చెట్టును బైక్‌ ఢీకొని ఒకరి దుర్మరణం

ABN , First Publish Date - 2023-02-02T01:24:53+05:30 IST

మండల కేంద్రమైన ఎస్‌.రాయవరం సమీపంలో చెట్టును బైక్‌ ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, బాలికకు తీవ్ర గాయాలయ్యాయి.

చెట్టును బైక్‌ ఢీకొని ఒకరి దుర్మరణం
దుర్గాప్రసాద్‌ (ఫైల్‌)

ఎస్‌.రాయవరం, ఫిబ్రవరి 1 : మండల కేంద్రమైన ఎస్‌.రాయవరం సమీపంలో చెట్టును బైక్‌ ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ ప్రసాదరావు తెలిపిన వివరాలివి. రాంబిల్లి మండలం కలవలాపల్లి గ్రామానికి చెందిన గుడబండి దుర్గాప్రసాద్‌ (23) తన భార్య ఎస్‌.రాయవరంలో గల పుట్టింట్లో ఉండడంతో ఆమెను చూసేందుకు పదో తరగతి చదువుతున్న తన పెద్దమ్మ కుమార్తె భవనీని వెంటబెట్టుకొని బుధవారం బైక్‌పై బయల్దేరాడు. సర్వసిద్ధి గ్రామం దాటిన తరువాత ఎస్‌.రాయవరం సమీపానికి వెళ్లేసరికి ప్రమాదవశాత్తు రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొన్నాడు. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరూ కాలువలో పడిపోయారు. దుర్గాప్రసాద్‌ తలకు తీవ్ర గాయం కావడంతో అతడు అక్కడిక్కడే మృతి చెందగా, అతని చెల్లెలు భవానీకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదాన్ని చూసినవారు వెంటనే 108కి సమాచారం అందించడంతో సదరు వాహనంలో భవానీని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు.

రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

పాయకరావుపేట, ఫిబ్రవరి 1 : పట్టణంలోని నాగరాజుపేట రైల్వే గేటు సమీపంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. తొలుత తీవ్ర గాయాలతో పడివున్న అతనిని చూసినవారు 108 సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి పరీక్షించిన అనంతరం మృతిచెందినట్టు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. అయితే చనిపోయిన వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉందని సదరు సిబ్బంది నాగార్జున, గౌరీ తెలిపారు.

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

హుకుంపేట, ఫిబ్రవరి 1: ఆంధ్రా, ఒడిశా సరిహద్దులోని పామురాయి సమీపంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైందని ఎస్‌ఐ సతీష్‌ తెలిపారు. పశువుల కాపరులు ఇచ్చిన సమాచారం మేరకు వెంటనే వెళ్లి పరిశీలించా మన్నారు. అయితే కాళ్లు తప్పితే మిగిలిన అవయవాలు గుర్తు పట్టలేనంతగా ఉన్నాయని, మృతి చెందిన వ్యక్తి పురుషుడిగా అనుమానిస్తున్నామని, ఒడిశా పోలీసులకు ఈ సమాచారం అందిస్తామని ఎస్‌ఐ తెలిపారు.

లలితాదేవి ఆలయంలో 112 తులాల వెండి చోరీ

చీడికాడ, ఫిబ్రవరి 1: మండలంలోని అప్పలరాజుపురంలో గల లలితాదేవి ఆలయంలో మంగళవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి 112 తులాల వెండి ఆభరణాలను అపహరించుకుపోయినట్టు సర్పంచ్‌ చుక్క అప్పలనాయుడు చీడికాడ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హెడ్‌ కానిస్టేబుల్‌ బి.గోవింద బృందం ఘటనా స్థలానికి విచ్చేశారు. అనకాపల్లి జిల్లా క్లూస్‌ టీమ్‌కు ఈ సమాచారం అందించడంతో వారు వచ్చి పరిసరాలను క్షణ్ణంగా పరిశీలించారు. 58 తులాలు అమ్మవారి కిరీటం, 40 తులాల హారం, 14 తులాల హస్తాన్ని దొంగలు ఎత్తుకుపోయినట్టు సర్పంచ్‌ ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-02-02T01:24:55+05:30 IST