గిరిజనాభివృద్ధికి ప్రాధాన్యం

ABN , First Publish Date - 2023-02-02T00:36:03+05:30 IST

కేంద్ర బడ్జెట్‌లో ఆదివాసీల అభివృద్ధికి పెద్దపీట వేశారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, విద్యుత్‌, తాగునీరు, వైద్య, విద్యా రంగాల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించారు.

గిరిజనాభివృద్ధికి ప్రాధాన్యం
జీకే వీధి ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌

కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు

ఏకలవ్య మోడల్‌ స్కూళ్లలో పోస్టుల భర్తీ

2047 నాటికి సికిల్‌ సెల్‌ ఎనీమియా రహితమే లక్ష్యం

గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా నిధులు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

కేంద్ర బడ్జెట్‌లో ఆదివాసీల అభివృద్ధికి పెద్దపీట వేశారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, విద్యుత్‌, తాగునీరు, వైద్య, విద్యా రంగాల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించారు. అలాగే గిరిజన బాలలకు కార్పొరేట్‌ స్థాయిలో ఆశ్రమ విద్యను అందించేందుకు ఉద్దేశించిన ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీతో పాటు ఆయా స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్‌లో చోటు దక్కింది.

ఏజెన్సీలో ప్రతి మండలానికి ఒకటి చొప్పున ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ను ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఆయా స్కూళ్లకు భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో గిరిజన ప్రాంతంలో రోడ్డు, రవాణా సేవలు మెరుగుపడడంతోపాటు, ఏకలవ్య స్కూళ్లను పటిష్ఠం చేయడంతో గిరిజన విద్య మెరుగుపడేందుకు అవకాశం దక్కనుంది.

సికిల్‌ సెల్‌ ఎనీమియా నిర్మూలనకు ప్రాధాన్యం

గిరిజన ప్రాంతాల్లో మినహా మరెక్కడా లేని అరుదైన వ్యాధి సికిల్‌ సెల్‌ ఎనీమియాను 2047 నాటికి పూర్తిగా నిర్మూలించాలని కేంద్ర బడ్జెట్‌లో పేర్కొన్నారు. గిరిజనులు అత్యధికంగా సికిల్‌ సెల్‌ ఎనీమియాతోనే బాధపడుతున్నారు. ఈ వ్యాధి సోకిన వాళ్లకు తరచూ రక్తహీనతతో పాటు ఇతర రోగాలు త్వరగా వస్తుంటాయి. అలాగే చలి వాతావరణంలో ఈ బాధితులు జీవనం సాగించలేరు. దీంతో గిరిజన ప్రాంతంలో సికిల్‌ సెల్‌ ఎనీమియా అనేది ఒక భయంకరమైన వ్యాధిగానే భావిస్తారు. అటువంటి అరుదైన వ్యాధిని సంపూర్ణంగా నిర్మూలించేందుకు కేంద్రం నడుంబిగించడంపై గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-02-02T00:36:07+05:30 IST