లక్షల కోట్లు అని అన్నారు. అసమర్థ పాలన కారణంగా రాబడి పడిపోగా, రెవెన్యూ లోటు పెరిగిందన్నారు. అప్పులు తీర్చడానికి అప్పులు చేస్తున్న ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చిన నిధులను విద్యుత్‌ బకాయిల కింద జమ చేయడంతో పంచాయతీలో పారిశుధ్యం నిర్వహణకు సర్పంచులు అప్పులు చేస్తున్నారన్నారు. పరిమితికి మించి చేస్తున్న అప్పులు ఏమవుతున్నాయో? ఎవరి జేబుల్లోకి వెళుతున్నాయో అర్థం కావడం లేదన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఏపీని గట్టెక్కించే సత్తా ఒక్క చంద్రబాబునాయుడుకే ఉన్నందున, ఆయను సీఎంగా గెలిపించాలని తాతయ్యబాబు కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు గోకివాడ కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు పత్తి రాము, అల్లంకి వెంకటఅప్పారావు, ధనబాబు, సాయం శేషు, సింగంపల్లి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T00:36:00+05:30 IST