రోగులకు మెరుగైన వైద్య సేవలు అందాలి

ABN , First Publish Date - 2023-02-07T00:24:29+05:30 IST

వైద్య ఆరోగ్య సిబ్బంది స్థానికంగా ఉంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి సి.జమాల్‌ బాషా సూచించారు.

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందాలి
మినుములూరు పీహెచ్‌సీలో రికార్డులు పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో జమాల్‌ బాషా

డీఎంహెచ్‌వో జమాల్‌ బాషా

పాడేరు రూరల్‌, ఫిబ్రవరి 6: వైద్య ఆరోగ్య సిబ్బంది స్థానికంగా ఉంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి సి.జమాల్‌ బాషా సూచించారు. పాడేరు డివిజన్‌ పరిధిలోని 35 పీహెచ్‌సీలలో కొత్తగా నియమితులైన ఎంఎల్‌హెచ్‌పీల రెండో బ్యాచ్‌కు సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రోగులకు అందించే వైద్య సేవల గురించి వివరించారు. మాతాశిశు మరణాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, గర్భిణుల తనిఖీలు, బాలింత, శిశువులు తీసుకోవాల్సిన పౌష్టికాహారం, వ్యాధుల నిర్ధారణకు చేపట్టే 14 రకాల పరీక్షలు తదితర అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. కాన్పుకు సిద్ధంగా ఉన్న గర్భిణులను బర్త్‌ వెయిటింగ్‌ హోమ్‌లలో చేర్పించి ఆస్పత్రిలో ప్రసవాలు జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సింధూరం పడాల్‌, విఘ్నేష్‌, జిల్లా గణాంకాధికారి జె.కైలాస్‌, జిల్లా టీబీ పర్యవేక్షకులు వి.కిరణ్‌ పాల్గొన్నారు.

మినుములూరు పీహెచ్‌సీ ఆకస్మిక తనిఖీ

పీహెచ్‌సీలలోనే సుఖప్రసవాలు జరిగేలా వైద్యులు, క్షేత్ర స్థాయి వైద్య సిబ్బంది చర్యలు చేపట్టాలని డీఎంహెచ్‌వో జమాల్‌ బాషా ఆదేశించారు. సోమవారం మినుములూరు పీహెచ్‌సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. పీహెచ్‌సీలో జరుగుతున్న ప్రసవాలపై ఆరా తీశారు. మందుల గది, వార్డులను పరిశీలించిన అనంతరం పీహెచ్‌సీ రికార్డులను తనిఖీ చేశారు. ముందస్తు సమాచారం లేకుండా వైద్యులు, సిబ్బంది సెలవులు పెట్టవద్దని ఆదేశించారు. ఆయన వెంట వైద్యాధికారి గోపాలకృష్ణ, వి.కిరణ్‌, వైద్య సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2023-02-07T00:24:33+05:30 IST